మంగళవారం 01 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jan 22, 2020 , 00:08:47

నేడే పోలింగ్‌

 నేడే పోలింగ్‌
  • - ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం
  • - రెండు మున్సిపాలిటీల్లో 33 పోలింగ్‌ కేంద్రాల్లో నేడు ఓటింగ్‌
  • - మొత్తం ఓటర్ల సంఖ్య 91,648
  • - మహిళలు 44,106, పురుషులు 47,542 మంది
  • - పోలింగ్‌ సిబ్బంది - 766 మంది
  • - పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌
  • - ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ రజత్‌కుమార్‌ షైనీజిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.. బరిలో  నిలిచిన అభ్యర్థుల భవిష్యత్‌ను  నిర్ణయించే కీలకఘట్టానికి అంతా  సిద్ధమైంది. కొత్తగూడెం, ఇల్లెందుల్లో మున్సిపల్‌ పోలింగ్‌ నేడు  ఉదయ  7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.  రెండు చోట్ల మొత్తం 60 వార్డుల్లో 133 పోలింగ్‌ కేంద్రాలను ఓటర్లకు అందుబాటులో ఉంచారు. రెండు మున్సిపాలిటీల్లో మొత్తం 91,648 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 766 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 133 మంది పోలింగ్‌ ఆఫీసర్లు, 133 మంది  అసిస్టెంట్‌పోలింగ్‌ ఆఫీసర్లు, మిగతా వారు పోలింగ్‌ క్లర్కులు, ప్రతీ నియోజకవర్గానికి రిజర్వుడ్‌ సిబ్బందిని కేటాయించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రజత్‌కుమార్‌ షైనీ పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ  సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు  చేపట్టారు. ఎన్నికలు నిర్వహించే మున్సిపాలిటీల్లో                  144 సెక్షన్‌ విధించారు. 
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
నమస్తే తెలంగాణ


ఇల్లెందులో 48 పోలింగ్‌ కేంద్రాలు

ఇల్లెందు నమస్తే తెలంగాణ: ఇల్లెందు మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. మొత్తం 48 పోలింగ్‌ స్టేషన్‌లలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 48 పోలింగ్‌ స్టేషన్లలో 290 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. అందులో 58 మంది పీవోలు, మరో 58 మంది ఏపీవోలు, 174 మంది ఓపీవోలు ఉన్నారు. మొత్తం 290 మందిలో 240 మంది విధులు నిర్వహించనున్నారు. మరో 50 మంది రిజర్వుడ్‌గా ఉంచారు. పోలింగ్‌స్టేషన్‌ వివరాల్లోకి వస్తే.. 1వ వార్డు మండల పరిషత్‌ స్కూల్‌ సత్యనారాయణపురం 1,2 పోలింగ్‌స్టేషన్లు, 2వ వార్డు ఇల్లెందులపాడులో మండల ప్రజాపరిషత్‌ స్కూల్‌ 3,4 పోలింగ్‌స్టేషన్లు, 3వ వార్డు జేబీఎస్‌ స్కూల్‌ 5,6 పోలింగ్‌ స్టేషన్లు, 4,5వార్డులు బర్లపెంట మండల ప్రజాపరిషత్‌ స్కూల్‌ 7,8,9,10 పోలింగ్‌స్టేషన్లు, 6,7,8,9,10 వార్డులలో మేయిన్‌రోడ్డు హైస్కూల్‌, సంజీవయ్య కాలనీ మండల ప్రజాపరిషత్‌ స్కూల్‌లో 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 పోలింగ్‌ స్టేషన్లు 11, 12, 13 వార్డులలో సింగరేణి స్కూల్‌ 21, 22, 23, 24, 25, 26 పోలింగ్‌ స్టేషన్లు, 14వ వార్డు మౌలా 14 నెం. బస్తీ మండల ప్రజాపరిషత్‌ స్కూల్‌ 27,28 పోలింగ్‌స్టేషన్లు, 15, 16వ వార్డులు గవర్నమెంట జూనియర్‌ కాలేజి 29, 30, 31, 32 పోలింగ్‌స్టేషన్లు, 17,18వ వార్డులు కళాసీబస్తీ మండల ప్రజాపరిషత్‌ స్కూల్‌ 33, 34, 35, 36 పోలింగ్‌స్టేషన్లు, 19, 20, 21, 22, 23, 24 వార్డులలో ప్రభుత్వ గర్ల్స్‌ హైస్కూల్‌ , స్టేషన్‌ బస్తీ మండల ప్రజాపరిషత్‌ స్కూల్‌, 24 ఏరియా మండల ప్రజాపరిషత్‌ స్కూల్‌ 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటుచేశారు. ఆయా పోలింగ్‌ స్టేషన్ల ఎన్నికల సిబ్బందికి బ్యాలెట్‌ బాక్సులను అధికారులు అందజేశారు. బస్సుల ద్వారా ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ స్టేషన్లకు చేరుకున్నారు. మొత్తం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో 31,946 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారితో పాటు ఇటీవల ఓటు హక్కు నమోదు చేయించుకున్న 56 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వికలాంగులు, వృద్ధులకు ఓటు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. వార్డుల వారీగా వారిని పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు సిబ్బందిని నియమించారు. పోలింగ్‌ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఇల్లెందు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ వేణుచందర్‌లు పర్యవేక్షిస్తున్నారు. స్పెషల్‌ ఫోర్స్‌ , ఐడీపార్టీ తదితర బెటాలియన్లను అందుబాటులో ఉంచారు.

