శుక్రవారం 04 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jan 27, 2020 ,

కొలువుదీరనున్న పట్టణాధీశులు

కొలువుదీరనున్న పట్టణాధీశులు
  • నేడు మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక
  • అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం
  • కొత్తగూడెం, ఇల్లెందులో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • ‘బొగ్గుట్ట’ పీఠం జనరల్‌కు, ‘గూడెం’ పీఠం జనరల్‌ మహిళకు రిజర్వ్‌

భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కొత్తగూడెం మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయదుందుభి మోగించింది. చైర్‌పర్సన్‌ పీఠాన్ని అధిష్టించడానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ను సొంతంగా సాధించింది. దీంతో చైర్‌పర్సన్‌ పీఠాన్ని కైవసం చేసుకోనుంది. చైర్‌పర్సన్‌ స్థానాన్ని సాధించేందుకు  19మంది కౌన్సిలర్లు అవసరముండగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఒంటరిగానే  25 స్థానాలు గెలుచుకొని రికార్డు సృష్టించింది. చైర్‌పర్సన్‌ పీఠంపై కూర్చునే అదృష్టం మరికొద్దిగంటల్లో తేలనుంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ కౌన్సిలర్లు పీఠంపై కన్నేశారు. కానీ, పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం చైర్‌పర్సన్‌ పేరును  ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రకటించనున్నారు. 

తొలుత కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం

తొలుత, ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లతో సోమవారం ఉదయం 11.30 గంటలకు భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం, 12.30 గంటలకు చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరగనుంది. 36మంది కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేయనుండగా ఇందులో బోయిన విజయ్‌, వేల్పుల దామోదర్‌, కౌడగాని పరమేష్‌యాదవ్‌, కేశంశెట్టి సుజాత, తలుగు అనిల్‌కుమార్‌, కాపు సీతాలక్ష్మీ, కంచర్ల జమలయ్య, మోరె రూప, మునిగడప పద్మ, భూక్యా శ్రీనివాస్‌, కూరపాటి విజయలక్ష్మీ, వనచర్ల విమల, అఫ్జలున్నీషా భేగం, గుమ్మడెల్లి కళ్యాణి, పాలోజు సత్యనారాయణ, అజ్మీర సుజాత, మాచర్ల రాజకుమారి, మాదా సత్యవతి, తొగరు రేఖా నళిని జయంతి, ఎండి.సాహేరా భేగం, అంబుల వేణుగోపాల్‌, వేముల ప్రసాద్‌బాబు, ఎం.ఆమని, తంగెళ్ల లక్ష్మణ్‌, ఎన్‌.సమైఖ్య, యరమల శ్రీనివాసరెడ్డి, కె.లీలారాణి, రావి మమత.. తొలిసారి మున్సిపల్‌ కౌన్సిల్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఇందులో అత్యధికంగా 17మంది మహిళలు  ఉండగా, మొత్తంగా కౌన్సిల్‌లో రెండు, మూడుసార్లు గెలిచిన మహిళా అభ్యర్ధులతో కలిసి 21మంది మహిళలు కౌన్సిల్‌లో తమ వాణి వినిపించనున్నారు. 

కొలువుదీరనున్న కొత్త పాలకవర్గం

గత సంవత్సరం జూలై నెలలో ముగిసిన కొత్తగూడెం మున్సిపల్‌ కౌన్సిల్‌ స్థానానికి ఇటీవల ఎన్నికల జరగడం ఫలితాలు ప్రకటించడం జరిగిపోయాయి. ఇప్పటి వరకు మున్సిపాలిటీకి కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ ప్రత్యేకాధికారిగా విధులు నిర్వర్తించారు. సోమవారం నుంచి కొత్త పాలకవర్గం కొలువుదీరనుండటంతో మున్సిపల్‌ కౌన్సిల్‌ నుంచి అభివృద్ధి జరగనుంది. నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్‌కు సర్వాధికారాలను ప్రభుత్వం కట్టబెట్టింది.

ఇల్లెందులోనూ ఎన్నిక లాంఛనప్రాయమే...

ఇల్లెందు, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ పాలకవర్గం సోమవారం కొలువుదీరనుంది. ఇందుకోసం మున్సిపల్‌ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.  మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయదుందుభి మోగించిన విషయం పాఠకులకు తెలిసిందే. ఇండిపెండెంట్లతో కలిపి 21 స్థానాలలో విజయకేతనం ఎగురవేసింది. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక లాంఛనమే. పార్టీ అధిష్టానం, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నేడు చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పేర్లను ప్రకటించనున్నారు. ఉదయం 11 గంటలకు మున్సిపల్‌ కార్యాలయంలో కౌన్సిలర్లకు ప్రమాణ స్వీకారం ఉంటుంది. మొత్తం 24 వార్డులకుగాను 24 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక ఉంటుంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో టీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానం సోమవారం 11 గంటలకు చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పేర్లు ఖరారు చేస్తుంది. అనంతరం, వారు ప్రమాణ స్వీకారం చేస్తారు. కొత్త పాలకవర్గం ఏర్పాటు కానుంది. ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు పాలకవర్గం అన్ని చర్యలు తీసుకోనుంది. సమస్యలపై దృష్టి సారించనుంది. ప్రభుత్వం త్వరలో పట్టణ ప్రగతి, కొత్త అర్బన్‌ పాలసీని ప్రకటించే అవకాశం ఉంది. ఆ విధంగా పాలకవర్గం చర్యలు చేపట్టనుంది. ప్రధానంగా పారిశుధ్యం, అభివృద్ధి పనులను పాలకవర్గం పర్యవేక్షించనుంది. తొలిసారిగా ఇల్లెందుపై గులాబీ జెండా రెపరెపలాడనుంది. గతంలో సీపీఎం, కాంగ్రెస్‌, టీడీపీలు జెండాలు ఎగురవేశాయి. తొలిసారిగా ఇల్లెందు మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక కార్యక్రమంలో ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియానాయక్‌ పాల్గొంటారు.