ఆదివారం 06 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jan 22, 2020 , 23:55:43

ఎన్నికల బందోబస్తు భేష్‌

ఎన్నికల బందోబస్తు భేష్‌


విధి నిర్వహణలో పాల్గొంటూ ఓటర్లకు చేదోడు వాదోడుగా పోలీస్‌శాఖ పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు శాంతి భద్రతలను పర్యవేక్షించిన ఎస్పీ సునీల్‌దత్‌


కొత్తగూడెం క్రైం, జనవరి 22: హోరాహోరీగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికలు బుధవారం కట్టుదిట్టమైన పోలీస్‌ బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల పరిధిలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. పోలీస్‌ అధికారులు, సిబ్బంది బందోబస్తుతో పాటు, ఓటర్లకు సేవచేయడంలో మరోసారి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. కొత్తగూడెంలోని 36వార్డులకు గాను 85 పోలింగ్‌ కేంద్రాలు, ఇల్లెందు 24 వార్డులకు గాను 48 పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీస్‌ అధికారులు బందోబస్తు నిర్వహించారు. పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్‌ అధికారులు, సిబ్బంది జాగ్రత్తలు తీసుకుని వారికి సహకరించారు. అదేవిధంగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే దివ్యాంగ, వృద్ధ ఓటర్లను పోలీస్‌ సిబ్బంది పోలింగ్‌ కేంద్రాల లోనికి తీసుకువెళ్లి వారి ఓటు హక్కుని స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకునే విధంగా సహకరించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద అభ్యర్థులతో కాని, వారి అనుచరులతో కాని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా విధులు నిర్వహించారు. 


కొత్తగూడెంలో 85ని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఒక డీఎస్పీ షేక్‌ మహమ్మద్‌ అలి నేతృత్వంలో ఏడుగురు ఇన్స్‌పెక్టర్లు, 25మంది ఎస్సైలు, 40మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 135మంది పోలీస్‌ కానిస్టేబుళ్లు, 40మంది మహిళా కానిస్టేబుళ్లు, 60మంది హోంగార్డులను, ఇల్లెందులోని 48 పోలింగ్‌ కేంద్రాలకు ఒక డీఎస్పీ రవీందర్‌ రెడ్డి నేతృత్వంలో ఇద్దరు ఇన్స్‌పెక్టర్లు, 18మంది ఎస్సైలు, 35మంది ఏఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, 150మంది కానిస్టేబుళ్లు, 20మంది మహిళా కానిస్టేబుళ్లు, 40మంది హోంగార్డులను బందోబస్తు విధులకు కేటాయించారు. ఓటింగ్‌ సరిళిని జిల్లా ఎస్పీ సునీల్‌ దత్‌ పలు కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులు, సిబ్బందికి సూచించారు. అదే విధంగా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) అట్ల రమణారెడ్డి పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ ఎన్నికలు 76.47శాతం, ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నికలు 73.73శాతం ఓటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేయడంలో జిల్లాలోని పోలీస్‌ అధికారులు, సిబ్బంది తమ ప్రత్యేకతను చాటుకున్నారు. పోలీసుల సేవాభావానికి ఓటర్లు హర్షాతిరేఖలు వ్యక్తం చేశారు.