మధిరలో44 స్టేషన్లు..

మధిర, నమస్తేతెలంగాణ: మధిర మున్సిపాలిటీలో ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. మధిర మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులకు గాను మొత్తం 44 బూత్‌లను  ఏర్పాటు చేశారు. ఆయా బూత్‌ల్లో విధులు నిర్వర్తించేందుకు పీవోలు 56 మంది, ఏపీవోలు 57 మంది, ఓపీవోలు 162 మంది కలిపి మొత్తం 275 మంది సిబ్బందిని నియమించారు. మధిర మున్సిపాలిటీ పరిధిలోని జిలుగుమాడు గ్రామంలో 4 బూత్‌లు, మడుపల్లి గ్రామంలో 6 బూత్‌లు, అంబారుపేట గ్రామంలో 2 బూత్‌లు, ఇల్లెందులపాడు గ్రామంలో 2 బూత్‌లు, మధిర టీవీఎం ప్రభుత్వ పాఠశాలలో 6 బూత్‌లు, మధిర ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 6 బూత్‌లు, మధిర సీపీఎస్‌ హైస్కూల్‌లో 4 బూత్‌లు, మధిర హరిజనవాడ హైస్కూల్‌లో 2 బూత్‌లు, మధిర సెయింట్‌ఫ్రాన్సిస్‌ పాఠశాలలో  4 బూత్‌లు, మధిర బంజారాకాలనీ అంగన్‌వాడీలో 1, మధిర బంజారాకాలనీ ఎంపీపీఎస్‌ పాఠశాలనందు 1, మధిర ఎంప్లాయీస్‌కాలనీలో 2 బూత్‌లు, మధిర అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో 2, మధిర ఎన్‌ఎస్పీ గెస్ట్‌హౌస్‌లో 2 బూత్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో బూత్‌లో ఒక పీవో, ఒక ఏపీవో, ముగ్గురు ఓపీవోలు ఎన్నికలు నిర్వహించనున్నారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని అధికారులు మంగళవారం మండల పరిధిలోని ఖాజీపురం గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో పంపిణీ చేశారు. ఈ మేరకు సిబ్బంది ఎన్నికల సామగ్రితో తమతమ పోలింగ్‌కేంద్రాలకు తరలివెళ్లారు. ఈ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. 

