శుక్రవారం 05 జూన్ 2020
Badradri-kothagudem - Feb 03, 2020 , 03:35:45

బొజ్జాయిగూడెంలో జాతర సందడి

బొజ్జాయిగూడెంలో జాతర సందడి

ఇల్లెందు రూరల్‌: సమ్మక్క, సారలమ్మ జాతర ప్రారంభానికి ముందే మండలంలోని బొజ్జాయిగూడెం సమ్మక్క గద్దెల వద్ద భక్తుల సందడి నెలకొంది. మేడారంలో నిర్వహించిన విధంగానే ప్రతి రెండేళ్లకోమారు బొజ్జాయిగూడెం సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ నెల ఐదో తేదీ నుంచి జాతర నిర్వహించేందుకు నిర్వాహక కమిటీ అవసరమైన ఏర్పాటు చేస్తుండగానే భక్తుల తాకిడి అధికం కావడంతో నిర్వాహకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గడిచిన పక్షం రోజులుగా భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల పరిధిలోని పలు గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బొజ్జాయిగూడెం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. గద్దెలకు సమీపంలోనే గుడారాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఉండిపోతున్నారు. జాతర సందర్భంగా భక్తులు కొనులోగు చేసేందుకు వీలుగా నిర్వాహకులు ప్రత్యేకంగా 42 స్టాల్స్‌కు అనుమతినిచ్చారు. ఆయా స్టాల్స్‌ యజమానులు క్రమపద్దతిలో స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకొని విక్రయాలు ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలదిగా తరలివస్తున్న భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకొని  నైవేద్యంగా బంగారం (బెల్లం)ను సమర్పించుకుంటున్నారు. జాతర ప్రారంభానికి ముందే భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతుండటంతో నిర్వాహక కమిటీ సైతం సౌకర్యాలు కల్పిస్తూ ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పోలీసుశాఖ అధికారులు ప్రత్యేక బందోబస్తు ప్రారంభించగా వైద్యశాఖ అధికారులు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. బొజ్జాయిగూడెం గ్రామపంచాయతీ అధికారులు, పాలకవర్గం ప్రత్యేక శ్రద్ధతో జాతర ప్రాంగణం పరిశుభ్రంగా ఉండేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది.

తోగ్గూడెంలోభక్తుల సందడి..

మణుగూరు రూరల్‌: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే పండుగ సమ్మక్క-సారలమ్మ జాతర. మండలంలోని మినిమేడారం తోగ్గూడెం గ్రామం వద్ద వెలిసిన ఆదివాసీల ఆరాధ్య దైవాలు శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు నిర్వాహకులు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. ఈ జాతర 4 వ తేదీ నుంచి  అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. జాతర ప్రారంభం కాకముందే ఆదివారం సమ్మక్క-సారలమ్మల ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. 

4 నుంచి 8 వరకు జాతర

మణుగూరు, నమస్తే తెలంగాణ: ఈనెల 4వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు  జాతర ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. తోగ్గూడెం గ్రామం వద్ద వెలిసిన గిరిజనుల ఆరాధ్య దైవాలు శ్రీ సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర విజయవంతాగా నిర్వహించేందకు ఆలయ కమిటీ  నిర్వాహకులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 4వ తేదీన మండెమెలుగుట కార్యక్రమంతో జాతర ప్రారంభం కానుంది. 5న సారలమ్మ, 6 సమ్మక్క గద్దెకు రానున్నారు. 7న వన దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. 8న దేవతల తిరిగి వన ప్రవేశం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.  పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం శ్రీసామ్మక్క- సారలమ్మ ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో  సర్పంచ్‌ బొగ్గం రజిత, ఆలయకమిటీ నిర్వాహాకులు ఊకే వీరయ్య, పర్శిక రాజమ్మ, పర్శిక గోపయ్య, మడకం ఇరయ్య, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు , గజ్జల లక్ష్మారెడ్డి, బి.రాజు తదితరులు పాల్గొన్నారు. 


logo