మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jan 27, 2020 ,

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు

భద్రాచలం, నమస్తే తెలంగాణ: శ్రీసీతారామచంద్రస్వామివారు సతీసమేతంగా సంచరించిన పుణ్య ధామం భద్రగిరి. ప్రతీఏటా ఈ పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను అంగ రంగవైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఇందుకు సంబంధించి ముహూర్తాన్ని వైదిక కమిటీ నిర్ణయించింది. నివేదికను దేవస్థాన అధికారులకు అందజేశారు. మార్చి 25 నుంచి ఏప్రిల్‌8వ తేదీ వరకు ఈ ఏడాది వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 25న ఉగాది పండుగ సందర్భంగా నూతన పంచాంగ శ్రవణం, తిరువీధిసేవలు నిర్వహిస్తారు. 29న ఉత్సవ అంకురారోపణం జరుపుతారు. 30న ధ్వజపట భద్రక మండల లేఖనం, గరుడాధివాసం, తిరువీధి సేవ నిర్వహిస్తారు. 31న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఏప్రిల్‌1న ఎదుర్కోలు ఉత్సవం జరుపుతారు. 2న శ్రీరామనవమి (శ్రీసీతారాముల కల్యాణం) జరుపుతారు. అదేరోజు శ్రీరామపునర్వసు దీక్ష ప్రారంభమవుతోంది. ఏప్రిల్‌3న శ్రీరామపట్టాభిషేకం నిర్వహిస్తారు. ఏప్రిల్‌4న సదశ్యం, 5న తెప్పోత్సవం, చోరోత్సవం, 6న ఊంజల్‌ ఉత్సవం జరుపుతారు. 7న వసంతోత్సవం, 8న చక్రతీర్థం, పూర్ణాహుతి జరుపుతారు. దేవస్థానం అధికారులు త్వరలోనే ప్రభుత్వానికి నివేదించనున్నారు. త్వరలో అంతర్గత సమావేశాలు నిర్వహించనున్నారు. 

రామాలయంలో భక్తుల సందడి

భద్రాచలం రామాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివచ్చారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు రామాలయానికి చేరుకొని రామున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. రుష్యమూక మ్యూజియంను సందర్శించి సీతమ్మవారి నగలను తిలకించారు. అనంతరం రామయ్యస్వామికి నిత్యకల్యాణం నిర్వహించారు.