కొత్తగూడెంలో 85 కేంద్రాల్లో..

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్నికల సిబ్బందికి పోలింగ్‌ సామాగ్రిని అందజేశారు. 85 పోలింగ్‌ కేంద్రాల్లో సిబ్బంది పోలింగ్‌ మెటీరియల్‌ను పోలింగ్‌ బూత్‌లకు తీసుకెళ్లారు. 36 వార్డులకు సంబంధించిన పీవోలు, ఏపీవోలు, వోపీవోలు మెటీరియల్‌ను పోలింగ్‌ సిబ్బందితో పోలింగ్‌ బూత్‌లకు తరలివెళ్లారు. సిబ్బందికి ప్రత్యేక వాహనాలను కేటాయించి పోలీస్‌ బందోబస్తుతో మెటీరియల్‌, బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది. జిల్లాలోని కొత్తగూడెం మున్సిపాలిటీల్లో ఉన్న మొత్తం 36 వార్డులకు గాను 85 పోలింగ్‌ కేంద్రాలకు మొత్తం 476 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 85 మంది పోలింగ్‌ ఆఫీసర్లు, 85 మంది అసిస్టెంట్‌పోలింగ్‌ ఆఫీసర్లు, మిగతా వారు పోలింగ్‌ క్లర్కులు, ప్రతీ నియోజకవర్గానికి రిజర్వుడ్‌ సిబ్బందిని కేటాయించారు. అంతేకాకుండా అదనంగా బీట్‌ ఆఫీసర్లు, పోలింగ్‌ సెక్టోరియల్‌ ఆఫీసర్లు, సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రతీ పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ జరుగుతుంది. ప్రజలు నిర్దేశిత సమయంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ సూచించారు. కొత్తగూడెం మున్సిపాలిటీలోని 36 వార్డులలో 28,591 మంది మహిళలు, 31,050 మంది పురుషులు ఉన్నారని, వీరి కోసం 85 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

వైరాలో 39 స్టేషన్లు..

వైరా, నమస్తే తెలంగాణ: వైరా మున్సిపాలిటీ ఎన్నికలకు అంతా సర్వం సిద్ధమైంది. పోలింగ్‌ నిర్వాహణ కోసం మంగళవారం అధికారులు, సిబ్బంది పోలింగ్‌స్టేషన్‌లకు తరలి వెళ్లారు. వైరా పశువైద్యశాల ఆవరణంలోని రైతు శిక్షణా కేంద్రం నుంచి పోలింగ్‌ సామగ్రిని సిబ్బందికి పంపిణీ చేశారు. ప్రత్యేకంగా టెంట్లు వేసి కౌంటర్లు ఏర్పాటు చేసి కౌంటర్ల వారీగా పోలింగ్‌ సామగ్రిని అందజేశారు. మొత్తం 20 వార్డులకు గాను 19 వార్డుల కు ఎన్నికలు జరుగుతున్నాయి. 39 పోలింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. 3వ వార్డుల ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. దాంతో రెండు పోలింగ్‌ స్టేషన్‌లో ఎన్నిక నిర్వహిం చాల్సిన అవసరం లేకుండా పోయింది. 39మంది పోలింగ్‌ ఆఫీసర్లు, 39 మంది అసిస్టెంట్‌ పోలింగ్‌ ఆఫీసర్లు, 200 మంది ఇతర పోలింగ్‌ ఆఫీసర్లు ఎన్ని కలకు సామగ్రితో తరలి వెళ్లారు. ఆరు జోన్‌లను ఏర్పా టు చేశారు. ఒక్కో జోన్‌కు ఒక్కో జోనల్‌ అధికారిని నియమించారు. 12 పోలింగ్‌ స్టేషన్‌లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. 39 మందినినియమించారు. వైరా ఏసీపీ కె.సత్యనారాయణ పర్యవేక్షణలో వైరా సీఐ జె.వసంతకుమార్‌ ఆధ్వర్యంలో నలుగురు ఎస్సైలు, 11 మంది ఏఎస్సలు, 11 మంది హెడ్‌ కానిస్టేబుళ్ళు, 60 మంది పోలీస్‌ కానిస్టేబుళ్ళు, ఐదుగురు మహిళా కానిస్టే బుళ్ళు, 23 మంది హోంగార్డ్‌లు విధులు నిర్వహించ నున్నారు. వైరా మున్సిపాలిటీ కమిషనర్‌ ఆర్‌. విజయానంద్‌, తహసీల్దార్‌ హళావత్‌ రంగా తదితరులు పోలింగ్‌ సామగ్రి పంపిణీ ఏర్పాట్లను పర్యవే క్షించారు. సాయంత్రం 4గంటలకే పోలింగ్‌ సామగ్రి పంపిణీ పూర్తి చేసి ఎన్నికల సిబ్బందిని ఆయా పోలింగ్‌ స్టేషన్‌లకు ప్రత్యేక బస్సులో తరలించారు.

