బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jan 20, 2020 , 01:34:21

విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు

విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలుభద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్‌
చిరుమళ్ల ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ
ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం,
విధుల నుంచి తొలగింపు
‘మెనూ’ పాటించని
హాస్టల్‌ వార్డెన్‌కు షోకాజ్‌ నోటీసు..

కరకగూడెం: మండలంలోని చిరుమళ్ల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్‌ ఆదివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొత్తం ఐదుగురు విద్యార్థులు మాత్రమే ఉండటంతో హెచ్‌ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రధానోపాధ్యాయుడు జగన్‌ను విధుల నుంచి తొలిగించారు. సెలవులు పూర్తయి మూడు రోజులు గడుస్తున్నా విద్యార్థులు పాఠశాలకు రాకపోవడంపై గల కారణాలను విచారించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. మెనూలో నిర్లక్ష్యం వహిస్తున్న వసతిగృహ వార్డెన్‌ కోటయ్యకు షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. సుమారు 10 మంచాలు అదనంగా ఉండటాన్ని గమనించిన పీవో వెంటనే వాటిని భద్రాచలం కార్యాలయానికి తరలించాలని ఆదేశించారు. విధుల పట్ల అలసత్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రస్తుతం పాఠశాల ఇన్‌చార్జ్‌ ప్రధానోపాధ్యాయుడు ఇంగిష్ల్‌ సబ్జెక్ట్‌ పాఠశాల స్కూల్‌ అసిస్టెంట్‌ రవికి బాధ్యతలు అప్పగించారు.