శుక్రవారం 04 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jan 28, 2020 , 00:12:21

తెలంగాణ ప్రజలంతా కేసీఆర్‌ పక్షమే

తెలంగాణ ప్రజలంతా కేసీఆర్‌ పక్షమే
  • ప్రతిపక్షాల కుట్రలను భగ్నం చేసిన
  • పట్టణ ఓటర్లు: బాలసాని, కొండబాల

ఖమ్మం, నమస్తే తెలంగాణ, జనవరి 27: తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌, బీజేపీ పన్నిన కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని, మున్సిపల్‌ ఎన్నికలలో వచ్చిన ప్రజా తీర్పుతో ప్రతి పక్షాలకు కోలుకోలేని దెబ్బతగిలిందని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్‌లో సోమవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు గెలిచిన పార్లమెంట్‌ స్థానాల పరిధిలో ఒక్క మున్సిపాలిటీని కూడా గెలవలేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అప్రదిష్టపాలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదన్నారు. తెలంగాణ ప్రజలు చరిత్రను తిరగరాశారని అన్నారు. పది మున్సిపల్‌ కార్పొరేషన్లు, 110కి పైగా మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించారంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజలకున్న నమ్మకమేమిటో అర్థం అవుతోందని అన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ విజయదుందుబి మోగించిందని అన్నారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించేలా కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ నాయకులు జలగం రామకృష్ణ, హన్మంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.