బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jan 24, 2020 , 00:55:40

గులాబీ గెలుపు లాంఛనమే..

 గులాబీ గెలుపు  లాంఛనమే..
  • -ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు మున్సిపాలిటీలూ టీఆర్‌ఎస్‌వే
  • -కేసీఆర్‌ పాలన నచ్చే ‘కారు’కు ఓటేశామంటున్న ఓటర్లు
  • -రేపు మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్‌
  • -27న చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ
  • -ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం

మునిసి‘పోల్స్‌' సంగ్రామాన్ని తలపించాయి.. నిండు చలికాలంలో సెగ పుట్టించాయి.. రాజకీయ పార్టీలకు సవాల్‌ విసిరాయి.. చిన్నాపెద్ద నాయకులందరూ పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.. పోటీచేసిన అభ్యర్థులు ‘నువ్వా.. నేనా..?’ అన్న రీతిలో తలపడ్డారు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా, సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం, ఇల్లెందు పట్టణాల్లో బుధవారం ఎన్నికలు హోరాహోరీగా ముగిశాయి.. ఏది ఏమైనా టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. అధికార పార్టీ చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయని, ఐదు మున్సిపల్‌ పీఠాలూ గులాబీ పార్టీవేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. కాగా            మరో వైపు ప్రతిపక్షాలు మాత్రం డైలమాలో పడ్డాయి.. ఎన్నికల ఫలితాలు ఏ విధంగా వస్తాయోనని డీలా పడ్డాయి.. శనివారం ఈ ఉత్కంఠకు తెరపడనుంది.. ఐదు మునిసిపాలిటీల పరిధిలో పకడ్బందీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగనుంది.. ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.. ఈ నెల 27న జరిగే తొలి సమావేశంలోనే, చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ జరుగనుంది. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం మధ్యాహ్నం 12 గంటల
30 నిమిషాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.
-ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తేతెలంగాణ


(ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ): మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. భారీ బందోబస్తు మధ్య కౌంటింగ్‌ జరుగనుంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించనున్నారు. రెండంచల భద్రతను ఏర్పాటుచేస్తున్నారు. ఈ నెల 27న ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ జరగనుంది. అదే రోజున నూతన పాలకమండళ్ల తొలి సమావేశం నిర్వహిస్తారు. తొలి సమావేశంలోనే చైర్మన్ల ఎన్నిక ప్రక్రియను చేపట్టనున్నారు. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

ఐదు మున్సిపాలిటీలపై గులాబీ జెండా..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, మధిర, సత్తుపల్లి, వైరా మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తున్నది. సత్తుపల్లిలో అన్ని స్థానాలనూ టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోబోతున్నది. ఇక్కడ ఇప్పటికే ఆరు వార్డులను తన ఖాతాలో వేసుకున్న టీఆర్‌ఎస్‌ మిగిలిన 17 వార్డుల్లో కూడా గెలుపొందుతుందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. సత్తుపల్లి మున్సిపల్‌ చైర్మన్‌. వైస్‌ చైర్మన్‌ స్థానాలను కూడా ఆ పార్టీకి దక్కనున్నాయి. వైరా మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో 15 వార్డులకు తగ్గకుండా టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు చోట్ల స్థానిక శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాముల్‌నాయక్‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాన బాధ్యతలను శాసనసభ్యులకే అప్పగించడంతో అన్నీ తామై ఎన్నికల్లో పనిచేశారు, అభ్యర్థుల ఎంపికలో కూడా వీరే కీలకంగా వ్యవహరించారు. అదేవిధంగా మధిర మున్సిపాలిటీలోని 22 వార్డుల్లో కూడా 15 వార్డులకు తగ్గకుండా టీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థులు కూడా బలంగానే ప్రచారం చేశారు. అయినప్పటికీ అధికారంలో ఉన్న పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించినట్లయితే అభివృద్ధికి అవకాశం ఉంటుందని భావించిన ఓటర్లు కారు గుర్తు వైపే మొగ్గు చూపారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా మధిర నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ శాసనసభ్యుడు మల్లు భట్టి విక్రమార్క నిధులు తేలేరని, అదే టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించడం ద్వారా మధిర పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చని భావించిన ఓటర్లు గులాబీ పార్టీ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తున్నది. అందుకనే ఈ మున్సిపాలిటీలో అత్యధిక వార్డులను టీఆర్‌ఎస్‌ గెలవబోతున్నదని పలువురు పేర్కొంటున్నారు. ఈ మున్సిపాలిటీలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ అన్నీ తానై బాధ్యతలు నిర్వర్తించారు. ఇల్లందు మున్సిపాలిటీలో రెబల్స్‌ బెడద ఉన్నప్పటికీ అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపు బాటలో పయనించబోతున్నారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి, ఇల్లెందు ఇన్‌చార్జ్‌ తాతా మధు, స్థానిక ఎమ్మెల్యే హరిప్రియలు ప్రధాన బాధ్యతలను తీసుకొని పనిచేశారు. మెజారిటీ స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకొని చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను కూడా సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలోని అన్ని స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందే అవకాశాలున్నాయి.

