మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Jan 22, 2020 , 00:07:58

పల్స్‌ పోలియో @100%..

పల్స్‌ పోలియో @100%..ప్రతి ఒక్క చిన్నారికి చుక్కల మందు వేసిన వైద్య ఆరోగ్యశాఖమొబైల్‌ టీమ్‌ల ద్వారా అన్ని రూట్లలో..ప్రక్రియను పర్యవేక్షించిన డీఎంహెచ్‌వో భాస్కర్‌నాయక్‌, అధికారులు
కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: పల్స్‌పోలియో విజయవంతమైంది. మూడు రోజుల పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్‌పోలియో చుక్కల మందు కార్యక్రమం ఇంటింటికీ వెళ్లి చిన్నారులకు మందు వేశారు. మొబైల్‌ టీమ్‌ల ద్వారా పల్స్‌పోలియోను వేయడంతో ప్రతీ ఇంటిలో చిన్నారులకు చుక్కల మందు వేయడం జరిగింది. జిల్లాలోని 98,666 మంది చిన్నారులకు వేయాల్సి ఉండగా, 98,678 మందికి పోలియో చుక్కల మందు వేసి వందశాతం లక్ష్యాన్ని దాటారు. మొత్తం 2,78,872 ఇళ్లను లక్ష్యంగా చేసుకొని పల్స్‌పోలియో చుక్కలు వేయగలిగారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ భాస్కర్‌ నాయక్‌ జిల్లాలో విస్తృతంగా పర్యటించి పల్స్‌పోలియో లక్ష్యాన్ని సాధించారు. ఐసీడీఎస్‌, హెల్త్‌, విద్యాశాఖ, ఇతర శాఖల ఆధ్వర్యంలో పల్స్‌పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు, డిప్యూటీ డీఎంహెచ్‌వో పోటు వినోద్‌, డాక్టర్‌ నరేష్‌, ఇతర అధికారులు పోలియో చుక్కల కేంద్రాలను సందర్శించి చుక్కల మందు వేసే తీరును పరిశీలించారు.

ప్రతి ఇంటినీ సర్వే చేసి..

ముందుగానే సర్వే చేసిన వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యానికి మించి చుక్కలు వేసింది. ప్రతీ ఇంటిని సర్వే చేసి ఏ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నారో తెలుసుకొని ఆశాలు మూడ్రోజుల పాటు మార్కింగ్‌ పద్ధతి ద్వారా ఇళ్లను సందర్శించారు. గృహాల్లో లేని వారి అడ్రస్‌లు తెలుసుకొని పనులు చేసే ప్రాంతాలకు వెళ్లి మరీ పోలియో చుక్కలను వేశారు. మరికొన్ని ప్రాంతాల్లో పంట పొలాల్లో తల్లులతో ఉన్న పిల్లలను కూడా గుర్తించి పోలియో చుక్కలు వేశారు. కొత్తగూడెం అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాల్లో పోలియో చుక్కలు వేశారు.