బుధవారం 03 జూన్ 2020
Badradri-kothagudem - Feb 07, 2020 , 01:46:11

అతివేగం ప్రాణాంతకం

అతివేగం ప్రాణాంతకం

లక్ష్మీదేవిపల్లి: యువత బైక్‌ రైడింగ్‌లతో హోరెత్తిస్తున్నారు. మార్కెట్‌లోకి కొత్త మోడళ్ల బైక్‌లు రావడంతో వాటిని కొనుగోలు చేసిన యువకులు అదుపు లేకుండా రైడింగ్‌ చేస్తున్నారు. అతివేగంతో తోటి వాహనదారులకు ఇబ్బందుల కలిగిస్తూ, సైలెన్సర్ల మోతలతో హడలెత్తిస్తున్నారు. దీంతో వారి ప్రాణాలనే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. పోలీస్‌ శాఖ తనిఖీలు చేస్తూ అటువంటి వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నప్పటికీ పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. వీరికి కేవలం కౌన్సెలింగ్‌ ఇచ్చి.. జరిమానా విధించి వదిలేస్తుండటంతో మళ్లీ షరా మామూలుగానే బైక్‌ రైడింగ్‌లు కొనసాగుతున్నాయి. ప్రతి చోట ట్రాఫిక్‌ పోలీసులతో తనిఖీలు నిర్వహించినట్లయితే కొద్దిగా అదుపులో ఉండే అవకాశం ఉంది.


అతివేగంతో అనర్థం..

పట్టణ ప్రాంతాల్లో ఇరుకైన రోడ్లు, రద్దీ ప్రాంతం అయినప్పటికీ యువకులు మాత్రం తమ బైక్‌లలో అతివేగంతో వెళ్తుంటారు. బైక్‌ నడిపే యువత మాత్రం ఏదో లోకంలో విహరిస్తున్నట్లు కటింగ్‌లు ఇస్తూ తోటి ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేస్త్తుంటారు. ఇలా వెళ్తున్న యువకులు పలుచోట్ల ప్రమాదాలకు గురైన సందర్భాలు కోకొల్లలు.. అయినప్పటికీ వారిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. బైక్‌ చేతికి వస్తే చాలు అతివేగంగా వెళ్లడమే హీరోయిజం అనుకుంటారేమో ఏమో గాని వాళ్ల అతివేగం ప్రమాదాల బారిన పడుతున్నా.. వారి తీరులో మార్పు రావడం లేదు. కొత్తగా వచ్చే ఖరీదైన బైక్‌లు వేగంగా వెళ్తుంటాయి. అటువంటి బైక్‌లను కొనుగోలు చేస్తున్న యువత అదే స్పీడ్‌లో వెళ్తుంటారు. అయితే అటువంటి వాహనాలు ఎక్కువగా విదేశాల్లో ఆ రోడ్లకు వేగంగా వెళ్లేందుకు తయారు చేస్తారు. మన వద్ద ఉండే రోడ్లపై.. రద్దీకి అంత వేగంగా వెళ్తే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనిపై అవగాహన లేకుండానే అదే స్పీడ్‌తో వాహనాలను నడుపుతున్నారు. అలాగే మద్యం తాగి కూడా వాహనాలను ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారు. కొందరు యువకులు బండిపై సర్కస్‌ ఫీట్లు చేస్తూ చేతులు వదిలేసి..  ఆనందం పొందుతున్నారు. బండ్లపై అనేక రకాల విన్యాసాలు చేస్తూ వెళ్తున్నారు. వీరి చేష్టలకు పక్కన వాహనదారులు ఏమన్నా అందామంటే నీకేందుకు అనే సమాధానం వస్తుందని మిన్నకుండి పోతున్నారు. ఇక రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాల్లో కొత్త బైక్‌లను కొనుగోలు చేసిన యువత బైక్‌ రైడింగ్‌లకు వెళ్తున్నారు. 


బుల్లెట్‌ బైక్‌లతో హల్‌చల్‌

అతివేగంగా నడపడం ఒక ఎత్తయితే, మరో రకంగా కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బుల్లెట్‌ బైక్‌లలో ఓ పరికరాన్ని అమర్చినట్లయితే ఆ బండి నుంచి అనుకోకుండా ఓ పెద్ద శబ్దం వస్తుంది. బండి వెళ్లే సమయంలో పెద్ద ఎత్తున శబ్దం రావడంతో పక్కన వాహనాలపై, ఆటోలలో, కార్లలో వెళ్లే వారు ఏం జరిగిందో అర్థం కాక భయాందోళనలకు గురవుతున్నారు. బుల్లెట్‌ బైక్‌పై వేగంగా వెళ్తున్న సమయంలో ఒకేసారి పెద్ద శబ్దం రావడంతో హడలెత్తిపోతున్నారు. ఇటువంటి పరికరాలను అమర్చడంతోపాటు బండికి సైలెన్సర్‌ను తీసివేస్తుండటంతో బండి శబ్దం కూడా ఇతరులను ఆందోళనకు గురి చేసేలా ఉంటోంది. అలాగే బండికి అమర్చే హారన్‌లు కూడా వింతగానే ఉంటున్నాయి. దగ్గరకు వచ్చే వరకు హారన్‌ కొట్టకుండా దగ్గరకు రాగానే వింత శబ్దాలతో ఉండే హారన్‌లను ఉపయోగిస్తు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. దీంతో పక్కన ఉండే వాహనదారులు ఒకేసారి ఏం జరిగిందో అనే అయోమయానికి గురవుతుంటారు. దీనివల్ల పక్కన ఉండే వాహనదారులు కూడా ప్రమాదాల బారిన పడిన సందర్భాలు ఉన్నాయి.


