గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Jan 20, 2020 , 01:36:03

టీఆర్‌ఎస్‌దే విజయం

 టీఆర్‌ఎస్‌దే విజయం
  • - రోడ్‌షోలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్‌
  • - బొగ్గుట్టకు రూ.120 కోట్ల ప్రభుత్వ నిధులు: మంత్రి సత్యవతి
  • - రెండు మున్సిపాలిటీల్లో తిరుగులేని గెలుపు: ఖమ్మం ఎంపీ నామా
  • - రైల్వే సర్వీసుల పునరుద్ధరణకు కృషి: మానుకోట ఎంపీ కవిత
  • - సంక్షేమానికి పెద్దపీట: మాజీ ఎంపీ పొంగులేటి
  • - పాల్గొన్న ఎమ్మెల్యే హరిప్రియ, జడ్పీ చైర్మన్‌ కోరం, ఎమ్మెల్సీ బాలసాని
  • - కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా విస్తృత పర్యటన

‘మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం.. ఇల్లెందు పీఠంపై గులాబీ జెండా ఎగురవేస్తాం.. బొగ్గుట్ట అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. రైల్వే సర్వీసు పునరుద్ధరణకు కృషి చేస్తాం.. బస్‌ డిపో కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నాం.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆశీర్వదించి  గెలిపించండి.. అభివృద్ధికి అవకాశం ఇవ్వండి..’అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ కోరారు.. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా శనివారం ఇల్లెందులో నిర్వహించిన రోడ్‌షోలో వారు మాట్లాడారు.. టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే అభివృద్ధికి ఓటు వేసినట్లేనన్నారు.. అనంతరం ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మున్సిపాలిటీల అభివృద్ధికి రెట్టింపు నిధులు తెచ్చేలా కృషి చేస్తామన్నారు.. మానుకోట ఎంపీ కవిత మాట్లాడుతూ.. కేంద్రం నుంచి వచ్చే  నిధులను ఇల్లెందు అభివృద్ధికి కేటాయిస్తామన్నారు.. రోడ్‌షోలో ఎమ్మెల్యే  హరిప్రియానాయక్‌, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.. కొత్తగూడెం  జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు  విస్తృతంగా పర్యటించి టీఆర్‌ఎస్‌ పార్టీ  అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు..
-ఇల్లెందు/కొత్తగూడెం, నమస్తే తెలంగాణ 

ఇల్లెందు నమస్తే తెలంగాణ:ఇల్లెందు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేసి అభివృద్ధి చేసుకుందామని రాష్ట్ర రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఆదివారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని ఆ యా వార్డులలో రోడ్‌షో నిర్వహిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్ని రంగాలలో తెలంగాణ రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. గతంలో ఇల్లెందు అభివృద్దికి ఆమడ దూరంలో ఉండేదన్నారు. గత రెండేళ్లలో ఇల్లెందు పట్టణంలో ఊహించని అభివృద్ధి జరిగిందన్నారు. ఇల్లెందు పట్టణాభివృద్ధికి ఉమ్మడి జిల్లా  మంత్రిగా తనవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియనాయక్‌ పలుమార్లు ఇల్లెందు కు బస్‌డిపో కావాలని చెప్పారన్నారు. కచ్చితంగా హామీ ఇస్తున్నానని, ఇల్లెందుకు డిపో త్వరలోనే వస్తుందన్నారు. అభివృద్ధి కట్టుబడి ఉన్నామని,రాబోయే రోజులలో ఇల్లెందుకు భారీగా నిధులు తీసుకొచ్చే బాధ్యత తనదేనన్నారు. టీఆర్‌ఎస్‌ తరుఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.ఇల్లెందు మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగురవేయాలన్నారు.

మరింత అభివృద్ధి చేస్తాం:మంత్రి సత్యవతి

ఇల్లెందు మున్సిపాలిటీలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కంటే రెట్టింపు అభివృద్ధి జరిగేలా కృషి చేస్తామని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాధోడ్‌ అన్నారు. గడిచిన రెండేళ్ల లో ఇల్లెందు మున్సిపాలిటీకి రూ. 120 కోట్లు నిధు లు వచ్చాయన్నారు. రానున్న ఏడాదిలో అంతకు రెట్టింపు నిధులు తీసుకొచ్చి ఇల్లెందుకు కావాల్సిన సౌకర్యాలన్ని కల్పిస్తామన్నారు. ఇల్లెందు అంటే ఒక చరిత్రకు చిరునామా అన్నారు. సింగరేణికి పుట్టినిల్లయిన ఇల్లెందు అభివృద్దికి నోచుకోకపోవడం పరాయి పాలకులేనన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టిసారించి వివిధ గ్రాంట్ల ద్వారా నిధులు మంజూరు చేశారన్నారు. ఇల్లెందులో ప్రభుత్వ రంగ ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలలు లేకపోవడం బాధాకరమన్నారు. కచ్చితంగా వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ రంగ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. 22న జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరుఫున పోటీ చేస్తున్న అభ్యర్దులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కారు గుర్తుకు ఓటేసి ఇల్లెందు మున్సిపాలిటీ పై గులాబీ జెండాను ఎగురవేయాలన్నారు.

