శుక్రవారం 05 జూన్ 2020
Badradri-kothagudem - Jan 21, 2020 , 00:42:36

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం
  • - విజన్‌ ఉన్న నాయకులు సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌
  • - పింఛన్‌ను రూ.2 వేలకు పెంచిన ఘనత టీఆర్‌ఎస్‌దే
  • - తండాలను గ్రామ పంచాయతీలు, పట్టణాలను మున్సిపాలిటీలుగా చేశాం..
  • - ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి బాధ్యత నేనే తీసుకుంటా..
  • - ఎన్నికల ప్రచారం, విలేకరుల సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
  • -అన్ని ఎన్నికల్లో కారు జోరు బలంగా ఉంది
  • - ఖమ్మం ఎంపీ నామా, ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని తెలంగాణ రాష్ట్రం టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలోకి రాగానే అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. సోమవారం మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం చివరిరోజు కొత్తగూడెం మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను అమలుచేయడం లేదన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, వృద్ధాప్య, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు అందజేస్తూ పేదల పాలిట పెద్ద దిక్కుగా సీఎం కేసీఆర్‌ మారారన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో సుమారు రూ.వంద కోట్లతో సైడ్‌ డ్రైనేజీ, అంతర్గత రోడ్ల నిర్మాణం, పైపులైన్‌లు తదితర పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. మరో నాలుగేళ్లపాటు అధికారంలో ఉండే టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే కొత్తగూడెం మున్సిపాలిటీని మరింత వేగంగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు.

కొత్తగూడెం మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. విజన్‌ ఉన్న నాయకులు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ అని, వారి సారథ్యంలో రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్ధుకుంటుందని పేర్కొన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు సీతారామ ప్రాజెక్టు, నిరంతరం కరెంటు అందించేంకు జిల్లాలో బీటీపీఎస్‌ను నిర్మిస్తున్నారన్నారు.రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ పట్టణాలను స్వచ్ఛతకు మా రుపేరులా మార్చేందుకు ప్రణాళికా బద్ద్ధంగా ముం దుకు సాగుతున్నారని తెలిపారు. అనేక అభివృద్ధి నిధులను మంజూరు చేసి పట్టణాలను శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఉద్యమ నాయకుడైన సీఎం కేసీఆర్‌కు తెలంగాణలో అణువణువు తెలుసని, ఏ విధంగా ముందుకెళ్తే తెలంగాణ అభివృద్ధి అవుతుందో ప్రణాళికలు వేసి అం దుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ ఎమ్మె ల్యే వనమా వెంకటేశ్వరరావుదేనని, బలమైన నాయకత్వం ఉన్న కొత్తగూడెం పురపాలికపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగురడం ఖా యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ఏడాదికి పింఛన్లు అందించేందుకు రూ.9,230 కోట్లు ఖర్చు చేస్తుందని, దేశంలో ఎక్కడా సంక్షేమ రంగానికి ఇన్ని నిధులు ఖర్చు చేస్తున్న రాష్ట్రం లేదన్నారు.

