గురువారం 04 జూన్ 2020
Badradri-kothagudem - Feb 06, 2020 , 03:47:15

రాముని హుండీ ఆదాయం పెంపుపై దృష్టి సారించేనా..

రాముని హుండీ ఆదాయం పెంపుపై దృష్టి సారించేనా..

భద్రాచలం, నమస్తే తెలంగాణ : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి  భద్రాద్రికి భక్తులు నిత్యం తరలివస్తుంటారు. గతంలో హుండీ ఆదాయం బాగా వచ్చేది. రూ.కోటికి పైగానే హుండీ ఆదాయం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాని రానురాను రాముని హుండీ ఆదాయం తగ్గుముఖం పడుతోంది. భద్రాద్రి రామున్ని దర్శించుకున్న భక్తులు పర్ణశాల దివ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. దీంతో పాటు భద్రాచలానికి కూతవేటు దూరంలో ఉన్న పాపికొండల విహారయాత్రకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రతిఏటా శీతాకాలం సమయంలో పాపికొండల విహారయాత్రికులతో భద్రాద్రి పోటెత్తుతోంది. ఇటీవల పాపికొండల విహార యాత్రలో బోటుప్రమాదం సంభవించి యాత్రికులు మృత్యువాత పడటంతో అక్కడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాపికొండల విహారయాత్రను రద్దు చేసింది. 


దీంతో ఈ ఏడాది శీతాకాల సమయంలో భద్రాద్రికి భక్తులరాక భారీగా తగ్గింది. దీని ప్రభావం రాముని హుండీ ఆదాయంపై కూడా పడింది. బుధవారం రామాలయం ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో రాములోరి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఈ సారి రాముని హుండీ ఆదాయం 37 రోజులకు గాను రూ.73లక్షల 38వేల 315లు వచ్చింది. బంగారం 60గ్రాములు, వెండి 600ల గ్రాములు కానుకలుగా లభించాయి. అయితే గతంతో పోలిస్తే ఇది తక్కువ ఆదాయమేనని చెప్పవచ్చు. 18-09-2019న లెక్కించిన రాముని హుండీ ఆదాయం రూ.1కోటి 29లక్షల 5వేల 412లు వచ్చింది. 14-11-2019న హుండీ ఆదాయం రూ.87లక్షల 21వేల 782లు వచ్చింది. 30-12-2019న హుండీ ఆదాయం రూ.75లక్షల 89వేల 500లు వచ్చింది. తాజాగా బుధవారం లెక్కించిన హుండీ లెక్కింపులో రూ.73లక్షల 38వేల 315లు వచ్చింది. ఇలా గత నాలుగు సార్లు లెక్కలను పరిశీలిస్తే రాముని హుండీ ఆదాయం రోజు రోజుకు తగ్గుముఖం పడుతూ వస్తోంది.


హుండీ ఆదాయ పెంపుపై శ్రద్ధ అవసరం

తెలంగాణ రాష్ర్టానికే భద్రాద్రి రామాలయం తలమానికంగా ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి భక్తులు తహతహలాడుతుంటారు. భద్రాద్రి రామునికి అనేక ప్రాంతాల్లో మాన్యం ఉంది. ఈ మాన్యం చాలా భాగం ఆక్రమణకు గురికాగా, ఉన్న కొద్దిపాటి దేవుని మాన్యం నుంచి దేవస్థానానికి ఆదాయం సమకూరుతోంది. ఆక్రమణకు గురైన సొంత మాన్యం విషయం కోర్టు పరిధిలో ఉంది. దేవస్థానం అధికారులు ఆలయ భూములపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. కోర్టు పరిధిలో ఉన్న పెండింగ్‌ల కేసుల పరిష్కారానికి శ్రద్ధ చూపాలి. తద్వారా రామునికి ఆదాయం సమకూరుతోంది. బ్యాంక్‌ల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూపంలో ఉన్న ఆదాయంతో ప్రస్తుతం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఉద్యోగుల జీత భత్యాలు, ఇతర ఆలయ నిర్వహణ ఖర్చులను చూస్తున్నారు. ఆలయంలో నిర్వహణ ఖర్చు కూడా భాగా పెరిగిపోయినట్లు తెలుస్తోంది. కొంత మంది ఉద్యోగులు చేతివాటానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


logo