బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 01, 2020 , 04:19:40

నేడు రథ సప్తమి

నేడు రథ సప్తమి
  • జిల్లావ్యాప్తంగా వైష్ణవాలయాల్లో పూజలు
  • వేకువజామున భక్తిశ్రద్ధలతో సూర్య నమస్కారాలు

కొత్తగూడెం టౌన్‌: సప్తమి తిథికి యజమాని అయిన సూర్యుడు మాగశుద్ధ్ద సప్తమిన పుట్టిన రోజు.. రథ సప్తమి.. దీన్నే సూర్య సప్తమి, మాఘశుద్ద సప్తమి అని కూడా అంటారు. నిర్ణీత ప్రమాణ వేగంతో క్రమం తప్పకుండా ప్రయాణించేవాడు రవి.. సూర్యుని ప్రయాణం దక్షిణాయం పూర్తి చేసుకొని ఉత్తరాయం ప్రారంభించేది. ఇది ప్రతీ ఏడు కృత్తికా నక్షత్రం శుక్లపక్షం శిశిర రుతువులో వస్తుందని సంప్రదాయక గ్రంథాలు సెలవిస్తున్నాయి. సంక్రాంతి తరువాత వచ్చే సప్తమే రథ సప్తమి... సూర్య భగవానుని సంపూర్ణమైన కాంతి కిరణాలు ఉత్తరాభిముఖంగా సూటిగా ప్రసరిస్తాయి. వీటికి ప్రత్యేక ఉన్నదని భక్తుల నమ్మకం.


సకల కోటి జీవరాశులకు కారణభూతుడు

నిరంతరం ప్రసరించే సూర్యుని కిరణాల మూలంగానే సమస్త జీవరాశులు మనగలుగుతున్నాయి. సకల పంటలకు, నిత్యం వెలుగులతో ప్రసరించే ‘మిత్రాయ’ మూలంగానే అన్ని కార్యాలు సక్రమంగా సాగుతున్నాయని నమ్మి ఇక్కడి ప్రజలు అనేక పూజలను ఈ రోజు ఆచరిస్తారు. ఈ విశ్వసృష్టికి మూలకారకుడైన ‘ఖగుణి’ కథను తెలిపే భవిష్యోత్తర పురాణాల్లో దీని విధివిధానాలు ఉన్నాయి. ఈ రోజు ప్రత్యేకించి  ఒరిస్సాలోని కోణార్క్‌ దేవాలయం దీనికి తార్కాణంగా నిలుస్తుంది. ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి దేవాలయంలో ఈ పూజలు భారీ ఎత్తున జరుగుతాయి. వేలాదిగా భక్తులు హాజరవుతారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మొర్రేడువాగు ఒడ్డున ఉన్న దాసాంజనేయ షిరిడీ సాయి మందిరంలో సూర్యాభిషేకం చేసి తీర్ధప్రసాదాలు అందజేస్తారు. దీంతో పాటు అన్ని సాయిబాబా ఆలయాలు, రైటర్‌బస్తీలోని త్రిమాత శక్తిపంచాయతన దేవాలయంలోనూ ప్రత్యేక అభిషేకాలు సూర్యునికి నిర్వహిస్తారు.


సూర్య నమస్కారాలకు ప్రాధాన్యం..

  తనంత తానుగా లోకాలను పోషించే సూర్యున్ని ప్రజాపిత అని పిలుస్తారు. సకల చరాచర జగత్తుకు అన్నంపెట్టే ప్రత్యక్ష దైవంగా నమ్మి కాళ స్వరూపునికి ప్రత్యేక పూజలు చేశారు. రథసప్తమి రోజు సూర్యోదయానికి ముందే తలపై జిల్లేడు పువ్వు, రేగి పండ్లుంచి తలంటు స్నానాలు చేశారు. సూర్యారాధికులు సకల శుభాలకు కారకుడు మార్తాండుడే అని భావించి ఇండ్ల ముందు వాకిళ్లలో సూర్యరథం ముగ్గులు వేస్తారు. బెల్లం, ఆవుపాలు, కొత్త బియ్యంతో పాయసం చేసి ఇంటిల్లిపాది ఆరగిస్తారు. పులగాన్ని వండి చిక్కుడాకుల్లో  ఉంచి సేవిస్తారు. రథాలను సైతం కొన్ని దేవాలయాల్లో సిద్దం చేస్తారు. విటమిన్‌- ఇ సూర్యకిరణాల వల్ల పుష్కలంగా లభించి అనేక అనారోగ్యాలను దూరం చేస్తుంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు 12 రకాల భంగిమలతో 108 సూర్య నమస్కారాలు చేస్తారు.