బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Feb 05, 2020 , 00:51:14

సొసైటీలపై గులాబీ గురి..

సొసైటీలపై గులాబీ గురి..
  • 21 సహకార సంఘాలను కైవసం చేసుకునే దిశగా టీఆర్‌ఎస్‌ కార్యాచరణ
  • వరుస విజయాలతో జోరుమీదున్న ‘కారు’
  • సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ సన్నద్ధమవుతోంది. జిల్లాలో తొలిసారిగా డీసీసీబీ ఏర్పాటు కానుండటంతో గులాబీ జెండా ఎగురవేసేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. వరుస విజయాలతో ఊపు మీదున్న గులాబీ దళం జిల్లాలోని 21 సొసైటీలను కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.  నోటిఫికేషన్‌ వచ్చిన నాటి నుంచి ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు సొసైటీల్లో తమ మద్దతుదారులను పోటీలో నిలిపేందుకు సమాయత్తం చేస్తున్నారు.           


పురపాలకాల్లో అఖండ విజయాలు సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లాలో ఉన్న 21 సొసైటీలపై గురి పెట్టింది. నోటిఫికేషన్‌ వచ్చిన నాటి నుంచి ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు సొసైటీలకు తమ మద్దతుదారులను పోటీలో నిలిపి గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నుంచి ఎంపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, నిన్నటి మున్సిపల్‌ ఎన్నికల దాకా వరుస విజయాలను సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీ అదే జోష్‌తో ముందుకెళ్తూ జిల్లాలో ఉన్న అన్ని సొసైటీలను తన ఖాతాలో వేసుకొని డీసీసీబీ చైర్మన్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవులను దక్కించుకునేందుకు సిద్ధంగా ఉంది. వరుస విజయాలతో ఊపుమీదున్న గులాబీ పార్టీ తాజాగా జరిగే ఈ ఎన్నికల్లో కూడా తన జోరును కొనసాగించి మరోమారు తిరుగులేని శక్తిగా అవతరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు అయినప్పటికీ సహకారం ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ తన గుత్తాధిపత్యాన్ని కొనసాగించి సొసైటీలను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకత్వం జిల్లా ఎమ్మెల్యేలకు, రాష్ట్ర నాయకులకు సహకార ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహ, ప్రతివ్యూహాలపై దిశానిర్దేశం చేసింది. దీంతో సంబంధిత ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా నాయకులు తమ నియోజకవర్గాల్లో ఉన్న పీఏసీఎస్‌ల వారీగా దృష్టి పెట్టి కార్యకర్తలు, రైతుసంఘాలతో సహకార సంఘాల ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించాల్సిన తీరుపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. 


21 సొసైటీలు కైవసం దిశగా 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా సహకార సంఘాలకు ఎన్నికలు జరుగుతుండటంతో టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జిల్లాలో ఉన్న కొత్తగూడెం, పాల్వంచ, బేతంపూడి, ఇల్లెందు, గానుగపాడు, గుంపెన, అశ్వారావుపేట, నారాయణపురం, ములకలపల్లి, దమ్మపేట, గుండాల, జూలూరుపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, సత్యనారాయణపురం, బూర్గంపాడు, అశ్వాపురం, చర్ల, నెల్లిపాక, మణుగూరు, పినపాక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో మెజార్టీ సంఘాలలో మద్దతు దారులను గెలిపించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. 


జోరుమీదున్న ‘కారు’

తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ జరిగిన అన్ని ఎన్నికల్లో తిరుగులేని విజయాలను నమోదుచేస్తూ వస్తోంది. జిల్లాలో జరిగిన అన్ని ఎన్నికల్లో అజేయశక్తిగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రెట్టించిన ఉత్సాహంతో సహకార ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన గ్రామీణ ప్రాంతాల ఎన్నికలైన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన పార్టీ పురపాలికలో కూడా విజయఢంకా మోగించింది. దీంతో పల్లెల, పట్టణాల్లో ప్రతిపక్షాలకు అడ్రస్‌ లేకుండా పోయింది. ఈ సందర్భంలో వచ్చిన సహకార ఎన్నికల్లో సైతం పట్టు సాధించేందుకు పావులు కదుపుతోంది. మండలాల వారీగా ఎన్నికల కన్వీనర్లను నియమించి పార్టీ కార్యకర్తలను, ఓటర్లను సమన్వయం చేస్తూ తమ మద్దతు దారుల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 


సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు

సహకార సంఘాల ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలపై మండల కన్వీనర్లతో రాష్ట్ర, జిల్లా నాయకత్వం సమన్వయ సమావేశాలను నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తుంది. ఇటీవలే రాష్ట్ర నాయకత్వం సహకార సంఘాల ఎన్నికలలో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై స్పష్టతనివ్వడంతో అందుకు అనుగుణంగా జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఏ నియోజకవర్గ పరిధిలో ఉన్న పీఏసీఎస్‌లను ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు బాధ్యత తీసుకొని తమ మద్దతుదారులను అధిక సంఖ్యలో గెలిపించుకొని డీసీసీబీపై పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలిసారిగా జిల్లాలో డీసీసీబీ ఏర్పాటు కానుండటంతో తొలిపీఠంపై గులాబీ జెండా ఎగురవేసేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న అత్యధిక సొసైటీలను గెలుచుకునేందుకు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో విజయఢంకా మోగించి డీసీసీబీ, డీసీఎంఎస్‌ పీఠాలపై గులాబీ పార్టీ మద్దతు దారులు కొలువుదీరడం నల్లేరుపై నడకే కానుంది.