సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 01, 2020 , 23:33:01

సూర్య భగవానునికి ‘యోగా’ వందనం

సూర్య భగవానునికి ‘యోగా’ వందనం
  • జిల్లాకేంద్రంలో రథ సప్తమి వేడుకలు
  • ఆసనాల విశిష్టతను వివరించిన గురువులు
  • 108 మందితో 108 సూర్య నమస్కారాలు

కొత్తగూడెం టౌన్‌: ప్రకృతికి ప్రత్యక్షదైవం, వెలుగుల రేడు సూర్యుని పుట్టిన రోజు సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలో తెల్లవారుజామున నుంచే రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజల నడము ఆధిత్యునికి యోగాభ్యాసకులు 108 మందితో 108 సూర్య నమస్కారాలు చేసి యోగాభిషేకం చేశారు. మాస్టర్‌ ఇకే ఆధ్యాత్మిక సేవా కేంద్రం, శ్రీత్రిమాత పంచాయతన క్షేత్రం, దాసాంజనేయ సాయిబాబా ఆలయంలో సూర్యునికి విశేష అర్చనలు, పూజలు నిర్వహించారు. పుష్పాలంకార సేవ, నీరాజనం సమర్పించారు. మాస్టర్‌ ఇకే ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఆధిత్యహృదయ స్తోత్రాన్ని ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు పఠించారు. యోగాభారతి, సింగరేణి సేవా సమితిల ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం స్టేడియం గ్రౌండ్‌లో యోగాభ్యాసకులు 108 మంది పాల్గొని 108 సూర్య నమస్కారాలను ఉదయం 5 గంటల నుంచి7.30 గంటల వరకు నిర్వహించారు. బాబూక్యాంప్‌లోని పార్కులో యోగా గురువు మనోహర్‌ ఆధ్వర్యంలో 30మంది తెల్లవారు జామున 4 గంటల నుంచి 6 గంటల వరకు సూర్య నమస్కారాలు నిర్వహించారు. 


వివిధ చోట్ల సూర్యునికి ప్రత్యేక పూజలు చేసి ఆయనకు ఇష్టమైన పాయసం సిద్ధం చేసి చిక్కుడు ఆకుల్లో పెట్టి ఆరగించారు. భక్తులందరూ తెల్లవారుజామున నుంచే నెత్తిపై రేగిపండ్లు, జిల్లేడు పువ్వులు పెట్టుకొని తలంటు స్నానాలు ఆచరించి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం యోగాభ్యాసకులను ఉద్దేశించి యోగా గురువు ఘంటసాల మార్తాండనర్సింహం మాట్లాడుతూ.. రథసప్తమి సందర్భంగా జగత్తుకు ప్రత్యక్ష దైవమైన సూర్యున్ని పూజించడం, ఆరాధించడం, నమస్కరించడం మూలంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయన్నారు. ప్రత్యేకించి ఎలాంటి వ్యాధులున్నా సూర్యుని కిరణాలతో అవి నయమవుతాయని తెలిపారు. కాలచక్రమనే ఏకచక్రం కలిగిన రథాన్ని ధరించి పంచేంద్రియాలు మనస్సు, బుద్ది అనే ఏడు గుర్రాలతో రథాన్ని తోలుతాడనే ప్రసిద్దిని తెలిపే హైందవమత గ్రంథాలు వెల్లడిస్తున్నాయన్నారు. యోగాభారతి సభ్యులు ఘంటసాల మార్తాండ నర్సింహం, మల్లేష్‌ గురూజీ, రాజేశ్వరరావు, నాగేశ్వరరావు, రాజు, శారద, విజయలక్ష్మీ పాల్గొన్నారు.