సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Jan 29, 2020 , 03:24:07

భక్తాగ్రేసరుడు కంచర్ల గోపన్న

భక్తాగ్రేసరుడు కంచర్ల గోపన్న

భద్రాచలం విశ్వవిఖ్యాత పుణ్యక్షేత్రం.. పుణ్యతీర్థం కూడా.. జుదాచలం క్షేత్ర సందర్శనం, గోదావరి స్నానం, శ్రీరామచంద్రుని సేవా భాగ్యం, ముల్లోకాలలో దుర్లభం... ఈ దండకారణ్యంలో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై సంచరించాడు... ఈ ప్రాంతమంతా రామాయణ రసరమ్య సన్నివేశాలతో పులకించిన దివ్యధాత్రి.. మరి ఈ క్షేత్రానికి ఇంత ప్రాచుర్యాన్ని తీసుకొచ్చిన ఘనత భక్తరామదాసుగా పిలువబడిన కంచర్ల గోపన్నదే.. మహాభక్తుడు, మహాకవి, వాగ్గేయకారుడు, సాదుశీలి, సకల సద్గునఖని, పరిపాలనదక్షుడు, త్యాగమూర్తి, మహాదాత, క్షేమంగా భావించిన ప్రభుత్వ ఉద్యోగి... పరగణ) తహసీల్దార్‌గా, ప్రజా సంక్షేమం కోసం తన సర్వస్వాన్ని అర్పించిన అధికారి... జీవితాన్ని తులసీదళంగా చేసి రామయ్య పాదాలకు సమర్పించిన పరమ భక్తుడు... అందుకే భద్రాచలం చరిత్రలో రామదాసూ భాగమైపోయారు. ఈ పరమ భక్తుడి జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తున్నది. నేటి నుంచి 31వ తేదీ వరకు ఈ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. 12 అడుగుల రామదాసు కాంస్య విగ్రహాన్ని బుధవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌మార్‌ చేతుల మీదుగా ఆవిష్కరించానున్నారు.

  • నేటి నుంచి వచ్చే నెల 2 వరకు భద్రాద్రిలో జయంత్యుత్సవాలు
  • ఆలయ ప్రాంగణంలో రామదాసు కీర్తనాలాపనలు
  • ఏర్పాట్లలో నిమగ్నమైన దేవస్థాన అధికారులు

ఖమ్మం కల్చరల్‌, విలేకరి : ఖమ్మం  జిల్లాలోని నేలకొండపల్లిలో లింగనమంత్రి,కామాంబ  దంపతులకు మాఘ శుద్ధ తదియ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 1620 లో జన్మించాడు. ఆయనది ఆత్రేయస గోత్రం, రామదాసు భార్య కమలాదేవి, కుమారుడు రఘురాముడు.. ఆయనకు అక్కన్న, మాదన్నలు ఇద్దరు  మేనమామలు. గోల్కొండ నవాబు  తానీషా వద్ద వీరు  మంత్రులుగా ఉండేవారు. వారి సహకారంతోనే గోల్కొండ నవాబు వద్ద రామదాసు తహసీల్దార్‌ ఉద్యోగంలో చేరారు. రఘునాథ భట్టాచార్యుల వద్ద రామదాసు కొంతకాలం శిష్యరికం చేశారని చరిత్ర చెబుతోంది. పాల్వంచ పరగణాలో తహసీల్దార్‌ ఉద్యోగం చేసూ,్త భద్రాచలంలో రామాలయం నిర్మించాడు. దీనికి గాను గొల్కొండ నవాబుల ఆగ్రహానికి గురై 1665 నుంచి 1677 వరకు జైలు జీవితం గడిపాడు.  


రామదాసు చెరసాలలో ఉండగా, స్వయంగా శ్రీరాముడే వచ్చి పైకం చెల్లించి విడిపించాడనేది చరిత్ర.. అందుకే ప్రతి ఏటా జరిగే శ్రీరామనవమి కల్యాణానికి రాజదర్బార్‌ నుంచి ముత్యాల తలంబ్రాలు పంపడం ఆనవాయితీగా వచ్చింది. నేటికీ ప్రభుత్వం తరఫునే వీటిని అందజేస్తున్నారు. తన మేనమామలు తానీషా ఆస్థానంలో తహసీల్దార్‌గా ఉద్యోగం ఇప్పించగా, రామునిపై ఉన్న భక్తితో తన స్థానాన్ని భద్రాచలానికి మార్చుకుని, నాటి రోజుల్లో 6లక్షల వరహాలతో పవిత్ర గోదావరి నదీ తీరాన రామమందిరాన్ని నిర్మించాడు. రామునితో పాటుగా సీతమ్మకు, లక్ష్మణుడికి పలు రకాల బంగారు ఆభరణాలు చేయించాడు. ఆ నగలను ప్రత్యేక పూజల సమయంలో దేవతామూర్తులకు అలంకారం చేస్తారు. ‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తలీ’్ల.. అని రామదాసు సీతమ్మను కోరగా రాముడు దర్శనమిచ్చి రామదాసు కోరికపై శ్రీరాముడు తనలో ఐక్యం చేసుకున్నాడు.


