మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Feb 01, 2020 , 23:32:03

నేటి నుంచి జాతరకు ప్రత్యేక బస్సులు

నేటి నుంచి జాతరకు ప్రత్యేక బస్సులు
  • జిల్లా నుంచి మొత్తం 215 సర్వీసులు
  • ఆర్టీసీ డివిజనల్‌ మేనేజర్‌ వేములవాడ శ్రీకృష్ణ

కొత్తగూడెం అర్బన్‌: మేడారంలో ఈ నెల 5, 6,7,8 తేదీల్లో జరిగే సమ్మక్క-సారక్క జాతరకు జిల్లాలోని మూడు ఆర్టీసీ డిపోల నుంచి ఆదివారం నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు డివిజనల్‌ మేనేజర్‌ వేములవాడ శ్రీకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ బస్సులు నేరుగా మేడారం అమ్మవార్ల గద్దెల వరకు వెళ్తాయని, భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆర్టీసీ బస్సులలోనే సురక్షితంగా ప్రయాణం చేసి మొక్కులు చెల్లించుకోవాలన్నారు. ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించి ఇబ్బందులకు గురికావోద్దని భక్తులకు తెలిపారు. కొత్తగూడెం బస్టాండ్‌లో బస్సుల వివరాలను తెలిపేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామని, బస్టాండ్‌ పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేశామని, భక్తుల కోసం మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు.


ఒకే వార్డు, ఏరియాకు చెందిన  40మందికి పైగా భక్తులు మేడారం వెళ్ళాల్సినవారు ఉంటే బస్టాండ్‌లో సంప్రదిస్తే వెంటనే బస్సును ఏర్పాటు చేస్తామన్నారు. కొత్తగూడెం నుంచి 105, పాల్వంచ నుంచి 20, టేకులపల్లి నుంచి 20, భద్రాచలం నుంచి 45, మణుగూరు నుంచి 20, మంగపేట నుంచి 5 బస్సులను ఈ జాతరకు ఆపరేట్‌ చేస్తున్నామన్నారు. ఇందులో 115 బస్సులు మూడు డిపోలకు చెందినవి కాగా మిగిలిన 100 బస్సులు హైదరాబాద్‌, మధిర డిపోలకు చెందిన  బస్సులను తీసుకొచ్చి భక్తుల సౌకర్యార్ధం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కొత్తగూడెం డిపోలో బస్సు ఎక్కి మేడారం వెళ్లే భక్తులు పాల్వంచ, మణుగూరు, మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి మీదుగా మేడారంకు చేరుకుంటారని, మణుగూరు నుంచి వెళ్ళే భక్తులు మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి మీదుగా, భద్రాచలం నుంచి వెళ్ళే భక్తులు మణుగూరు, మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి మీదుగా మేడారం చేరుకుంటారన్నారు.  కొత్తగూడెం డిపో బస్సులను కొత్తగూడెం, పాల్వంచ, టేకులపల్లి వద్ద పాయింట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 


కొనసాగుతున్న భక్తరామదాసు జయంత్యుత్సవాలు

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో చిత్రకూట మండపం నందు నిర్వహిస్తున్న శ్రీభక్తరామదాసు జయంతి ప్రయుక్త ఉత్సవాలు శనివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భక్తరామదాసు చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వా గ్గేయ కారోత్సవాలను తిలకించారు. కళాకారులు వయోలిన్‌, మృదంగం తదితర సంగీత కీర్తనలు ఆలపించారు. ఫిబ్రవరి2 వరకు  కార్యక్రమాలు ఉంటాయని ఈవో జీ.నరసింహులు తెలిపారు. 


వైభవంగా రామయ్య నిత్యకల్యాణం

పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయంలో రామయ్యస్వామికి ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. ఉదయం అర్చకులు స్వామివారికి ముందుగా సుప్రభాతసేవ నిర్వహించారు. గోదావరి నది నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి అభిషేకం చేశారు. ఆరాధన, అర్చన, సేవాకాలం, నివేదన, పుణ్యఃవచనం తదితర పూజలు గావించారు. వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చిన భక్తులు రామాలయానికి చేరుకొని  రామున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం అర్చకులు ఆలయంలోని బేడా మండపంలో రామయ్యస్వామికి నిర్వహించిన నిత్యకల్యాణంలో భక్తులు పాల్గొని తిలకించి పునీతులయ్యారు.  దేవస్థానం అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.