గతంలో పరిస్థితి వేరని, ఇప్పుడు జిల్లాలో జరిగిన ప్రతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తూ వచ్చిందని, ఈఎన్నికల్లో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కారు గుర్తుకు ఓటేసి ఐదు మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ పార్టీకి కట్టబెట్టాలన్నారు. ప్రతీ పట్టణంలో కొత్తగా డ్రైన్‌లు, రోడ్లు, మినీ ట్యాంక్‌బండ్ల నిర్మాణం చేపడుతోందని, తాగునీటి వసతి, కరెంటు అందిస్తున్నారన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించడంలో ఎమ్మెల్యే వనమా ముందున్నారని, రాబోయే రోజుల్లో మరింత మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించేందుకు జీవో కూడా తీసుకొచ్చారన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందుతో పాటు ఖమ్మం జిల్లాలో ఉన్న మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కారు జోరు కొనసాగుతోందని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా అదే జోరును కొనసాగించి సీఎం కేసీఆర్‌కు ఐదు మున్సిపాలిటీలను కానుకగా ఇవ్వాలన్నారు. ఎన్నికలొచ్చినప్పుడు కూటమిగా మారే రాజకీయ పార్టీలు అనంతరం విచ్ఛిన్నమవుతాయన్నారు. స్వార్థం కోసం కూటమిగా ఏర్పడి పోటీ చేసే పార్టీలకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఎజెండా, సిద్ధాంతం లేని పార్టీలను ప్రజలు ఎప్పుడూ తిరస్కరిస్తారన్నారు. తెలంగాణలో మరో నాలుగేళ్లపాటు సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ సారథ్యంలో అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని, అందుకు ఓటు ద్వారా మద్దతు తెలపాలన్నారు. ఐదు పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కారు గుర్తుకు ఓటేసి 36 వార్డుల్లో ఉన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే మరిన్ని నిధులు తీసుకొచ్చే వీలుంటుందన్నారు. ప్రచారంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు వనమా రాఘవేందర్‌రావు, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్‌ ఎంపీపీలు భూక్యా సోనా, బాదావత్‌ శాంతి, బానోత్‌ విజయలక్ష్మి, సుజాతనగర్‌ జడ్పీటీసీ బిందుచౌహాన్‌, నాయకులు బీ నాగేశ్వరరావు, వనమా రామకృష్ణ, కొల్లు పద్మ, పరంజ్యోతి, మసూద్‌, సుందర్‌, సత్యనారాయణసింగ్‌, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి : ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు

‘కొత్తగూడెం మున్సిపాలిటీలో కారు జోరుగా  దూసుకుపోతోంది. మొత్తం 36 వార్డులు గెలుచుకునే దిశగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు’ అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. టీఆర్‌ఎస్‌ హయాంలోనే మున్సిపాలిటీలో అన్ని రకాలుగా అభివృద్ధి సాధించిందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.45వేల కోట్లతో సీతారామ ఎత్తిపోతల పథకం, దుమ్ముగూడెం, మిషన్‌ భగీరథ వంటి అనేక శాశ్వత పనులకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారన్నారు. గతంలో కరెంటెప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదని, నేడు నిరంతరంగా రైతులతో పాటు పరిశ్రమలకు, గృహావసరాలకు విద్యుత్‌ అందిస్తున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని అన్నారు. దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి గురించే చర్చించుకుంటున్నారని, ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధే ఎజెండాగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం సరైన నిధులు విడుదల చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వమే నిధులను సమకూర్చుకొని కాళేశ్వరం, సీతారామ, దుమ్ముగూడెం బజార్‌ తదితర బృహత్తర ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిందన్నారు. రానున్న రోజుల్లో కోటి ఎకరాల తెలంగాణ మాగాణం సస్యశ్యామలం కానుందన్నారు. జిల్లాలోని మణుగూరు పట్టణంలో బీటీపీఎస్‌  నిర్మాణం పూర్తి అవుతుందని, రానున్న రోజుల్లో ఇది రాష్ర్టానికే తలమానికం కానుందన్నారు.

కేసీఆర్‌ దూరదృష్టి ఉన్న నాయకుడు : ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు

తెలంగాణ రాష్ర్టాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్‌ దూరదృష్టి ఉన్న నాయకుడని, ఆయన నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అనన్నారు.  ఇటీవల కాలంలో సుమారు రూ.వంద కోట్లతో కొత్తగూడెం మున్సిపాలిటీలో సైడ్‌ డ్రైన్‌లు, అంతర్గత రహదారులు, సెంట్రల్‌ లైటింగ్‌, నాలుగు లైన్ల రహదారుల పనులు చేపట్టారని, రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి మున్సిపాలిటీని సుందర మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. ‘ఎన్నికలు కొత్త కాదని, నేను గతం నుంచి చేస్తున్న అభివృద్ధే ఈ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుంది’ అని అన్నారు. 36వార్డులకు సంబంధించి అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేశానని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి అన్ని వార్డులను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ద్వారా ఇంటింటికీ తాగు, సాగునీరు అందిస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే మున్సిపాలిటీ అన్ని రకాలుగా అభివృద్ధి సాధించి మోడల్‌ మున్సిపాలిటీ రూపుదిద్ద్ధుకోనుందన్నారు. గతంలోనే వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించానని, రానున్న రోజుల్లో అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.logo