నేలకొండపల్లిలో భక్త రామదాసు ధ్యాన మందిరం..

 కంచర్ల గోపన్న స్వగ్రామం నేలకొండపల్లిలో భక్త రామదాసు ధ్యాన మందిరాన్ని 1955 డిసెంబర్‌లో ప్రారంభించి 1961 మార్చిలో పూర్తి చేశారు. ఆ తర్వాత 2000 ఫిబ్రవరి 20న  పునర్నవీకరణ పూర్తి చేయగా,  సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ మందిరంలో వందల సంవత్సరాల కిందటి రామదాసు వాడిన బావి నేటికీ ఉంది. మందిరంలో 1977లో  సీతారాముడు, లక్ష్మణుడు,రామదాసు పంచలోహ విగ్రహాలను ప్రతిష్ఠించారు. భద్రాచలం పాలకమండలి దీని నిర్వహణ బాధ్యతలను  చేపడుతోంది.. రాష్ట్ర ప్రభుత్వం  ఈ రామదాసు స్మారక మందిరాన్ని 3 కోట్ల రూపాయలతో ఆధునీకరించేందుకు  ప్రణాళిక చేసి అమలు చేస్తోంది. ఈమేరకు కళాక్షేత్రం నిర్మాణం కోసం స్థల సేకరణ చేసి కొనుగోలు చేశారు. మందిరాన్ని ఆధునీకరించి, విస్తరింపచేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అమలు చేస్తూ,   రామదాసు కీర్తి ప్రతిష్ఠతలను మరింత  ఇనుమండిపజేస్తోంది. ప్రస్తుతం 6 లక్షల రూపాయల విలువైన 12 అడుగుల రామదాసు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 


రామదాసుకు పట్టు వస్ర్తాలు సమర్పించిన వంశస్తులు

నేలకొండపల్లి : నేటి నుంచి నేలకొండపల్లిలో భక్త రామదాసు ధ్యాన మందిరంలో జయంత్యుత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో రామదాసు పదోతరం వంశస్తులు, కొత్తగూడెం వాసి కంచర్ల శ్రీనివాసరావు దంపతులు మంగళవారం పట్టువస్ర్తాలను సమర్పించారు. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఉత్సవాలకు రామదాసు వంశస్తులు వచ్చి పట్టు వస్ర్తాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది. రామదాసు వంశస్తులు ముందుగా  ధ్యాన మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్ర్తాలను పూజారి సౌమిత్రి రమేష్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్త రామదాసు విద్వత్‌ కళాపీఠం అధ్యక్షుడు సాధు రాధాకృష్ణమూర్తి, పెండ్యాల గోపాలకృష్ణమూర్తి, కాండూరి వేణు, నంచర్ల ప్రసాదు, కర్నాటి శంకర్‌రావు, వాసం లక్ష్మయ్య, మన్నె కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


ఆనందభైరవి రాగమే  తొలి రాగం...  

ఆనందభైరవి రాగాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వాగ్గేయకారుడు ఆయన. కీర్తనలు రాసి దానికి సంగీత స్వర రచన చేసి ఆలపించిన ఘనత ఆయనదే..  

