మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Jan 29, 2020 , 03:27:16

టీఆర్ఎస్ బలం ప్రజా బలగం

టీఆర్ఎస్ బలం ప్రజా బలగం

కామ్రేడ్ల కంచుకోటలు బద్ధ్దలయ్యాయి.. కాంగ్రెస్‌ చరిత్ర ‘హస్త’గత సమాప్తమైంది.. ‘కారు’ జోరుకు ప్రతిపక్షాల అడ్రెస్‌ గల్లంతయ్యింది.. గతేడాది జరిగిన పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్‌ ఎన్నికల వరకు అన్నింట్లోనూ టీఆర్‌ఎస్‌దే హవా.. ఇటీవల జరిగిన మునిసిపల్‌ ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలను క్లీన్‌ స్వీప్‌ చేస్తూ అత్యధిక వార్డు స్థానాలు కైవసం చేసుకుంది.. కొత్తగూడెం, ఇల్లెందు పీఠాలను దక్కించుకుని విజయ బావుటా ఎగురవేసింది.. ‘పల్లె అయినా, పట్నమైనా ప్రజా బలగమే టీఆర్‌ఎస్‌ బలం..’ అన్న నినాదాన్ని సార్థకం చేసింది.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవడం, అభివృద్ధి ఫలాలు అందడంతోనే ఈ ఘన విజయం సాధ్యమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. మరోవైపు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాలను పాటిస్తూ, సమన్వయంతో పనిచేస్తూ నేతలు, ఎమ్మెల్యేలు, ప్రజాపత్రినిధులు, నాయకులు, కార్యకర్తలు పార్టీ విజయానికి దోహదపడటమూ కలిసి వచ్చింది..

  • మునిసిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌
  • కొత్తగూడెం, ఇల్లెందు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలు కైవసం
  • ప్రతిపక్షాల అడ్రస్సే గల్లంతు
  • వార్డుల్లో కొన్నిచోట్ల డిపాజిట్లకూ దిక్కు లేదు..
  • జిల్లాలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రజల ఆకాంక్షను, సమైఖ్య పాలనలో పడిన కష్టాలను నెరవేర్చేందుకే ప్రత్యేక రాష్ట్ర నినాదంతో పురుడోసుకున్న పార్టీ టీఆర్‌ఎస్‌.. ఒకరిద్దిరితో హైదరాబాద్‌ జలదృశ్యంలో ప్రారంభమైన పార్టీ.. నేడు యావత్‌ తెలంగాణలోనే మరో పార్టీకి అవకాశం లేకుండా.. అన్ని పార్టీల అడ్రస్‌లను గల్లంతు చేస్తూ ఎదురులేని శక్తిగా నిలిచింది.. రెండు జాతీయ పార్టీలను కాలరాసి.. ఇక సమైఖ్యాంధ్రప్రదేశ్‌లో ప్రభంజనం సృష్టించిన టీడీపీని ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం చేసి పచ్చ పార్టీని సరిహద్దుల ఆవలికి తరిమేసింది.. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ 2014లో అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు అప్రతిహాత విజయాలను నమోదు చేస్తూ వస్తోంది. ఎన్నికలు ఏవైనా గులాబీ ప్రభంజనం సృష్టిస్తోంది.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ గుబాళింపునకు మోకరిల్లాల్సిందే..  గ్రామ, మండల, జిల్లా స్థాయి వరకు జరిగిన ప్రతి ఎన్నికలో బంపర్‌ మెజార్టీలను నమోదు చేసుకొంది. 


కొనసాగుతున్న విజయాల పరంపర..

2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన నాటి నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ వరుస విజయాలతో ముందుకు సాగుతోంది. కారు స్పీడ్‌కు పార్టీల అడ్రస్‌లు గల్లంతు అవుతున్నాయి. ఒకటి అర సీట్లు తప్ప చెప్పుకోదగ్గ స్థాయిలో ఏ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా స్థానాలను దక్కించుకోలేదు. అంటే టీఆర్‌ఎస్‌ పార్టీ క్షేత్రస్థాయిలో వేళ్లూనుకుపోయిందో ఇట్టే అర్థమవుతోంది. తాజాగా 2019లో జరిగిన ఎంపీ, ఎమ్మెల్సీ, పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లు కారుకే పట్టం కట్టారు. తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా అదే ఒరవడి కొనసాగింది. జిల్లాలోని రెండు మున్సిపాలిటీలైన కొత్తగూడెం, ఇల్లెందులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఎన్నిక ఏదైనా సరే టీఆర్‌ఎస్‌దే గెలుపు అన్నట్లు 2014 నుంచి జరుగుతున్న ఎన్నికలు సాక్షాలుగా నిలుస్తున్నాయి. అప్పుడు, ఇప్పుడు టీఆర్‌ఎస్‌ పార్టీయే విజయకేతనం ఎగురవేసింది. పార్టీ సంస్థాగత సభ్యత్వ నమోదులో అత్యధిక సభ్యత్వాలను నమోదు చేసుకొని భారతదేశంలోనే అతిపెద్ద పార్టీగా రాజకీయ పార్టీగా అవతరించింది.  