డీలాపడ్డ కూటమి నేతలు..

సత్తుపల్లి, వైరా, మధిర, కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో కూటమి నేతలు పోలింగ్‌ అనంతరం చేతులెత్తేశారు. మధిర, సత్తుపల్లి , వైరా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, టీడీపీలు కూటమిగా ఏర్పడి పోటి చేశాయి. పోలింగ్‌ అనంతరం ఓటింగ్‌ సరళిని పరిశీలించిన ఆ పార్టీల నాయకులు ఓటమిని నైతికంగా అంగీకరిస్తూ మాట్లాడుతున్న తెలుస్తున్నది. ఇల్లెందులో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థికి కూటమి నేతలు మద్దతు తెలిపినప్పటికీ ఓటర్లు  మాత్రం టీఆర్‌ఎస్‌ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తున్నది. ఈ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో కూడా కూటమి నేతల ప్రయత్నాలు ఫలించేలా లేవు. ఇక్కడ కూడా కూటమి అభ్యర్థులకు ప్రజల మద్దతు లేదని, ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన అభ్యర్థులకే పట్టణ ఓటర్లు ఓటు వేశారని, దీంతో అత్యధిక స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుచుకుంటుందని పలువురు పేర్కొంటున్నారు.

ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లిన నేతలు..

అవిభక్త జిల్లాలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహించిన ప్రచారంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రచారం చేయడంలో సఫలీకృతులయ్యారు. దీంతో పట్టణ ఓటర్లు టీఆర్‌ఎస్‌ ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు మూడు మున్సిపాలిటీల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, వైరా మున్సిపాలిటీలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌, మధిర మున్సిపాలిటీలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజులు ప్రధాన బాధ్యతలను నిర్వహించారు. ఇల్లెందులో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌, కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావులు ప్రధాన ప్రచారాన్ని నిర్వహించారు. ఇల్లెందులో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు సైతం అక్కడే ఉండి బాధ్యతలను నిర్వహించారు. ఈ నెల 14 నుంచి నిర్వహించిన ప్రచారంలో ప్రభుత్వ పథకాలను, రానున్న రోజుల్లో మున్సిపాలిటీ అభివృద్ధికి తీసుకురాబోయే నిధులను వివరిస్తూ ప్రచారం చేశారు. మున్సిపాలిటీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అధికారంలో ఉన్న పార్టీని గెలిపించినట్లయితే నిధులకు కొరత ఉండదని నాయకులు హామీనిచ్చారు. ముఖ్యంగా ఐదు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా నాయకులు ప్రచారం కొనసాగింది.

27న చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ..

పురపాలక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఫలితాల అనంతరం చేపట్టాల్సిన విధివిధానాలపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రక్రియను ప్రకటించింది. ప్రధానంగా ఫలితాల తరువాత ఆయా పురపాలికల్లో ఎక్కువ వార్డులు గెలుచుకున్న పార్టీ ఛైర్మన్‌ స్థానాన్ని పొందుతుంది. అందుకోసం చైర్మన్‌ ఎన్నిక నిర్వహణకు మార్గదర్శకాలు విడుదల చేశారు. వాటిలో ఎన్నికల ప్రక్రియ ఇలా ఉంటుంది. ఈ నెల 27న ఛైర్మన్ల ఎన్నికల ప్రక్రియ జరగనుంది. అదే రోజు నూతన పాలక మండళ్ల తొలి సమావేశం నిర్వహిస్తారు. తొలి సమావేశంలోనే ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియను చేపట్టనున్నారు. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఆ వెంటనే వైస్‌ చైర్మన్ల ఎన్నికను చేపడతారు. అనంతరం పురపాలక ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల కోడ్‌ ముగుస్తుంది.