బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jan 21, 2020 , 00:40:21

మరో ఐదు రోజులు ధాన్యం కొనుగోళ్లు

మరో ఐదు రోజులు ధాన్యం కొనుగోళ్లు
  • - జిల్లావ్యాప్తంగా 114 సేకరణ కేంద్రాలు
  • - వందశాతం లక్ష్యం సాధించే దిశగా అడుగులు
  • - గ్రేడ్‌- ఏ రకం ధాన్యానికి క్వింటాకు రూ.1,835 ధర

అశ్వారావుపేట, నమస్తే తెలంగాణ: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరాయి. ఈ ఏడాది వానాకాలంలో 1లక్ష నుంచి 1.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు జిల్లా పౌర సరఫరాలశాఖ అంచనాగా నిర్దేశించుకుంది. ఇప్పటి వరకు 1.15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అధికారులు సేకరించారు. ధాన్యం సేకరణకు 23 మండలాల్లో 114 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐకేపీ, జీసీసీ, సహకార సంఘాల ద్వారా రైతుల నుంచి ప్రభుత్వం నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తుంది. అంచనాకు మించి వరి పంట సాగవటంతో ధాన్యం సేకరణ అంచనా పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. భూగర్భ జలాలతో పాటు పుష్కలంగా వర్షాలు కురవటంతో సాగునీరు అందుబాటులో ఉండటంతో వరి సాగుపై రైతులు ఎక్కువ ఆసక్తి చూపారు. 25వ తేదీతో ధాన్యం సేకరణ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.

రైతులు పండించిన ధాన్యం విక్రయాల్లో దళారీ వ్యవస్థను నియంత్రిస్తూ నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రైతుల నుంచి నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ధాన్యం సేకరణ బాధ్యతలను సెర్ప్‌, జీసీసీ, సహకార సంఘాలకు అప్పగించింది. ఈ ఏడాది వానాకాలంలో పండిన ధాన్యం కొనుగోలుకు జిల్లావ్యాప్తంగా 23 జిల్లాల్లో 114 సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిని సహకార సంఘాలకు 77, జీసీసీకి 15, సెర్ప్‌ (మహిళా సమాఖ్యలకు) 22 కేంద్రాలను కేటాయించింది. ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లా నుంచి 1లక్ష నుంచి 1.50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని జిల్లా పౌర సరఫరాలశాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. జిల్లాలో సాధారణ వరి సాగు విస్తీర్ణం అంచనా 43,334 హెక్టార్లు కాగా, సుమారు 52,083 హెక్టార్ల పెరిగింది. దీని ద్వారా అంచనాకు మించి వరి సాగు అయింది. పెరిగిన సాగు విస్తీర్ణానికి అనుగుణంగా 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు 1.15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యంను కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. ఈ లెక్కన రైతుల వద్ద ఇంకా 35 నుంచి 80 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లను ఈ నెల 25వ తేదీ నాటికి నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. రైతుల వద్ద ఇంకా ధాన్యం నిల్వలు ఉండటంతో గడువును మరో 2 రోజులు పెంచే అవకాశాలు కూడా ఉన్నట్లు అధికారుల సమాచారం.

మద్దతు ధర కోసం సేకరణ కేంద్రాలు..

దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను రైతుకే అందించాలన్న ప్రధాన ఉద్దేశంతో పౌర సరఫరాల శాఖ జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కొనుగోలు కేంద్రానికి రైతులు తరలించిన ధాన్యంను విక్రయించిన తర్వాత నగదు చెల్లింపునకు అధికారులు పక్కా ధ్రువీకరణ పత్రాలు సేకరిస్తున్నారు. రైతు ఆధార్‌, గ్రామ రెవెన్యూ అధికారి ధ్రువీకరణ పత్రం, భూమి వివరాలు, బ్యాంక్‌ ఖాతా నెంబర్‌ (ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌తో కలిపి), పాసు పుస్తకం నకళ్లను అధికారులు సేకరిస్తున్నారు. అదేవిధంగా బ్యాంక్‌ ఖాతా వినియోగంలో ఉన్నట్లు సంబంధిత అధికారుల చేత ధ్రువీకరించాలి. రైతు మొబైల్‌ నెంబర్‌ లేకుంటే వారి కుటుంబ సభ్యుల నెంబర్‌నైనా తీసుకుంటున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు, నగదు చెల్లింపుల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతు బ్యాంక్‌ ఖాతాలో జమ చేసేలా ఆన్‌లైన్‌ విధానాన్ని తీసుకొచ్చి దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. 

ధాన్యం సేకరణలో గరిష్ట శాతం..

ధాన్యం విక్రయంలో ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర పొందటానికి రైతులు తేమశాతం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే అవగాహన కల్పించింది. 16శాతం తేమ, తాలు, చెత్త 1 శాతం, మట్టిబెడ్డలు, రాళ్లు 1శాతం, చెడిపోయిన, రంగు మారిన, మొలకెత్తిన, పురుగు తిన్న ధాన్యం 5 శాతం, పూర్తిగా తయారు కాని, ముడుచుకుపోయిన ధాన్యం 3 శాతం, తక్కువ రకం మిశ్రమం 6 శాతం మించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలా గ్రేడ్‌ ‘ఏ’ రకం ధాన్యానికి మద్దతు ధర రూ.1,835 చొప్పున చెల్లిస్తుంది. అక్టోబర్‌ రెండోవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 25న ముగియనున్నాయి.

25 నాటికి కొనుగోళ్లు పూర్తి..

ధాన్యం కొనుగోళ్లను 25వ తేదీ నాటికి పూర్తి చేయనున్నాము. రైతుల వద్ద ఇంకా ధాన్యం నిల్వలు ఉంటే మరో రెండు రోజుల పాటు గడువును పొడిగిస్తాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 27 నాటికి కొనుగోళ్లను పూర్తి చేస్తాము. జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 1 నుంచి 1.50 లక్షల మెట్రిక్‌ టన్నులకు నిర్దేశించుకున్నాము. ఇప్పటి వరకు 1.15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించాము. 
-ప్రసాద్‌, డీఎం, జిల్లా పౌర సరఫరాల శాఖ, కొత్తగూడెం