శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 03, 2020 , 03:37:58

సహకార పోరుకు నేడు నోటిఫికేషన్‌

సహకార పోరుకు నేడు నోటిఫికేషన్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సహకార  సంఘాల ఎన్నికలకు నేడు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఎన్నిలక నిర్వహణ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సొసైటీ సిబ్బందితో సమావేశాలు ఏర్పాటు చేసిన జేసీ ముందస్తు ప్రణాళికను తయారు చేశారు.   ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లాయంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. శరవేగంగా జాబితా తయారీ, పోలింగ్‌ బూత్‌ల గుర్తింపు తదితర పనులను పూర్తి చేస్తున్నారు. నేడు సొసైటీ ఎన్నికల్లో పాల్గొనే ఓటర్ల జాబితా   అధికారికంగా విడుదల చేయనున్నారు. సోమవారం పూర్తి స్థాయిలో ఎన్నికల నోటిఫికేషన్‌ రానున్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఓటర్ల జాబితా సిద్ధమైన వెంటనే  నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది.  ఆయా సంఘాల పరిధిలో ఎన్నికల నిర్వహణకు పోలింగ్‌ బూత్‌లను సిద్ధం చేశారు. జిల్లా కేంద్రంలోని  జూనియర్‌ కళాశాలలను ముందస్తుగా పరిశీలించి ఆయా యాజమాన్యం  అనుమతులను తీసుకున్నారు. కొత్తగూడెం ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలోని 21 సొసైటీలకు ఎన్నికలు జరిపేందుకు ముసాయిదా ప్రకటన విడుదల చేయడంతో అధికారులు ఎన్నికల నిర్వహణలో తలమునకలైనారు. 

నిర్వహణపై అధికారులకు శిక్షణ

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఎన్నికల నగారా మోగడంతో జిల్లా సహకార అధికారులను కూడా నియమించి ఒక రోజు శిక్షణ ఇచ్చారు.  ఒక్కో సహకార సంఘానికి ఒక ఎన్నికల అధికారి, పోలింగ్‌ సిబ్బందిని ఇప్పటికే నియమించే ప్రక్రియను పూర్తి చేశారు. వారికి జిల్లా కేంద్రంలో మున్సిపల్‌ కార్యాలయంలో జేసీ కర్నాటి వెంకటేశ్వర్లు ఒక రోజు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ప్రతీ సొసైటీలో 13 మంది డైరెక్టర్లను ఎన్నుకునే అవసరం ఉన్నందున, ఆయా సొసైటీల్లో పోలింగ్‌ బూత్‌ల ఏర్పాట్లు, సొసైటీల పరిధిలోని మొత్తం ఓటర్ల జాబితాలను సిద్ధం చేశారు. 6 నుంచి 8వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, 9న నామినేషన్ల పరిశీలన, 10న ఉపసంహరణ, అదేరోజు బరిలోఉండే అభ్యర్థుల జాబితాను సిద్ధంచేయడంతో పాటు వారికి గుర్తులు కేటాయించనున్నారు. 15వ తేదీ ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ ఉంటుం ది. అదే రోజు మధ్యాహ్నం నుంచి కౌంటింగ్‌ ప్రారంభమై సాయంత్రం ఎన్నికల ఫలితాలు విడుదల చేయనున్నారు. అదేరోజున ఆఫీస్‌ బేరర్ల ఎన్నిక కూడా జరగనుంది. 

పోలింగ్‌ బూత్‌ల ఏర్పాటు

పాత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నందున ఒక్కో సొసైటీలో 13బూత్‌లు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 13మంది డైరెక్టర్లను ఎన్నుకోనుండటంతో వారికి బూత్‌లను ఏర్పాటు చేస్తున్నారు. డైరెక్టర్లను ఎన్నుకునే పద్ధతి బ్యాలెట్‌ ద్వారా ఉన్నందున వారికి ప్రత్యేక గుర్తులను కూడా కేటాయించనున్నారు. సాధారణ ఎన్నికల్లో పార్టీ ఎన్నికల గుర్తులు కాకుండా ఇతర వస్తువుల రూపంలోని గుర్తులను కేటాయించనున్నారు. రిజర్వేషన్ల ప్రకారంగా డైరెక్టర్లకు పోటీ చేసే అవకాశం ఉన్నందున ఆయా పరిధిలోని సహకార సభ్యులు ఓటర్ల జాబితా లో ఉన్నారో లేదో ఓటర్ల లిస్టును సరి చేస్తున్నారు. చనిపోయిన వారిని తీసివేసి సంఘాలవారీగా కొత్తఓటర్ల జాబితా  సిద్ధం చేస్తున్నారు. 3వ తేదీ జిల్లా సహకార సంఘం కార్యాలయంలో ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు.

టీఆర్‌ఎస్‌ ఖాతాలోకే ‘చైర్మన్‌'లు పదవులు

వరుస ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ సహకార ఎన్నికల్లో కూడా చైర్మన్‌ పదవులను తమఖాతాలో వేసుకునేందుకు ఇప్పటికే పార్టీ నాయకులు వ్యూహరచన చేస్తున్నారు. ఇల్ల్లెందు నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్నికల ఇన్‌చార్జి తాతా మధు ముందస్తు సమావేశాన్ని స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో ఏర్పాటు చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సైతం నియోజకవర్గంలో పాల్వంచ, కొత్తగూడెం సొసైటీలకు ఎన్నికల నిర్వహించనున్నందున ఇప్పటికే రైతుల ఓటర్ల వివరాను తెప్పించుకుని కార్యాచరణ చేస్తున్నారు. జిల్లాలో జరిగే సహకార సంఘాలన్నింటినీ టీఆర్‌ఎస్‌ కైవశం చేసుకోవడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ రైతుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సహకార ఎన్నికల్లో గెలుపునకు ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు.