శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Jan 24, 2020 , 00:55:40

పంట పండింది

పంట పండింది
  • - జిల్లాలో 114 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు
  • - 1.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ
  • -ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.118 కోట్లు జమ
  • - రేపటితో ముగియనున్న విక్రయాలు
  • - యాసంగికి సిద్ధమైన రైతాంగం


వానాకాలం సాగు ఈ ఏడాది రైతు ఇంట సిరులు కురిపించింది.. ధాన్యపు కల్లాలతో పొలాలు కళకళలాడాయి.. తెలంగాణ సర్కార్‌ అందించే ‘రైతుబంధు’కు తోడు వర్షపాతం ఆశాజనకంగా ఉండటంతో వరి సాగు కలిసి వచ్చింది.. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో రైతులు అక్కడే ధాన్యం విక్రయించేందుకు ఆసక్తి చూపారు.. సివిల్‌ సైప్లె అధికారులు 1.60 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ లక్ష్యానికి గాను ఇప్పటివరకు 1.30 లక్షల మెట్రిక్‌
టన్నుల ధాన్యాన్ని సేకరించారు.  -కొత్తగూడెం, నమస్తే తెలంగాణ

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : రైతుల పంట పండింది.. వరి ధాన్యానికి కొదువ లేదు.. ఓవైపు విషన్‌ చెరువుల్లో పుష్కలంగా నీరు, మరో వైపు రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయంతో పంటను అనుకున్నదానికంటే ఎక్కువగా పండించారు. గతేడాది పత్తిపై నష్టం వచ్చిన రైతులు వరి పంటపై దృష్టి సారించారు. దానికి తోడు ప్రభుత్వం వరికి గిట్టుబాటు ధర కల్పించడంతో అనుకున్న ధర లభించింది.  ఈ మేరకు జిల్లాలో 114 కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటికే గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇప్పటి వరకు 1.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.158కోట్ల నగదును రైతులకు చెల్లించాల్సి ఉండగా, రూ. 118కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేశారు. మొత్తం 1.60 లక్ష్యల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు అంచనాలు వేశారు. జీసీసీ, ఐకేపీ, కోపరేటివ్‌ సొసైటీల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అందుబాటులోకి గన్నీ బ్యాగ్‌లను కూడా ఉంచారు. రైతులు విక్రయానికి తీసుకొచ్చిన ధాన్యానికి వెంటనే పేమెంట్లు చేసేవిధంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

పెరిగిన ధాన్యం దిగుబడి..

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ధాన్యం దిగుబడి కూడా ఎక్కువగా పెరిగిందని అధికారులు చెబుతున్నా రు. దానికి తోడు ధాన్యం మద్దతు ధర కూడా పెరిగినందున రైతులు ఎక్కువ శాతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయాలు జరిపే అవకాశాలున్నాయి. దళారుల ప్రమేయం లేకుండా రైతులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. గతేడాది ఖరీఫ్‌లో 1.70 మెట్రిక్‌ టన్నులు ధాన్యం కొనుగోలు చేయగా, రబీలో 22,500 మెట్రిక్‌ టన్నులు ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేసి రైతులకు సకాలంలో వారి ఖాతాల్లో సొమ్ములను జమ చేశారు. తాలిపేరు ప్రాజెక్టు ప్రాంతంలో వరిని ఇంకా కోయలేదు. కేవలం చెరువులు, వర్షాధార ప్రాంతంలోఉన్న వరి పంటను మాత్ర మే కోయడం వల్ల ప్రస్తుతం 1.30 లక్షల టన్నుల ధాన్యం కేంద్రాలకు చేరింది. ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరనుంది. మరో పది రోజులు పాటు ధా న్యం కొనుగోలు కేంద్రాలకు చేరే అవకాశాలున్నాయి. చివరి ప్రాంతాల్లో ఇంకా ధాన్యం రావాల్సి ఉంది.

యాసంగికి సిద్ధమైన రైతన్నలు

వానాకాలం పంట రైతుల చేతికందడంతో యాసం గి పంటల సాగుకు రైతులు సిద్ధమయ్యారు. సాగునీటి సదుపాయం ఉన్న ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే వరి నార్లు వేయడమే కాక నాట్లు కూడా పూర్తి చేశారు. పెట్టుబడి సాయం కూడా రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. రైతులకు విత్తనాలు కూడా వ్యవసాయశాఖ అందుబాటులో ఉంచింది.    గతేడాది 112 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా, ఈ సారి జీసీసీ, ఐకేపీ, ప్రాథమిక సహకారం సంఘాల ద్వారా మొత్తం 144 కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లను చేపట్టారు. 

ధాన్యానికి మద్దతు ధర..

జిల్లాలో వానాకాలం సీజన్‌లో రైతులనుంచి రెండు లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రానుందని అంచనా వేశారు. అందుకు కొనుగోళ్లు జరిపేందుకు వివిధ శాఖ ల ద్వారా 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 144 కేంద్రాలను ప్రారంభించారు. రైతు మార్కెట్‌కు ధా న్యం తెచ్చేటప్పుడు తేమ శాతాన్ని పరిశీలించి టోకెన్‌ ఇవ్వాలని, వాటి ప్రకారమే కొనుగోళ్లు జరపాలని ఇప్పటికే కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. నాణ్యమైన ధాన్యం తెస్తే మద్దతు ధర ఉంటుందని ఏవోలు రైతులకు తెలపాలని, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుంది. మూడో వారంలో ధాన్యం కొనుగోళ్లకు రానుంది. గ్రేడ్‌-1 రకానికి రూ.1,835, కామన్‌ రకానికి రూ.1,815గా ధరను నిర్ణయించారు.

దిగుబడి పెరిగింది 

ఈ ఏడాది రైతులు పండించిన పంటకు మంచి దిగుబడి వచ్చింది. మన జిల్లాలో రేషన్‌ షాపులకు, పాఠశాలకు, హాస్టళ్లకు సరఫరా చేయగా, ఇంకా బియ్యం ఇతర జిల్లాలకు పంపడానికి సరిపడా నిల్వలు ఉన్నాయి. గతేడాదితో పోల్చితే పంట సాగు పెరిగింది. నీరు పుష్కలంగా ఉండటం రైతులకు లాభసాటి అయింది. అకాల వర్షాల వలన కొంతమేర ధాన్యం రంగు మారింది. అయినా ప్రభుత్వం అంతా కొనుగొలు చేయమని ఆదేశాలు ఇచ్చింది. జిల్లాలో 144 కేంద్రాల ద్వారా 1.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం.   -టీఎన్‌ఎస్‌  ప్రసాద్‌, సివిల్‌ సైప్లె డీఎం