బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jan 25, 2020 , 00:22:53

మరి కొద్ది గంలట్లో కౌంటింగ్‌

 మరి కొద్ది గంలట్లో కౌంటింగ్‌


అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఘడియలు రానే వచ్చాయి.. రెండు రోజుల నిరీక్షణకు తెరపడనుంది.. మరికొన్ని గంటల్లో  విజేతలెవరో తేలనుంది.. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఉత్కంఠకు నేటితో ముగింపు పడనుంది. కొత్తగూడెం, ఇల్లెందులో కలెక్టర్‌ రజత్‌కుమార్‌ షైనీ నేతృత్వంలో ఎన్నికల అధికారులు కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు.. ఓట్ల లెక్కింపు మొదలు పెట్టిన రెండు గంటల్లోనే మొత్తం ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసు అధికారులకు, సిబ్బందికి ఎస్పీ సునీల్‌దత్‌ సూచనలిచ్చారు.. మున్సిపల్‌ పీఠాలను దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు ఎవరి ఎత్తులు వారు వేస్తున్నారు. ఇతర పార్టీల ప్రలోభాలకు లోనుకాకుండా ఫలితాలు వెలువడిన వెంటనే విజేతలను క్యాంపులకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 27న చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నిక జరగనుండటంతో రాజకీయ నేతలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.                                                  

  -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మిగిలింది కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.. కౌంటింగ్‌ శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది.  ఉత్కంఠ రేపే ఫలితాలతో అభ్యర్థుల అంచనాలు ఊహలకు అందని విధంగా ఉండనున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే కౌంటింగ్‌ ప్రక్రియ మరికొద్ది గంటల్లోనే ప్రారంభం కానుంది. రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల అధికారులు నేడు జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మున్సిపల్‌ పీఠాలు ఎవరివో నేడు తెలిపోనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ శనివారం ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల చేయనుంది. పోటీచేసిన అభ్యర్థులు మరికొద్ది గంటల్లో తమ భవితవ్యాన్ని తెల్చుకోబోతున్నారు. అభ్యర్థులతో పాటు ఎన్నికల ఫలితాల కోసం పట్టణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరు గెలుస్తారోనని ఉత్కంఠత. ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న మున్సిపల్‌ ఎన్నికల తీర్పు సమయం రానే వచ్చింది. అధికారులు బ్యాలెట్‌ బాక్సులను కొత్తగూడెం, ఇల్లెందులోని కౌంటింగ్‌ కేంద్రాలలో ముందుగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించి పటిష్ట భద్రత కల్పిస్తున్నారు.

ఎక్కడ చూసినా అదే చర్చ..

ఈనెల 22న ఎన్నికలు ముగియడంతో.. ప్రజలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు ఫలితాలపై ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ఐదేళ్ళ మున్సిపాలిటీ పాలకులను ఎన్నుకునే ఎన్నికల ఫలితాలు కావడంతో ఈ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకోనున్నారు. బయట ఏ నలుగురు కలిసినా దీనిపై చర్చించుకుంటున్నారు. తాము ఓటు వేసిన పార్టీ అభ్యర్ధి కౌన్సిలర్‌గా గెలుస్తాడా లేక వేరే పార్టీ అభ్యర్థి గెలుస్తాడా.. అని లెక్కలు వేసుకుంటున్నారు.  దీంతో అన్నీ పార్టీల అభ్యర్థ్ధుల్లో సర్వత్రా అందోళన నెలకొంది.

