శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 03, 2020 , 03:36:48

సహకార ఎన్నికలపై అవగాహన తప్పనిసరి

సహకార ఎన్నికలపై అవగాహన తప్పనిసరి

కొత్తగూడెం నమస్తే తెలంగాణ: ఎన్నికల అంశాలపై సమగ్రంగా అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం మున్సిపల్‌ కార్యాలయంలో సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై రిటర్నింగ్‌ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతీ సొసైటీలో 13మంది డైరెక్టర్లను ఎన్నుకోవడానికి అవకాశం ఉందని, సొసైటీల పరిధిలోని ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం అధికారికంగా నోటిఫికేషన్‌ జారీ చేసిన అనంతరం ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించాలని, 9వ తేదీన నామినేషన్ల పరిశీలన, 10న నామినేషన్ల ఉపసంహరణ, అదేరోజు సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నా రు. తెలుగు అక్షర క్రమంలో ఫారం-7లో ప్రతి అభ్యర్ధికి ఆమోదించబడిన 24 గుర్తుల నుంచి గుర్తు కేటాయిస్తూ తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. ఈనెల 15న పోలింగ్‌ ప్రక్రియ ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించడం జరుగుతుందని, అదే రోజు  ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించి సాయంత్రం గెలుపొందిన అభ్యర్ధుల ఫలితాలను ప్రకటిస్తామని వివరించారు. అభ్యర్ధుల నుంచి నామినేషన్లు సూచించిన స్థలము, తేదీ, నిర్ధేశిత సమయంలో మాత్రమే తీసుకోవాలని, ఒక అభ్యర్థి రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉందని, ఏదైనా నియోజకవర్గంలో ఓటరుగా నమోదైన వ్యక్తి మరొక నియోజకవర్గంలో నామినేషన్‌ దాఖలు చేయుటకు అవకాశం ఉన్నదని అయితే ప్రతిపాదించిన, బలపరిచిన వ్యక్తి మాత్రం ఆ వ్యక్తి ఏ నియోజకవర్గంలో నామినేషన్‌ దాఖలు చేస్తున్నాడో అదే నియోజకవర్గంలో  ఓటరై ఉండాలని చెప్పారు. ప్రతి నామినేషన్‌ పత్రముపైన అభ్యర్థి పేరును ప్రతిపాదిస్తున్న వ్యక్తి(ప్రపోజర్‌), అభ్యర్ధిని బలపరుస్తున్న వ్యక్తి(సెకండర్‌) తప్పనిసరిగా సంతకం చేయాలన్నారు. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు రిటర్నింగ్‌ అధికారికి స్వయంగా తన నామినేషన్‌ పత్రాలను అందజేయాలన్నారు. ఆ సమయంలో ప్రపోజర్‌ లేక సెకండర్‌ అతని వెంట ఉండాలని సూచించారు. నోటిఫికేషన్‌లో తెలిపిన విధంగా నిర్ణీత సమయంలోపల ఎన్నికల అధికారి లేక అతనిచే అధికారం ఇవ్వబడిన వ్యక్తికి నామినేషన్‌ ఇవ్వవచ్చన్నారు. ఫారం-2లోని డిక్లరేషన్‌తో పాటు షెడ్యూల్‌ కులాలు, తెగలకు చెందిన వ్యక్తులు రూ.500లు, వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తులు రూ.750, ఇతరులు రూ.1000 ఫీజు చెల్లింపులు చేయల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల అధికారి నామినేషన్‌ తీసుకున్న వెంటనే నామినేషన్‌ పత్రంలో(ఫారం-2) జతపరచబడియున్న రశీదును అభ్యర్ధికి అందజేయాలని,  నామినేషన్‌ వరుస నెంబర్‌, తేదీ, సమయం, నామినేషన్‌ పత్రముపై రాయాలని, తాను నామినేషన్‌ పత్రము ముట్టినట్లుగా రశీదు ఇవ్వాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి మైఖేల్‌ బోస్‌, సహకార ఆడిట్‌ అధికారి డీ మమత, రిటర్నింగ్‌అధికారులు పాల్గొన్నారు.