శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Jan 21, 2020 , 23:17:25

భద్రాద్రి రామయ్యకు నిత్యకల్యాణం

భద్రాద్రి రామయ్యకు నిత్యకల్యాణంభద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున అర్చకులు గోదావరి నది నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేశారు. ఆరాదన, అర్చన, సేవాకాలం, నివేదన తదితర పూజలు గావించారు. వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చిన భక్తులు రామాలయానికి చేరుకొని రామున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అర్చకులు ఆలయంలోని బేడా మండపంలో రామునికి ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నేడు రామాలయంలో విశ్వరూప సేవ

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం స్వామివారికి విశ్వరూపసేవ (సర్వదేవతా అలంకారం) నిర్వహించనున్నారు. ఈ వేడుకలో భాగంగా భద్రాద్రి రామాలయంలో ఉన్న అన్ని రకాల ఉత్సవ విగ్రహాలను ఒక చోట అలంకరించి ఏకారాధన చేస్తారు. ఇది వైకుంఠ ఏకాదశి వైభవాన్ని తలపించేలా అర్చకులు ఈ ఉత్సవాన్ని జరుపుతారు. వైకుంఠ ఏకాదశి (ముక్కోటి) ఈనెల 6న జరగగా, ఈ వేడుక జరిగిన 16వ రోజు ద్వాదశి నాడు అంటే(జనవరి22)న బుధవారం భద్రాద్రి రాముని సన్నిధిలో విశ్వరూప సేవ నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధికారులు, అర్చకులు పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి తరువాత వచ్చే బహుళ ద్వాదశి ఘడియల్లో ఉత్సవ మూర్తులన్నింటిని ఒకే చోట చేర్చి ఆరాధన నిర్వహించడం భద్రాద్రి దేవస్థానంలో ఒక ప్రత్యేకత. ఈ క్రమంలో దేవస్థానం అధికారులు ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రామాలయంలోని నిత్యకల్యాణ మండపం వేదిక వద్ద ఈ వేడుక నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.