 ప్రతిపక్షాల అడ్రస్‌ గల్లంతు

మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమిగా జతకట్టిన ప్రతిపక్ష పార్టీలు గులాబీ దెబ్బకు తమ ఉనికిని కోల్పోయాయి. ఇల్లెందు, కొత్తగూడెం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ పార్టీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. బీజేపీకి ఒక్క సీటు కూడా రాకపోగా డిపాజిట్‌ కూడా దక్కలేదు. కేంద్రంలో అధికారంలో ఉండి రాబోయే రోజుల్లో తమదే అధికారమని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ కనీసం జిల్లాలో బోణీ కూడా కొట్టలేదు. భారత కమ్యూనిటీ పార్టీ (సీపీఐ) కేవలం ఎనిమిది సీట్లకే పరిమితమైంది. కారు స్పీడ్‌కు రెండు జాతీయ పార్టీలు కనుమరుగు కాగా ఇతర పార్టీలు తమ చిరునామాను నిలబెట్టుకోలేకపోయాయి. కొత్తగూడెంలో 36 స్థానాల్లో 8 స్థానాలను సీపీఐ గెలుచుకోగా, ఇల్లెందులో ఒక స్థానానికి పరిమితమైంది. సోమవారం జరిగిన మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలో జిల్లాలో ఉన్న రెండు మున్సిపల్‌ స్థానాల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాలను దక్కించుకొని గ్రామీణ ప్రాంతాల్లోనే కాక పట్టణ ప్రాంతాల్లో కూడా పట్టు సాధించింది.  


ఎదురులేని శక్తిగా టీఆర్‌ఎస్‌..

ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడంతో జిల్లాలో ఎదురులేని శక్తిగా నిలిచింది. నాడు జిల్లాలోని కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గ స్థానాలను సైతం టీఆర్‌ఎస్‌ గెలుచుకోవడంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ బలపడింది. గత మున్సిపల్‌ ఎన్నికలతో పోలిస్తే నాడు ఒకే ఒక కౌన్సిలర్‌ స్థానాన్ని గెలుచుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ నేడు 25స్థానాలను గెలుచుకొని మున్సిపల్‌ పీఠంపై గులాబీ జెండా ఎగురవేసింది. ఇల్లెందు మున్సిపాలిటీలో కూడా కూటమితో జతకట్టిన కాంగ్రెస్‌, కమ్యూనిస్టు, బీజేపీ పార్టీలు ఎన్ని ఎత్తులు వేసినా చివరికి మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌కే సొంతమైంది. 24 వార్డుల్లో 19 స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకొని తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకుంది. ఎంపీ,  జడ్పీ చైర్మన్‌, మున్సిపల్‌ చైర్మన్‌, ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్‌ తదితర కీలకమైన స్థానాలను మెజార్టీ స్థాయిలో దక్కించుకొని జిల్లాలో సంస్థాగతంగా బలపడింది. 


సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఎన్నికల్లో ప్రధాన అస్ర్తాలుగా అత్యధిక స్థానాలు వచ్చేలా చేశాయి. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్‌ కిట్‌ లాంటి పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడటంతో పట్టణ ఓటర్లు ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులయ్యారు. అలాగే సీతారామ ప్రాజెక్టు నిర్మాణం, భధ్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌, దుమ్ముగూడెం బరాజ్‌ నిర్మాణానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించి ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు బృహత్తర కార్యక్రమాలను చేపట్టింది. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకే ఓటర్లు పట్టం కట్టారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకం ఉపయోగపడటంతో పట్టణాభివృద్ధి టీఆర్‌ఎస్‌ పార్టీతోనే సాధ్యమనుకొని ఓటర్లు పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించారు. 36 వార్డుల్లోను మెజార్టీ స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకోవడంతో అన్ని వార్డుల్లో ఓటర్లు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరుగుతుందని, మున్సిపాలిటీ వార్డుల్లో అభివృద్ధి జరగాలంటే తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యమని మరోసారి రుజువు చేశారు.