కొత్తగూడెం, ఇల్లెందులో కౌంటింగ్‌

జిల్లాలోని కొత్తగూడెం మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు కొత్తగూడెం మహిళా కళాశాల, ఇల్లెందులోని సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొత్తగూడెంలోని 36 వార్డులకు సంబంధించిన బ్యాలెట్‌ బాక్సులను కొత్తగూడెంలోని మహిళ కళాశాలకు, ఇల్లెందులోని 24 వార్డులకు చెందిన బ్యాలెట్‌ బాక్సులను సింగరేణి కమ్యూనిటీ హాల్‌లోని స్ట్రాంగ్‌రూమ్‌ల్లో భద్రపర్చి పటిష్ట భద్రతను కల్పిస్తున్నారు. పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో ఉదయం 8 గంటలకు అధికారులు బ్యాలెట్‌ బాక్సులను తెరిచి తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌  లెక్కించనున్నారు. అనంతరం 25 ఓట్లను ఒక కట్టగా చేసి కట్టలు కట్టడం పూర్తయిన అనంతరం ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్‌ ఏజెంట్లకు పాస్‌లు జారీ చేశారు. పాస్‌లు ఉంటేనే వారిని కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతించనున్నారు. అంతేకాకుండా మీడియాకు సైతం ప్రత్యేక పాస్‌లను జారీ చేశారు. పాస్‌లు ఉన్న వారిని మాత్రమే పకడ్బందీగా చెక్‌ చేసి అనంతరం లోనికి పంపించనున్నారు.
ఫలితాలు కారుకే అనుకూలం
కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో కారు ఘన విజయం ఖాయమైనట్లే.. రెండు మున్సిపాలిటీల్లోను టీఆర్‌ఎస్‌కు చెందిన వార్డు సభ్యులే విజయఢంకా మోగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండు మున్సిపాలిటీల పరిధిలో టీఆర్‌ఎస్‌ పార్టీకి బలమైన ఓటు బ్యాంక్‌ ఉంది. ఆరేళ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువకావడం, టీఆర్‌ఎస్‌ పార్టీ పట్ల ప్రజలు సానుకూల ధృక్పథంతో ఉండడం, ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది.

ఇల్లెందు మున్సిపాలిటీలోని 24 వార్డులకు 24 టేబుల్స్‌ను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించారు. సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తం లెక్కింపు రెండు రౌండ్‌లలో పూర్తి చేసి పదిన్నర గంటల సమయంలో పూర్తిస్థాయిలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. 24 వార్డులలో 156 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలిపోనుంది.

కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్‌

మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ రజత్‌కుమార్‌ షైనీ తెలిపారు. 25వ తేదీ ఉదయం 8 గంటలకు జరిగే మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లను పురస్కరించుకొని కొత్తగూడెం మున్సిపాలిటీలోని 36 వార్డులకు కొత్తగూడెం మహిళా కళాశాలలోనూ, ఇల్లెందులోని 24 వార్డులకు సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కొత్తగూడెం మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌కుమార్‌, పాల్వంచ మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌, పినపాక ఎంపీడీవో శ్రీనివాసరెడ్డిలతో పాటు కొత్తగూడెం మున్సిపాలిటీలోని సింగరేణి మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ హాల్‌లో ఏర్పాట్లపై 3 వార్డులకు ఒక ఆర్‌వో, ఒక ఏఆర్‌వో చొప్పున 36 వార్డులకు 12 మంది ఆర్‌వోలు, మరో 12 మంది ఏఆర్‌వోలను కేటాయించి కౌంటింగ్‌ విధానంపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. 36 వార్డులకు 36 టేబుళ్లను ఏర్పాటు చేశామని, ఒక్కో టేబుల్‌కు ఒక పర్యవేక్షకుడు, మరో ఇద్దరు సహాయకులు ఉంటారన్నారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు చేపడతామని, అనంతరం బ్యాలెట్‌ ఓట్లను 25 చొప్పున లెక్కించి కట్టలు కట్టి 40 కట్టలను డ్రమ్‌లో వేసి కలియ తిప్పిన తర్వాతనే ఒక్కో కట్టలోని ఓట్లను లెక్కిస్తామన్నారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అయ్యే ఈ ప్రక్రియను సిబ్బంది ఉదయం 6 గంటలకే లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని చెప్పారు. 36 వార్డులకు 2 రౌండ్లతో లెక్కింపు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఒక్కో పార్టీకి ఒక్కరికి మాత్రమే పాస్‌ ఇచ్చామన్నారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి వెళ్లే వారు సెల్‌ఫోన్స్‌ తీసుకెళ్లరాదని, మద్యం సేవించిన వ్యక్తులను అనుమతించమని చెప్పారు. కౌంటింగ్‌ ప్రక్రియను మీడియా ద్వారా తెలిపేందుకు కళాశాలలోనే మీడియా కేంద్రం ఏర్పాటు చేశామన్నారు.

కౌంటింగ్‌ ఏర్పాట్లను పరిశీలించిన జేసీ

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం జరగనుంది. ఇందుకోసం కొత్తగూడెం సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని జాయింట్‌ కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లు మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌కుమార్‌తో కలిసి శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కౌంటింగ్‌ కోసం ఏర్పాటు చేసిన టేబుళ్లు, ఏజెంట్ల కోసం ఏర్పాటు చేసిన చైర్స్‌ తదితర వాటిని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. కౌంటింగ్‌ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలని సూచించారు.