బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 07, 2020 , 01:50:01

సహకార ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం

సహకార ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం
  • తొలిరోజు 72 దాఖాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :    జిల్లాలోని సహకార సంఘాల ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ గురువారం ప్రారంభమైంది. 21 సొసైటీలకు తొలిరోజు 72 నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 21 సొసైటీలకు 14 సొసైటీల్లో తొలిరోజు 72 మంది నామినేషన్లు వేయగా, 7 సొసైటీలకు ఒక్కనామినేషన్‌ కూడా దాఖలు కా లేదు. మూడ్రోజుల పాటు కొనసాగే ఈ ప్రక్రియకు చివరి రోజు అత్యధికంగా నామినేషన్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.ఇప్పటికే రాజకీయ నాయకులు డైరెక్టర్లుగా పోటీ చేసే అభ్యర్థులను గుర్తించడంతో నామినేషన్లు వేసేందుకు అన్నిధ్రువపత్రాలతో సమాయత్తమవుతున్నారు. సొసైటీల పరిధిలో రైతుల ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేసి డీఫాల్టర్ల లిస్టును కూడా కార్యాలయాల వద్ద ప్రచురించారు. దీంతో ఓటరుగా ఉన్న రైతు సభ్యులు మాత్రమే పోటీలో ఉండేందుకు అర్హులుగా తేల్చడంతో, అర్హులైన అభ్యర్థులే పోటీ చేసేందుకు అన్ని ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. తొలిరోజు మంచి ముహూర్తుం లేనందున కొందరు నామినేషన్లు దాఖలు చేయలేదు. 


తొలిరోజు నామినేషన్ల జోరు

జిల్లాలోని 21 సహకార సంఘాలకు 14సొసైటీలకు మాత్ర మే తొలిరోజు నామినేషన్లు దాఖలయ్యాయి. మిగిలిన పాల్వం చ, బేతుపల్లి, ఇల్లెందు, గుంపెన, చర్ల, అశ్వాపురం, భద్రాచలం సొసైటీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 14 సొసైటీల్లో కొత్తగూడెం-3, గానుగపాడు-2 అశ్వారావుపేట-1, నారాయణపురం-1, ములకలపల్లి-9, దమ్మపేట-12, గుండాల-1, జూలూరుపాడు-2,దుమ్ముగూడెం-4,సత్యనారాయణపురం-8, బూర్గంపాడు-7, నెల్లిపాక-2, మణుగూరు-12, పినపాక-8 చొప్పున అభ్యర్థులు  నామినేషన్లు దాఖలు చేశారు. 


21మంది ప్రత్యేకాధికారుల నియామకం

సహకార సంఘం ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు కలెక్టర్‌ ఎంవీ రెడ్డి సొసైటీలకు ప్రత్యేక అధికారులను నియమించారు. దమ్మపేట సొసైటీకి వేణుగోపాలరావు, అశ్వారావుపేటకు షకీరాబాను, నారాయణపురానికి డీఎస్‌వీ ప్రసాద్‌, బూర్గంపాడుకు చంద్రప్రకాష్‌, ములకలపల్లికి జహీరుద్దీన్‌, పాల్వంచకు కందుల రాజేష్‌, కొత్తగూడేనికి కృపాకర్‌రావు, జూలూరుపాడుకు సుధాకర్‌, గానుగపాడుకు పులిరాజు, గుంపెనకు నరేందర్‌, మణుగూరుకు ప్రసాద్‌, నెల్లిపాక బంజరకు మేఘావత్‌ బాలు, అశ్వాపురానికి అభిమన్యుడు, పినపాకకు రాచమళ్ల రమణ, భద్రాచలానికి రాముడు, సత్యనారాయణపురానికి సీతారాంనాయక్‌, చర్లకు పాషా, దుమ్ముగూడేనికి అర్జున్‌రావు, ఇల్లెందుకు మరియన్న, గుండాలకు వెంకటరమణ, బేతంపూడికి సల్మాబానును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఆయా సొసైటీల్లో పర్యవేక్షించనున్నారు. 


ఏకగ్రీవం దిశగా అశ్వాపురం..?

జిల్లాలోని 21 సొసైటీల్లో ఈ నెల 15వ తేదీన ఎన్నికలు జరుగనున్నందున ముందస్తుగా రాజకీయ నాయకులు సొసైటీలను ఏకగ్రీవం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పినపాక నియోజకవర్గం అశ్వాపురం సొసైటీని ఏకగ్రీవం చేసేందుకు రాజకీయ నాయకులు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు, గతంలో సొసైటీ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉన్న తుళ్లూరి బ్రహ్మయ్యను మరోసారి చైర్మన్‌గా చేసేందుకు అక్కడి సొసైటీ సంఘం నాయకులు, రైతులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. నామినేషన్ల స్వీకరణ పూర్తి కాగానే ఉప సంహరణ రోజున ఏకగ్రీవాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది. 


అభ్యర్థుల ఎంపిక కోసం..

సొసైటీ ఎన్నికల్లో డైరెక్టర్లు, చైర్మన్‌ అభ్యర్థుల కోసం రాజకీయ నాయకులు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. అన్ని ఎన్నికలతో పాటు సొసైటీ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ విజయకేతనం ఎగురవేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. 21సొసైటీలను టీఆర్‌ఎస్‌ ఖాతాలో వేసుకునేందుకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు. సొసైటీ పరిధిలో 13మంది డైరెక్టర్లను కైవసం చేసుకొని చైర్మన్‌ పదవులను కూడా దక్కించుకునేందుకు వ్యూహం రచిస్తున్నారు. భద్రాచలం సొసైటీలో కేవలం 40 మంది ఓటర్లే ఉం డటంతో అక్కడ ఎన్నిక చేతులెత్తే పద్ధతిన నిర్వహించనున్నారు. దీంతో 40 మంది ఓటర్లు 13 మంది డైరెక్టర్లను, చైర్మన్‌ను కూడా చేతులెత్తే పద్ధతిలో ఎన్నుకునే అవకాశం ఉంది.