ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Jan 28, 2020 , 00:19:31

క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగండి

క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగండి


అటవీశాఖ ఉద్యోగులు, అధికారుల క్రీడల ప్రారంభంలో సీపీఎఫ్‌ 

మయూరి సెంటర్‌, జనవరి 27: అటవీశాఖలో విధులు నిర్వహిస్తూ ఆటవిడుపుగా ఇదే శాఖకు చెందిన నాలుగు జిల్లాల ఉద్యోగులు, అధికారులు తమకు వచ్చిన క్రీడలను ఇక్కడ ప్రదర్శించేందుకు 25వ రీజినల్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో పాల్గొనడం సంతోషదాయకమని, క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని ఛీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (సీసీఎఫ్‌)పీవీ రాజారావు సూచించారు. ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో అటవీశాఖ విభాగానికి చెందిన ఉద్యోగులు, అధికారులు సోమవారం ఆయా క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. తొలుత ఈ క్రీడాపోటీల ప్రారంభోత్సవంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి ఆకాశంలోకి శాంతి కపోతాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అటవీశాఖ విభాగంలో ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాలకు చెందిన ఉద్యోగులు, అధికారులు ఈ క్రీడాపోటీల్లో పాల్గొనడం సంతోషదాయకమని అన్నారు. అనంతరం ఖమ్మం డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (డీఎఫ్‌వో) అధికారి ప్రవీణా మాట్లాడుతూ క్యారమ్స్‌, అథ్లెటిక్స్‌, లాంగ్‌జంప్‌, కబడ్జీ క్రీడా పోటీల్లో నాలుగు జిల్లాలకు చెందిన తమ విభాగ ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నట్లు చెప్పారు. ఈ నెల 28తో ఈ క్రీడా పోటీలు ముగుస్తాయని అన్నారు. ఈ సందర్భంగా అటవీ సంరక్షణ శాఖ విభాగానికి చెందిన అసోసియేషన్‌ నూతన సంవత్సర డైరీలను సీసీఎఫ్‌ పీవీ రాజారావు ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎఫ్‌లు ప్రకాషన్‌, సతీశ్‌కుమార్‌, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ రేణుక, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.