మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Jan 24, 2020 , 00:55:40

స్వైన్‌ఫ్లూపై ఆందోళన వద్దు

స్వైన్‌ఫ్లూపై ఆందోళన వద్దు
  • - అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్న వైద్యారోగ్యశాఖ
  • - నిర్మూలనకు ప్రజా చైతన్య కార్యక్రమాలు
  • - జిల్లా ఆసుపత్రిలో ముందు జాగ్రత్తగా 10 పడకలు ఏర్పాటు
  • -వాతావరణంలో మార్పులే వ్యాధి వ్యాప్తికి కారణం

మయూరిసెంటర్‌/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఖమ్మం జిల్లా ఈ ఏడాది స్వైన్‌ఫ్లూ ఫ్రీ జిల్లాగా చెప్పొచు. గతంతో పోల్చుకుంటే ఇటీవల వానాకాలంలో కురిసిన వర్షాలకు జిల్లాలో సీజనల్‌ జ్వరాలు తీవ్రంగా వ్యాపించడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. ఇదే కొనసాగింపు ఈ శీతాకాలంలోనూ ఉంటుందన్న ఆలోచనలతో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. ముందస్తుగానే ప్రజలను అప్రమత్తం చేసేందకు ప్రజా చైతన్యకార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రప్రభుత్వం ముందు చూపుతో వైద్యారోగ్యశాఖ అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేసింది. శీతాకాలంలో స్వైన్‌ఫ్లూ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందించాల్సిన చికిత్సలపై విస్తృతప్రచారం చేయించింది. ప్రధానంగా ఈ శీతాకాలంలో జ్వరం వచ్చిన వెంటనే ప్రజలు ఆసుపత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా ఇటీవల ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలతో గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడటంతో వ్యాధులు వ్యాపించలేదు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క స్వైన్‌ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదు. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ముందస్తు జాగ్రత్తలపై కార్యక్రమాలు
శీతాకాలంలో  జలుబు, దగ్గు, ఆయాసం, క్షయ వ్యాధిగ్రస్తులకు ఇబ్బంది కరమైన కాలమని చెప్పవచ్చు. ఈ సీజన్‌లో టీబీ వ్యాధిగ్రస్తులు, చిన్నారులు, 60 ఏళ్ల పైబడిన వారు సరైన వైద్యచికిత్సలు పొందుతూ ముఖానికి మాస్క్‌ ధరించి మంచు కురిసే సమయాల్లో బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చలి నుంచి శరీర రక్షణ కోసం ఉన్ని దుస్తులను ధరించినట్లు ఈ కాలంలో వ్యాప్తి చెందే వ్యాధుల పట్ల చిన్నారులు, ప్రజలు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉన్నప్పుడే వ్యాధులు దరిచేరవు. ఈ నేపథ్యంలో స్వైన్‌ప్లూ ప్రభలుతుందనే వదంతులు వినిపిస్తున్నప్పటికీ గత నెలలో హైదరాబాద్‌లో కొన్ని స్వైన్‌ప్లూ కేసులు నమోదైనట్లు సమాచారం. వాతావరణంలో వేగంగా వస్తున్న మార్పులే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. గతేడాది మొత్తం తొమ్మిది కేసులు నమోదు కాగా, డెంగ్యూ కేసులు జనాల్లో దడపుట్టిస్తుంటే, ఇప్పుడు ఈ స్వైన్‌ప్లూ భయం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజలు భయబ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని జిల్లా వైద్యారోగ్యశాఖ, వైద్యవిధాన పరిషత్‌ విభాగాలు అప్రమత్తమై జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ముందస్తుగా పది పడకలు గల ప్రత్యేక గదులను కేటాయించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రితో పాటు ప్రైవేట్‌ వైద్యశాలల్లో  మలేరియా, టైపాయిడ్‌, వైరల్‌ జ్వర బాధితులు చికిత్స పొందుతున్నారు. ఖమ్మం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు స్వైన్‌ప్లూ గుర్తించడంలో వైద్య యంత్రాంగం నిమగ్నమైంది. ఇటీవల వర్షాలు కురిసిన నేపథ్యంలో జ్వరాల తీవ్రత జిల్లాలో ఎక్కువగా   ఉండటంతో వైరల్‌ జ్వరాలతో పాటు మలేరియా,  డెంగ్యూ పాజిటీవ్‌ జ్వర బాధితులకు జిల్లా ప్రభుత్వాసుపత్రి వైద్యయంత్రాంగం చికిత్సలు అందించిది. కొన్ని రోజులుగా ఐదేళ్లలోపు పిల్లలు నిమోనియా, దగ్గు, ఆయాస లక్షణాలుంటే సంబంధిత వైద్యున్ని సంప్రదించి చికిత్స అందించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.