 రైలు సర్వీసు పునరుద్ధరణకు కృషి:మానుకోట ఎంపీ కవిత

ఇల్లెందుకు రైలు సర్వీసును పునరుద్ధరించేందుకు కృషి చేస్తానని మహబూబాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు మాలోత్‌ కవిత అన్నారు. రైల్వే శాఖమంత్రితో పలుమార్లు ఇల్లెందు రైలు సర్వీసుల పునరుద్ధరణ విషయంపై చర్చించామన్నారు. రైల్వే శాఖకు బొగ్గు ద్వారా భారీ ఆదాయమున్నప్పటికి రైల్వే సర్వీసును పునరుద్ధరించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి వివరించినా పట్టించుకోవడం లేదన్నారు. అయినప్పటికికీ కేంద్రం పై పోరాటం ఆగదని, కచ్చితంగా రైల్వేసర్వీసు పునరుద్ధరణ జరిగే వరకు పోరాడుతా మన్నారు. ఇల్లెందు నియోజకవర్గ అభివృద్దికి కట్టుబడి ఉన్నానన్నారు. ప్రత్యేకించి ఇల్లెందు పట్టణాభివృద్ధికి తనవంతు సహాయ, సహకారాలు అందిస్తానన్నారు.

టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం:ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరావు

ఇల్లెందు మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమైందని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నాయకుడు, ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామ నాగేశ్వ రావు అన్నారు. ఇల్లెందులో 24 వార్డులలో గులాబీ జెండా ఎగురడం అనివార్యమన్నా రు. ఎక్కడ చూసినా.. సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ధి గురిం చే చర్చించుకుంటున్నారన్నారు. రెండేళ్లలో ఇల్లెందు రూపురేఖలు మారిపోతాయన్నారు. కారు గుర్తు పై పోటీ చేస్తున్న అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

సంక్షేమానికి పెద్దపీట:పొంగులేటి శ్రీనివాసరెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో మరెక్కడా అమలుకాని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నా యన్నారు.  రాష్ట్రం సుభిక్షంగా ఉందంటే అది కేసీఆర్‌ వలనేనన్నారు. టీఆర్‌ఎస్‌ తరుఫున  పోటీ చేస్తున్న 24 మంది అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. సీఎం కేసీఆర్‌కు ఇల్లెందు మున్సిపాలిటీని బహుమానంగా ఇవ్వాలన్నారు.

అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌దే:ఎమ్మెల్సీ బాలసాని

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందంటే ఆ ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తెలిపారు. ఇల్లెందు నియోజకవర్గం ఇంత లా అభివృద్ధి జరిగిందంటే అది టీఆర్‌ఎస్‌ హయాంలోనేనన్నారు. ఒకప్పుడు ఇల్లెందు నియోజకవర్గంలో కనీస రహదారులు లేక ఇబ్బందులు పడే వారన్నారు. గుండాల నుండి ఇల్లెందుకు రావాలంటే సుమారు ఐదారు గంటల సమ యం పట్టేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ సమస్య సమసిపోయిందన్నారు. ఇల్లెందు నుండి గుండాలకు బెంజీకారు వెళ్లేలా సీఎం కేసీఆర్‌ రహదారులను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.

భారీ మెజార్టీతో గెలిపించండి:జడ్పీ చైర్మన్‌ కోరం

ఇల్లెందు మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న 24 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్దులను భారీ మెజార్టీతో గెలిపించాలని భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య అన్నారు. గత పర్యాయంలో ఇల్లెందు మున్సిపాలిటీకి నిధులు భారీగా మంజూ రయ్యాయన్నారు. సీఎం కేసీఆర్‌ అడుగగానే కావాల్సిన నిధులు మంజూరు చేశారన్నారు. కేసీఆర్‌ పుణ్యమే రోజువిడిచి రోజు మంచినీటి సరఫరా జరుగుతుందన్నారు. సెంట్రల్‌ లైటింగ్‌, మోడల్‌ మార్కెట్‌, మినీట్యాంక్‌బండ్‌, మినీ స్టేడియం వంటిపనులు జరుగుతున్నాయంటే కేసీఆర్‌ చలవేనన్నారు. ఇల్లెందు పట్టణ ప్రజలంతా జరుగుతున్న అభివృద్దిని గమనించాలన్నారు. సీఎం కేసీఆర్‌ రుణం తీర్చుకోవాలంటే కారు గుర్తుకు ఓటేయాలన్నారు. 24 వార్డులలో పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

ఆశీర్వదించండి..అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే హరిప్రియ

ఇల్లెందు మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని, మున్ముందు మరింత అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియనాయక్‌ పేర్కొన్నారు. మీ ఆశీస్సులు, ఆశీర్వాదంతో ఇల్లెందు మున్సిపాలిటీ మరింత అభివృద్ధి జరుగాలంటే టీఆర్‌ ఎస్‌ పార్టీ తరుఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలన్నారు. వేసవి వచ్చిందంటే నీటి ఎద్దడితో ఇల్లెందు పట్టణ ప్రజలు అల్లాడిపో యేవారన్నారు. ఇప్పడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ప్రతీ రోజు మంచినీటి సరఫరా చేస్తున్నామన్నారు. ఇదంతా మిషన్‌ భగీరధ ద్వారా నే సాధ్యమవుతుందని గుర్తు చేశారు.  గోదావరి జలాలు ఇంటిముందుకు వస్తున్నాయంటే కేసీఆర్‌తోటే సాధ్యమైందన్నారు. ఇల్లెందు పట్టణా భివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. గెలిపించి సీఎం కేసీఆర్‌కు బహుమ తిగా ఇస్తే మనకు అడిగనన్ని నిధులు కేటాయి స్తారన్నారు. మన అభివృద్ది మన చేతుల్లోనే ఉందని , అందుకు మనమంతా టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపిం చాలన్నారు. 24 వార్డులలో పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే ఇల్లెందు పట్టణం మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. అధికారపార్టీని గెలిపి స్తే అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయం మనకందరికి తెలుసన్నారు. అందుకే మనమంతా కారు గుర్తుకు ఓటేసి మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగురవేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎన్నికల ఇన్‌చార్జ్‌ తాతా మధు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్‌ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌ పాల్గొన్నారు.