మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Feb 01, 2020 , 04:21:15

మధ్యాహ్న భోజన నిర్వాహకులకు శుభవార్త

మధ్యాహ్న భోజన నిర్వాహకులకు శుభవార్త
  • భోజనం తయారుకు బిల్లులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • గతేడాది ఏప్రిల్‌ నుంచి అమలు

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందిస్తున్న ఏజెన్సీలకు ప్రభుత్వం తీపి కబురు ప్రకటించింది. మధ్యాహ్న భోజనం తయారీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2019, ఏప్రిల్‌ నెల నుంచి పెరిగిన ధరలు అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇందుకు రాష్ట్ర విద్యాశాఖ 28న ఉత్తర్వులు జారీ చేసింది. నిత్యావసర వస్తువుల ధరలతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏజెన్సీలకు పెరిగిన ధరలు ఉపశమనం కలిగించాయి. ధరలకు అనుగుణంగా ప్రభుత్వం నుంచి భరోసా లభించడంతో నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.0.13 పైసలు, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.0.20 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకోవటమే కాకుండా పెరిగిన ధరలు 2019 ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన ధరలతో జిల్లాలోని 1,359 మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు ప్రయోజనం చేకూరనుంది. 


అదనంగా రూ. 10 కోట్ల నిధులు..

ప్రభుత్వం మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్న ఏజెన్సీలకు ధరలు పెంచడంతో అదనపు చెల్లింపులకు నిధులు అవసరం అవుతున్నాయి. పాత ధరల ప్రకారం ప్రతి ఏటా సుమారు రూ.15 కోట్లకు పైగా చెల్లిస్తుండగా కొత్త ధరల ప్రకారం మరో రూ.10 కోట్లకు పైగా నిధులు అవసరం ఉంటుందని అధికారులు చెపుతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1,359 పాఠశాలల్లో 75,006 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారు. వీటిలో 1,066 ప్రాధమిక పాఠశాలల్లో 42,112 మంది, 162 ప్రాధమికొన్నత పాఠశాలల్లో 20,175 మంది, 131 ఉన్నత పాఠశాలల్లో 12,719 మంది విద్యార్తులు మద్యాహ్న భోజనానికి హాజరవుతున్నారు. గతేడాది డిసెంబర్‌ వరకు బిల్లుల చెల్లింపు పూర్తయింది. జనవరి నెల నుంచి కొత్త ధరలతో పాటు 8 నెలల బకాయిలు ఏజెన్సీలకు అందనున్నాయి.