‘ అంతా రామమయం, పలుకే బంగారుమాయనా, నను బ్రోవమని చెప్పవే, ఇక్షాకుల తిలకా.. ఎవడబ్బ సొమ్మని కులుకుతు తిరిగేవు, అదిగో భద్రాద్రి .. వంటి  గేయాలు అత్యంత ప్రాచుర్యమయ్యాయి. ‘దాశరథి శతకం’ పేరుతో 103 కీర్తనలు రచించారు. 59 రచనల్లో ఉత్పలమాల, 44 రచనల్లో చంపకమాల వినియోగించారు. జానకీపతి శతకం ,  సంస్కృతంలో శ్రీమద్రామాయణ కథా చూర్ణము రచించారు.  “క్షీరసాగర శయనం’ అనే త్యాగరాజ కీర్తనలో త్యాగరాజు రామదాసును గురించి ప్రస్తావించడం విశేషం.. ఆయన కీర్తనల్లో మరో  39 రాగాలు ఉపయోగించాడు. ప్రముఖులు యాదవదాసు, సింగిరిదాసులు  రామదాసు చరితను యక్షగానంగా రాశారు. తిరక్కడయూరి కృష్ణదాసు హరికథగా రాశారు. ఆయనకు కబీరదాసు రామతారక  మంత్రాన్ని ఉపదేశించాడని ప్రతీతి.. 


భద్రాచలంలో గోపన్న జయంతి  వేడుకలు

భద్రాచలం, నమస్తే తెలంగాణ  : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రతి ఏటా జరిగినట్లే ఈ ఏడాది కూడా శ్రీ భక్త రామదాసు 386వ జయంతి ఉత్సవాలు (వాగ్గేయ కారోత్సవాలు) ఈనెల 29 నుంచి ఫిబ్రవరి2వ తేదీ వరకు 5రోజులపాటు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో జీ.నరసింహులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయంలోని చిత్రకూట మండపంలో అలివేలుమంగ సర్వయ్య చారిటబుల్‌ ట్రస్ట్‌ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఈ దేవస్థానానికి దత్తత దేవాలయమైన, శ్రీభక్తరామదాసు జన్మస్థలమైన శ్రీభక్తరామదాసు ధ్యాన మందిరం, నేలకొండపల్లిలో కూడా ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకు మూడు రోజులపాటు వాగ్గేయ కారోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడునని ఈవో తెలిపారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ప్రముఖ సంగీత విధ్వాంసులచేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కావునా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈవో కోరారు.  


నేటి నుంచి  జయంత్యుత్సవాలు... 

గతంలో ఇక్కడ స్థానిక రామదాసు విద్వత్‌ కళాపీఠంచే రామదాసు ఆరాధనోత్సవాలు మాత్రమే జరిగేవి.. తెలంగాణ ప్రభుత్వం 2017 నుంచి భక్త రామదాసు జయంత్యుత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోంది. గత ఏడాది ఫిబ్రవరి 8 నుంచి మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించగా, ఈ సంవత్సరం ఈనెల 29 నుంచి 31 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, జిల్లా కలెక్టర్‌, జిల్లా పాలనా యంత్రాంగం, భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం, నేలకొండపల్లి శ్రీభక్తరామదాసు విద్వత్‌ కళాపీఠం సంయుక్తంగా  ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈనెల 29న ఉదయం గం.10లకు రామదాసు కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆవిష్కరించనున్నారు. 6 లక్షల రూపాయల విలువైన 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని హైద్రాబాద్‌ నుంచి తెప్పించారు. 


ఈ మహత్తర కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు వి.శ్రీనివాసగౌడ్‌, ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ,  జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి కర్ణన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి యం.లక్ష్మణ్‌, పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌, ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కె.వి రమణాచారి,మాజీ ప్రభుత్వ సలహాదారు బి.వి పాపారావు, సీఎం పీఆర్‌ఓ వనం జ్వాలా నర్సింహారావు, సీఎం ఓఎస్‌డి దేశపతి శ్రీనివాస్‌, భద్రాచలం దేవస్థానం ఈఓ నర్సింహులు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. హైద్రాబాద్‌, సికింద్రాబాద్‌, నిజామాబాద్‌, దుర్గాభాయి దేశ్‌ముఖ్‌ సంగీత నృత్య కళాశాలల విద్యార్థులచే భక్త రామదాసు నవరత్న కీర్తనల గోష్ఠిగానం, భజనలు, రామదాసు కీర్తనల గానం, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నారు. 30న వేలాది మంది విద్యార్థుల చేత నగర సంకీర్తన, దాశరథి శతక పద్యముల పఠనం, సంగీత నృత్య కార్యక్రమాలు, 31న శ్రీభక్తరామదాసు సాహిత్య సమాలోచన సదస్సు, నెల్‌సెండా( నేలకొండపల్లి) పిల్లల కథల పుస్తకావిష్కరణ, సప్త మృదంగ వాద్య విన్యాసము తదితర ఆధ్యాత్మిక, భక్తి రస కార్యక్రమాలకు నేలకొండపల్లి నెలవు కానుంది..