రోడ్డు ప్రమాదాలతో బతుకులు ఛిధ్రం

అతివేగంగా బైక్‌లను నడిపేందుకు యువత ప్రాధాన్యం ఇస్తుండటంతో అదే రీతిలో ప్రమాదానికి కూడా గురవుతున్నారు. అతివేగంగా నడపడం, బైక్‌పై కంట్రోల్‌ లేకపోవడంతో పలు ప్రాంతాల్లో యువకులు తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా బైక్‌ యాక్సిడెంట్‌లు ఎక్కువగా నమోదవుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక శాతం బైక్‌ల వల్లే ప్రమాదాలు చోటు చేసుకోవడం గమనార్హం. ప్రమాదాలలో అనేక మంది మృతి చెందుతున్నారు. దీంతో వారి కుటుంబాలో తీరని శోకాన్ని మిగిల్చి వెళ్తున్నారు. ఇక ప్రమాదంలో తీవ్రగంగా గాయపడి కొంతమందికి మంచానికే పరిమితమే ఆ కుటుంబసభ్యుల బాధలు వర్ణణాతీతం.


మైనర్ల చేతిలో వాహనాలు.. 

ఇక మైనర్లకు వారి తల్లిదండ్రులు బైక్‌లు ఇస్తున్నారు. వారు బైక్‌ సరిగా నడపలేకపోయినా.. లైసెన్స్‌ లేకపోయినా వాహనాలు ఇవ్వడం వల్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా మైనర్‌లు వాహనాలను నడుపుతున్నారు. దీనివల్ల ప్రమాదానికి గురవుతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు పలు చోట్ల తనిఖీలు నిర్వహించి వారిని పట్టుకొని కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. తల్లిదండ్రులను పిలిపించి మైనర్‌లకు వాహనాలు ఇవ్వడం వల్ల జరిగే అనర్థాలను వివరిస్తున్నారు. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా గతంలో జరిగిన బైక్‌ యాక్సిడెంట్‌లను చూపుతూ తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. అయినా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. మైనర్‌లు రోడ్లపై వాహనాలతో హల్‌చల్‌ చేస్తున్నారు. రోడ్డుపై ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిస్తే వారు మరో దారి గుండా వెళ్తున్నారు. 


మెకానిక్‌లకు సైతం కౌన్సెలింగ్‌ అవసరం..

వివిధ మోడళ్లలో ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేస్తున్న యువత ఆ బైక్‌లను మళ్లీ రీమోడలింగ్‌ చేయిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా బైక్‌లకు అవసరం లేని పరికరకాలను కూడా ఉపయోగిస్తున్నారు. వింత శబ్దాలు వచ్చే హారన్‌లను అమరుస్తున్నారు. ప్రస్తుతం అందరినీ హడలెత్తిస్తున్న బైక్‌లలో పరికరాలను మెకానిక్‌లు అమరుస్తున్నారు. బుల్లెట్‌లలో అమరుస్తున్న పరికరం కారణంగా ఒకేసారి టఫ్‌ మంటూ ఒక శబ్దం వస్తుంది. దీనివల్ల పక్కన వెళ్లేవారు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ శబ్దం బుల్లెట్‌ బండిలో ఉండదు.. అయితే బండిని కొనుగోలు చేసిన వారు మెకానిక్‌ల ద్వారా వీటిని అమరుస్తున్నారు. మెకానిక్‌లు ఇటువంటి పరికరాలను అమర్చకుండా వారికి కూడా కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మెకానిక్‌లు   బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.


2019లో ప్రమాదాలు ఎక్కువ

అవగాహనా రాహిత్యంతో ఎంతో మంది వాహనదారులు ఇష్టారీతిన వాహనాలను నడిపి తమ జీవితాలను చిధ్రం చేసుకుంటున్నారు. ఇందులో ఎక్కువ శాతం మైనర్లు, హెల్మెట్‌ ధరించని వారే ఉండడం గమనార్హం. అంతేకాకుండా ఇటీవల కాలంలో కొందరు యువకులు సైలెన్సర్‌ షాట్స్‌తో వాహనదారులను, పాదచారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ శబ్ద కాలుష్యంతో ఎంతో మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనచోదకంపై అవగాహనా రాహిత్యం వల్ల ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోవడం, శాశ్వత వికలాంగులు కావడం వంటి అనర్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం 2019వ సంత్సరంలోనే జిల్లాలో 195 భారీ రోడ్డు ప్రమాదాలు, 257 సాధారణ రోడ్డు ప్రమాదాలు జరిగాయి.  ఈ విషయంపై రవాణా శాఖ, పోలీస్‌ అధికారులు సరైన చర్యలు తీసుకొని వాహనదారుల్లో మార్పును తీసుకురావడంలో కొన్ని కఠినమైన నిబంధనలు అమలు చేయాలిన అవసరం ఎంతైనా ఉంది. 


logo