ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 04, 2020 , 00:34:44

జీఎస్టీ, ఐజీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

జీఎస్టీ, ఐజీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

ఖమ్మం, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ర్టానికి రావాల్సిన జీఎస్టీ, ఐ జీఎస్టీ పెండింగ్‌ నిధుల విషయమై మరో మారు సోమవారం లోక్‌ సభ ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు గళమెత్తారు. 17వ లోక్‌సభ ప్రారంభం నాటి నుంచి విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను నెరవేర్చమని, తెలంగాణ రాష్ర్టానికి పెండింగ్‌ నిధులు విషయమై ఎంపీ నామా పలు మార్లు లోక్‌సభ లోన బయట పోరాడుతున్న సంగతి మనకు విదితమే. అందులో భాగంగా సోమవారం లోక్‌సభలో జీఎస్టీ, ఐజీఎస్టీ నిధుల పెండింగ్‌ విషయమై దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఇచ్చే కేంద్ర పన్నుల్లో వాటాను తెలంగాణ రాష్ర్టానికి విడుదల చేయాల్సిన నిధుల విషయమై తెలియజేయాలని నామా సంబంధిత కేంద్ర ఆర్థిక మంత్రిని ప్రశ్నించ టం జరిగింది. తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర పన్నుల వాటాను విడుదల చేయాలని కోరుతూ ఇప్పటికే ప్రధాన మంత్రి, కేంద్రమంత్రులకు సిఎం కేసీఆర్‌  పలుమార్లు లేఖలు రాశారని, అయినను కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. నామా నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ ఎంపీల బృందం కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలసీతారామన్‌ను కూడా కలిసి రాష్ర్టానికి రావాల్సిన ఐదు వేల కోట్ల జీఎస్టీ, ఐజీఎస్టీ నిధుల వాటా విడుదల చేయమని కోరటం  జరిగిందన్నారు. అభివృద్ధి ,సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు ఆలస్యం కావడంతో పథకాల అమలుకు ఆటంకం కలుగుతుందన్నారు.