గతంలో తొమ్మిది కేసులు
గతంలో జిల్లాలో తొమ్మిది స్వైన్‌ప్లూ పాజిటీవ్‌ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం రూరల్‌ మండలంలో 3, సత్తుపల్లి 1, సింగరేణి 1, ఖమ్మం అర్బన్‌ 1, తిరుమలాయపాలెం 1, వైరా 1, చింతకానిలో 1 మొత్తం 9 స్వైన్‌ప్లూ పాజిటీవ్‌ కేసుల నమోదయ్యాయి. ఖమ్మం నగరంలో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు  నమోదు కాలేదు.
 
వ్యాధి వ్యాప్తి ఇలా..
వ్యాధి సోకిన వారు దగ్గినప్పుడు, తుమ్మినా, మాట్లాడినా వచ్చే తుంపర్ల కారణంగా వ్యాప్తి చెందుతుంది. గర్భిణీలు, ఐదేండ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వారు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నవారికి, ఎక్కువ మంది జనాభా గుమ్మి గూడిన ప్రాంతంలో ఉన్నవారికి, పాఠశాలలు, వివిధ గృహాలు, కాలేజీ విద్యార్థులకు స్వైన్‌ప్లూ సోకే ప్రమాదం ఉంది. స్వైన్‌ప్లూ హెచ్‌1, ఎన్‌1 అంటువ్యాధి. ఇన్‌ప్లూయంజా అనే ఏ వైరస్‌ వల్ల వ్యాప్తిస్తుంది. ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వ్యాపిస్తుంది. జ్వర లక్షణాలతో ఉండి, ఊపిరితిత్తుల అంతర్భాగంలో సోకి ప్రభావం చూపుతుంది. 

వ్యాధి లక్షణాలు..
జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మూడు దశల్లో వ్యాధిని గుర్తించవచ్చు. మొదటి దశలో జలుబు, దగ్గు, గొంతునొప్పి ఉంటుంది. రెండో దశలో ఆయాసం, ఊపిరితిత్తుల్లో నొప్పి వంటి లక్షణాలు బయటపడతాయి. మూడో దశలో గొంతులు తెమడ ఉండటం, గొంతు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
 నివారణ ఇలా..: నోటికి మాస్క్‌లు కట్టుకోవాలి. కరచాలనం కాకుండా రెండు చేతులతో దండం పెట్టాలి. దగ్గిన, తుమ్మిన తరువాత చేతులు సబ్బుతో కడుక్కోవాలి. స్వైన్‌ప్లూ వ్యాధిగ్రస్తులు ఇంటినుంచి బయటికి రాకుండా పూర్తి విశ్రాంతి తీసుకోవాలి.

భయాందోళన వద్దు
స్వైన్‌ప్లూపై జిల్లా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. స్వైన్‌ప్లూపై రాష్ట్రవైద్యారోగ్యశాఖ అధికారులు ప్రతీ జిల్లాలో పది పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో జిల్లా ఆసుపత్రిలో అక్టోబర్‌లోనే స్వైన్‌ప్లూ వార్డును ఏర్పాటు చేశాం. ఇందులో ఐదు పడకలు మహిళలకు, ఐదు పడకలు పురుషులకు. ప్రత్యేకంగా పరీక్షించేందుకు సిబ్బందిని, వైద్యులను అందుబాటులో ఉంచాం. స్వైన్‌ప్లూ ప్రభావిత ప్రాంతాలు, జనసాంద్రత ఉన్న చోట ముఖానికి మాస్క్‌ ధరించాలి.
-డాక్టర్‌ బీ మాలతి, డీఎంహెచ్‌వో