ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Feb 01, 2020 , 04:15:08

నేటి నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

నేటి నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • సూపరింటెండెంట్‌ నియామకం
  • జిల్లావ్యాప్తంగా 64 సెంటర్లలో పరీక్షలు ప్రతి కేంద్రానికి డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌, చీఫ్‌

కొత్తగూడెం ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 64 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష జరగనుంది. పరీక్ష పూర్తయిన గంటన్నరలోపు జవాబు పత్రాలను దిద్ది మార్కులను ఆన్‌లైన్‌ చేయాలని ఎగ్జామినర్లను జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ జహీర్‌ అహ్మద్‌ ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాలేజీల్లో ల్యాబ్‌ సౌకర్యం కల్పించారు. ప్రయోగ పరీక్షల కోసం ఒక ఫ్లైయింగ్‌ స్కాడ్‌, ఒక ఫిజికల్‌ సైన్స్‌ లెక్చరర్‌, ఒక బయాలజీ లెక్చరర్‌ను నియమించారు. వీరు అన్ని కేంద్రాలను పరిశీలించనున్నారు. పరీక్షలకు అరగంట ముందు ఎగ్జామినర్‌కు ఇంటర్‌బోర్డు నుంచి ఓటీపీ వస్తుంది. దీని ద్వారా పరీక్ష పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకొని విద్యార్థులతో పరీక్షలు నిర్వహిస్తారు. ఎగ్జామినర్‌కు ప్రతి కళాశాలలో ఒక సహాయకుడు ఉంటాడు. విద్యుత్‌, పోలీస్‌, పోస్టల్‌, ఆర్‌టీసీ, వైద్యశాఖ అధికారులను సమన్వయంతో  విద్యాశాఖ అధికారులు పరీక్షలను నిర్వహించనున్నారు. 


మాల్‌ప్రాక్టీస్‌ జరుగకుండా కఠిన నిబంధనలు

జిల్లా వ్యాప్తంగా జరగనున్న ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు మొత్తం 20,404 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఈ ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనున్నాయి. 64 సెంటర్లలో 4 విడతలుగా ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు  అధికారులు  అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. జనరల్‌ విభాగంలో 16,063 మంది, ఒకేషనల్‌ విభాగంలో 4,341 మంది ఉన్నారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 10,467 మంది విద్యార్థులు కాగా వీరిలో 2,420 మంది ఒకేషనల్‌ నుంచి పరక్ష రాయనున్నారు. ద్వితీయ సంవత్సరం నుంచి 9,937 మంది ఒకేషనల్‌ విభాగం నుంచి పరీక్షలు రాయనున్నారు. ఎటువంటి మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడకుండా అధికారులు ప్రయోగ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్‌ చీఫ్‌ సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లెక్చరర్లను డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లుగా పరిగణిస్తారు.