శనివారం 05 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jan 31, 2020 , 00:30:48

మోగిన నగారా..

మోగిన నగారా..
  • షెడ్యూల్‌ విడుదల చేసిన సహకార ఎన్నికల సంఘం
  • బ్యాలెట్‌ పద్ధతిలో జరగనున్న ఓటింగ్‌
  • వచ్చే నెల 6 నుంచి నామినేషన్ల స్వీకరణ


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతోంది. సొసైటీలకు ఎన్నికలు నిర్వహించి రైతులకు మరిన్ని పథకాలను అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్‌ సమాయత్తమవుతోంది. సొసైటీ చైర్మన్ల పదవీ కాలం పూర్తై కొద్ది రోజులుగా పర్సన్‌ ఇన్‌చార్జ్‌ల పాలన కొనసాగుతోంది. పర్సన్‌ ఇన్‌చార్జ్‌ల పాలన కూడా పూర్తి కావడంతో కొత్త సంఘాలను ఏర్పాటు చేసే ప్రక్రియ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించడంతో గురువారం సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర కో ఆపరేటివ్‌ ఎలక్షన్‌ అథారిటీ అడిషనల్‌ రిజిస్ట్రార్‌ సుమిత్రా ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.


రైతన్నలకు చేదోడు వాదోడుగా ఉండే సహకార సంఘాల సొసైటీలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రైతులకు రైతుబంధు, రైతుబీమా, ఎరువుల కొరత, విత్తనాల సరఫరా, పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరింత లబ్ధిచేకూర్చేందుకు సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి వాటిని మరింత బలోపేతం చేయనున్నాయి. గతంలో ఒక మండలానికి ఒక సొసైటీ మాత్రమే ఉండేది. ఇక నుంచి మండలానికి రెండు సొసైటీలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం ఇటీవల జీవోనంబర్‌ 45ను జారీ చేసింది. ఇప్పటికే సహకార శాఖ కమిషనర్‌ పార్థసారధి సంఘాల బలోపేతం కోసం ప్రత్యేక జీవోను జారీ చేసి త్వరలో పునర్వవస్థీకరణకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందుకోసం సహకార శాఖ అధికారులు మండలాలను ప్రాతిపదికగా తీసుకొని సొసైటీల్లో సభ్యత్వం ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 17 మండలాల్లో సొసైటీలు ఉండగా, అందులో మూడు మండలాల్లో రెండు సొసైటీలు ఉన్నాయి. మిగతా మండలాల్లో ఒక్కో సొసైటీ మాత్రమే ఉంది. 


ఎన్నికల షెడ్యూల్‌ విడుదల 

ప్రాథమిక వ్యవసాయ సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించడంతో గురువారం రాష్ట్ర సహకార ఎన్నికల సంఘం ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వచ్చేనెల ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. 6 నుంచి 8వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగనుంది. 9వ తేదీన నామినేషన్ల పరిశీలన, 10వ తేదీన నామినేషన్ల ఉప సంహరణ, అదేరోజు బరిలో ఉండే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయడంతో పాటు వారికి గుర్తులు కూడా కేటాయించనున్నారు. 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం నుంచి కౌంటింగ్‌ ప్రారంభమై సాయంత్రం ఎన్నికల ఫలితాలు విడుదల చేయనున్నారు. అనంతరం అదేరోజున ఆఫీస్‌ బేరర్ల ఎన్నిక కూడా జరగనుంది. 


పాతసొసైటీల ద్వారానే ఎన్నికలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో 21 సహకార సంఘాలకు ఎప్పటిలాగే  పాత సొసైటీల ద్వారానే ఎన్నికలు జరగన్నాయి. జిల్లాలోని 66,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రూ.300 సభ్యత్వం తీసుకున్న రైతుకు మాత్రమే ఓటు హక్కు కల్పించేందుకు ఇప్పటికే నిబంధనలు తయారు చేశారు. రుణం తీసుకున్న రైతు, భూమి ఉన్న రైతుకు మాత్రమే సహకార సంఘంలో సభ్యత్వం అందజేశారు. 2018 డిసెంబర్‌ నాటికి సహకార సంఘంలో సభ్యుడిగా ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కును కల్పించారు. ప్రస్తుతం ఉన్న సొసైటీలకు డైరెక్టర్ల రిజర్వేషన్‌ కూడా నోటిఫికేషన్‌కు ముందుగానే ఖరారు చేయనున్నారు. కొత్త సొసైటీకి 13 మంది డైరెక్టర్లను ఎన్నుకునే అవకాశం ఉంది. వీరిలోనే ఒకరు చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకుంటారు. ఏజెన్సీలో సభ్యుల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉంటుంది. 


జనరల్‌ ఎన్నికల మాదిరిగానే

సహకార సంఘాల ఎన్నికలు కూడా బ్యాలెట్‌ పద్ధతి ద్వారానే జరుపుతారు. 300 మంది సభ్యులకు ఒక పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేసి పీవో, ఏపీవోలను ఎన్నికల అధికారులుగా నియమిస్తారు. ఎన్నికల ప్రక్రియ అంతా రానున్న పక్షం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు కసరత్తును ప్రారంభించారు. 


జిల్లాలో 95 వేల మంది సహకార సభ్యులు

జిల్లాలో ఉన్న మండలాల వారీగా ఉన్న సొసైటీలను పరిగణలోకి తీసుకుంటే 95 వేల మందికి పైగా సహకార సంఘంలో సభ్యులున్నారు. సొసైటీల ద్వారా రుణాలు తీసుకోవడంతో పాటు ఎరువులు, విత్తనాలను సబ్సిడీపై తీసుకుంటున్నారు.


జిల్లాలో ఏడు సర్కిళ్లు..

జిల్లాలో సహకార సంఘం పరిధిలోని ఏడు సర్కిళ్లు పనిచేస్తున్నాయి. ఆ ఏడు సర్కిళ్లు ఆయా మండల కార్యాలయాల్లో పీఏసీఎస్‌ల పనితీరును పరిశీలిస్తుంటాయి. కొత్తగూడెం, అశ్వారావుపేట, చండ్రుగొండ, బూర్గంపాడు, ఇల్లెందు, ములకలపల్లి, భద్రాచలం మండలాల్లో అసిస్టెంట్‌ రిజిస్ర్టార్‌ల నుంచి సర్కిళ్లను నిర్వహిస్తున్నారు. సర్కిళ్ల పరిధిలో ఉన్న ప్రాథమిక సహకార సొసైటీల పనితీరును పరిశీలించి ఎప్పటికప్పుడు రైతుల వివరాలను, వారికి అందుతున్న రుణాల తీరును బట్టి అట్టి జాబితాను సిద్ధం చేసి వారికి ఎరువుల పంపిణీ చేస్తుంటారు. ఇటీవల కొత్తగా ఏడుగురు అసిస్టెంట్‌ రిజిస్ర్టార్‌లను కూడా ప్రభుత్వం నియమించడంతో వారు ఆయా మండలాల్లో విధులను నిర్వహిస్తున్నారు. 


పాత సంఘాలకే ఎన్నికలు : మైఖేల్‌ బోస్‌, జిల్లా అధికారి

సహకార సంఘాల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. జిల్లాలో ఉన్న సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్‌లో కో ఆపరేటివ్‌ ఎన్నికల అధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాత సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. నేడు జిల్లా కార్యాలయంలో సహకార సంఘాల ఎన్నికల గురించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి  ఎన్నికల ప్రక్రియను వేగిరం చేయనున్నాం.