సత్తుపల్లిలో 32 పోలింగ్‌ కేంద్రాలు..

సత్తుపల్లి, నమస్తే తెలంగాణ: సత్తుపల్లి మునిసిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు ఆర్డీవో శివాజీ, ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ మీనన్‌లు తెలిపారు. సత్తుపల్లి మునిసిపాలిటీలో మొత్తం 23 వార్డులు ఉండగా 24,767 మంది ఓటర్లు ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 6 వార్డులు ఏకగ్రీవం కాగా 17 వార్డులకు బుధవారం పోలింగ్‌ జరగనుంది. 17 వార్డులకు గాను 18,321 మంది తమ ఓటుహక్కును వినియో గించుకోనున్నారు. 17 వార్డులకు గాను అధికారులు 32 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పా టు చేశారు. ఈ పోలింగ్‌ కేంద్రాల్లో 57 మంది పీవోలు, 57 మంది ఏపీవోలు, 170 ఓపీవోలకు ఈ మేరకు అధికారులు శిక్షణ ఇచ్చారు. మొత్తం 32 పోలింగ్‌ కేంద్రాల్లో 128 మంది సిబ్బందిని కేటాయించారు. పట్టణంలో ఏడుగురు రూట్‌ ఆఫీసర్లు, మూడు ఫ్లయింగ్‌ స్కాడ్‌లను నియమించామన్నారు. ఎన్నికల అనంతరం బ్యాలెట్‌ బాక్సులను స్థానిక జ్యోతినిలయంలోని స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించేందుకు అధికా రులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.

ఈ మేరకు స్థానిక జ్యోతి నిలయంలో ఎన్నికల విధులకు వచ్చిన సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇచ్చి బ్యాలెట్‌ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని అందజేశారు.పట్టణంలోని 17 వార్డుల్లో జరిగే ఎన్నికలకు 32 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. వీటిలో జడ్‌పీహెచ్‌ఎస్‌ బాలికలు, ఎంపీపీఎస్‌ సత్తుపల్లి పాతసెంటర్‌, మునిసిపల్‌ కమ్యూనిటీ హాల్‌ రాజీవ్‌నగర్‌, జడ్పీహెచ్‌ఎస్‌ ఎన్టీఆర్‌నగర్‌, జేవీఆర్‌ డిగ్రీ కళాశాల అయ్యగారిపేట, జడ్పీహెచ్‌ఎస్‌ గర్ల్స్‌ అయ్యగారిపేట, అయ్యగారిపేట ఉర్ధూ పాఠశాలల్లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మీనన్‌ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున ఓటర్లు సైతం తమ ఓటుహక్కును వినియోగించుకు నేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్దకు గుర్తింపు కార్డుతో సహా చేరుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాటు పూర్తిచేశామన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఏసీపీ వెంకటేష్‌ మాట్లాడుతూ పట్టణంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లు తమ ఓటును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు.