సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Jan 31, 2020 , 00:16:07

ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలి

ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలి

భద్రాచలం, నమస్తే తెలంగాణ: నిబద్దత, అంకితభావంతో ఉపాధ్యాయులు పనిచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిణి సరోజినీదేవి అన్నారు. గురువారం భద్రాచలం పట్టణంలో జరుగుతున్న నాల్గో రోజు ‘నిష్ట’శిక్షణ కార్యక్రమాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలకు బడుగు, బలహీన వర్గాల పిల్లలు వస్తారని, వారికి సంపూర్ణ నైపుణ్యాలతో, సామర్థ్ధ్యాలతో కూడిన విద్యను అందించాలని తెలిపారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ గుణాత్మక విద్యను అందించాలని సూచించారు. ప్రతి ఉపాధ్యాయుడు సమయపాలన పాటిస్తూ పాఠశాలను, పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 


అదేవిధంగా ‘నిష్ట’ శిక్షణ ద్వారా పాఠశాల కార్యక్రమాలను, బోధన అభ్యసనశాస్త్రం, పాఠశాల నాయకత్వ లక్షణాలను తెలియజేశామని, వాటిని పాఠశాలలో అమలు చేయాలని ఆమె ఉపాధ్యాయులకు సూచించారు. డీసీఈబీ సెక్రటరీ ఎస్‌.మాధవరావు మాట్లాడుతూ.. ప్రతిపాఠశాలకు ఒక షెడ్యూల్‌ పంపామని, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించి అభ్యసన ఫలితాలను సాధించాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ బోధనను అందించాలన్నారు. విలువలతో కూడిన విద్య ప్రస్తుత సమాజానికి అవసరమని తెలిపారు. కార్యక్రమంలో కోర్స్‌ డైరెక్టర్‌, మండల విద్యాశాఖ అధికారి ఎస్‌.సమ్మయ్య, ఎస్‌ఎల్‌డీపీ ఏవీ రామారావు, కేఆర్‌పీఎస్‌ సీహెచ్‌ స్వరూప్‌కుమార్‌, ఏజే ప్రభాకర్‌, పవన్‌, శంకర్‌, విజయబాబు, వంశీ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.