గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Jan 27, 2020 ,

రాజ్యాంగంపై అవగాహన ఉండాలి

రాజ్యాంగంపై అవగాహన ఉండాలి

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగ రంగ వైభవంగా జరిగాయి. తొలుత ఐటీడీఏ కార్యాలయానికి చేరుకున్న పీవో వీపీ గౌతమ్‌కు సంప్రదాయబద్ధ్దంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీవో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. తొలుత అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించారన్నారు. మనదేశ స్వాతంత్ర అనంతరం స్వయం పరిపాలనకై ప్రజాస్వామ్య, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక వ్యవస్థలను పునాదిగా భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యంగం ఫలితంగానే దేశం గణతంత్ర దేశంగా అవతరించినందన్నారు. భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన ప్రగతే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని వెల్లడించారు. గిరిజన విద్యా ప్రగతికి పెద్దపీఠ వేశామన్నారు. 2018-19 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో 39 పాఠశాలలను ఎంపిక చేసి వాటికి 13 అడాప్షన్‌ ఆఫీసర్లను నియమించడం జరిగిందన్నారు. గిరిజన విద్యార్థులకు చదరంగంలో శిక్షణ ఇచ్చామన్నారు. విద్యతోపాటు క్రీడల్లో కూడా ప్రత్యేక తర్పీద్‌ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. భద్రాద్రిలో గిరి బాలోత్సవం సైతం నిర్వహించామన్నారు. ఆశ్రమ, గురుకుల పాఠశాలల విద్యార్థులు అనేక క్రీడా పోటీల్లో సత్తాచాటి ఐటీడీఏకి వన్నె తీసుకువచ్చామన్నారు. ట్రైకార్‌ గ్రామీణ రవాణా పథకం ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వివిధ రకాల సబ్సిడీ వస్తువులను అందజేయడం జరిగిందన్నారు. అనేక గిరిజన భవనాలు నిర్మించామని, మహిళా ఉద్యోగులకు వసతి భవనం, యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, గురుకుల పాఠశాలల భవనాలు నిర్మాణం చేశామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు చేసుకున్న వారికి ఇప్పటి వరకు 3756 కేసీఆర్‌ కిట్లు అందజేయడం జరిగిందని తెలిపారు. గిరిజనులకు వ్యవసాయ రంగంలో కూడా చేయూతనిచ్చి వారిని అభివృద్ధి పరిచామన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు పీవో అందజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఎంపీపీ శాంతమ్మ, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. 


సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో..

భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సబ్‌ కలెక్టర్‌ భవేష్‌మిశ్రా జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ...ఎందరో త్యాగ వీరుల పోరాట ఫలితంగా భారతదేశం స్వాతంత్య్రం పొందిందని గుర్తు చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాజ్యంగాన్ని రచించి ఈ దేశానికి ఉత్తమమైన రాజ్యంగాన్ని అందజేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో భద్రాచలం డీఏవో పీ.రామకృష్ణ, భద్రాచలం తహసీల్దార్‌ శేషు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.