ఆదివారం 06 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Feb 07, 2020 , 01:52:00

వనం విడిచి జనంలోకి సమ్మక్క

వనం విడిచి జనంలోకి సమ్మక్క
  • భక్తుల రాకతో కిటకిటలాడిన బొజ్జాయిగూడెం, తోగ్గూడెం
  • కొలువుదీరిన వన దేవతలు
  • మొక్కులు తీర్చుకున్న భక్తులు
  • మినీ మేడారాన్ని తలపించిన జాతర

ఇల్లెందు రూరల్‌/మణుగూరురూరల్‌/కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/కొత్తగూడెం అర్బన్‌: మేడారం జాతరను తలపిస్తూ ఇల్లెందు మండలంలోని బొజ్జాయిగూడెం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్నది.. బుధవారం సారలమ్మ గద్దెల మీదకు చేరుకోగా గురువారం ఆదివాసీ సంప్రదాయ పద్ధతుల్లో డప్పు వాయిద్యాల నడుమ సమ్మక్క తల్లిని గద్దె మీదకు చేర్చారు. రహదారి పొడవునా భక్తులు సమ్మక్క తల్లికి జలాభిషేకం చేశారు. బొజ్జాయిగూడెం సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి సమ్మక్కను గద్దెల మీదకు తరలించే దృశ్యాన్ని తలికించేందుకు మూడు కిలోమీటర్ల దూరం భక్తులు బారులు తీరారు. తల్లీకూతుళ్లు గద్దెల మీదకు చేరడంతో తల్లులను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. భక్తులు నిలువెత్తు బంగారం, మేకలు, కోళ్లతో మొక్కులు చెల్లించుకొని తరించారు. జాతర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.


నిండుగా తోగ్గూడెం జాతర

 మణుగూరు మండలం తోగ్గూడెం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా అమ్మవార్లను దర్శించుకునేందుకు గురువారం అధిక సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. అత్యంత భక్తిశ్రద్ధలతో డప్పుచప్పుళ్లు, గిరిజన నృత్యాల నడుమ పూజారులు సమ్మక్క తల్లిని మణుగూరు రైల్వేస్టేషన్‌ మార్గంలోని అడవి వద్ద నుంచి గద్దెకు తీసుకువచ్చారు. భక్తులు తల్లులను దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. మొక్కులను సమర్పించుకున్నారు. మణుగూరు, పినపాక, కరకగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు, గుండాల, భద్రాచలం, పాల్వంచ, చర్ల, దుమ్మగూడెం మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో జారతకు తరలివచ్చారు. మణుగూరు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పకడ్బందీగా బందోబస్తు నిర్వహించారు. మణుగూరు డీఏస్పీ రామానుజం పర్యవేక్షణలో మణుగూరు సీఐ ఎంఏ షుకూర్‌ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.  


కిక్కిరిసిన గరీబ్‌పేట..

సుజాతనగర్‌ మండలంలోని మినీ మేడారంగా ప్రసిద్ధి చెందిన గరీబ్‌పేట సమ్మక్క - సారలమ్మ జాతరకు గురువారం భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆవరణ అంతా కిటకిటలాడింది. సుజాతనగర్‌, చండ్రుగొండ, జూలూరుపాడు, చుంచుపల్లి మండలాల నుంచి అధిక సంఖ్యలో గరీబ్‌పేట సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. 


మూడు రోజులు మురిపెంగా సంబురం..

కొత్తగూడెం డివిజన్‌ పరిధిలో జరిగే మినీ మేడారం జాతరలకు భక్తులు భారీగానే తరలి వస్తున్నారు. కొత్తగూడెం పరిధిలో పాల్వంచ, సుజాతనగర్‌, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, రామవరం, గరీబ్‌పేట, ప్రాంతాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అన్ని గద్దెల వద్దకు తల్లులను డప్పుల చప్పుళ్లు, గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో తీసుకువచ్చారు.