శనివారం 05 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Jan 20, 2020 , 01:32:47

ఇంటింటికీ టీఆర్‌ఎస్‌ శ్రేణులు

ఇంటింటికీ టీఆర్‌ఎస్‌ శ్రేణులు
కొత్తగూడెం  నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర పడనుండటంతో జిల్లాలో  బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో జోష్‌ పెంచారు. కొత్తగూడెం, ఇల్లెందు పురపాలికల  ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. ప్రచారానికి చివరి రోజు కావడంతో పాటు, మరి కొన్ని  గంటలు మాత్రమే సమయం ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపునకు దూకుడుగా పెంచారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు వార్డులను చుట్టివస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు గులాబీ దళం తొలి నుంచీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన  నాటి నుంచి గెలుపు గుర్రాలకే బీ ఫారాలు అందించి రెండు మున్సిపాలిటీలు లక్ష్యంగా ముందుకు సాగుతోంది. రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, బానోత్‌ హరిప్రియానాయక్‌, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి, ఎన్నికల ఇన్‌చార్జి తాతా మధు, ఖమ్మం కార్పొరేటర్లు కొన్ని రోజులుగా మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల్లో తిరుగుతూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఇల్లెందులో ఆదివారం మంత్రులు పువ్వాడ అజయ్‌ కుమార్‌, సత్యవతి రాథోడ్‌, ఎంపీలు మాలోత్‌ కవిత, నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీచైర్మన్‌ కోరం కనకయ్య, ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌ ప్రచారంలో పాల్గొన్నారు. చివరి రోజు కొత్తగూడెం మున్సిపాలిటీలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రచాంలో పాల్గొననున్నారు.

ఇంటింటి ప్రచారంలో టీఆర్‌ఎస్‌

ప్రచారానికి  నేటితో  తెర పడనుండటంతో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్టీకి సంబంధించి స్టార్‌ క్యాంపెయినర్‌ అయిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రతి రోజు జిల్లాలోని రెండు మున్సిపాలిటీలపై సమీక్షిస్తూ స్వయంగా వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ప్రచారానికి ఏ ఒక్క నాయకుడు రాకపోవడంతో అభ్యర్థులు ఏమి చేయాలో తలలు పట్టుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడప గడపకూ తీసుకెళ్లి తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. మరో నాలుగేళ్లపాటు అధికారంలో ఉండే టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేసి మున్సిపల్‌ పీఠంపై గులాబీ జెండాను ఎగురవేయాలని కోరుతున్నారు.

టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం

మున్సిపల్‌ ఎన్నికల్లో రెండు మున్సిపాలిటీలు టీఆర్‌ఎస్‌ ఖాతాలోకి రానున్నాయి.  ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నుంచే వార్డులను చుట్టివస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియానాయక్‌ మున్సిపాలిటీ పీఠాలపై గులాబీ జెండాలను ఎగురవేసేందుకు పావులు కదుపుతున్నారు. ఆదివారం  ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డు ల్లో రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌,  ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్‌ కవిత, కొత్తగూడెం మున్సిపాలిటీలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు.

నేటితో  ప్రచారం పూర్తి..

సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో జిల్లాలోని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు  పోటీచేసేందకు అభ్యర్థులు లేకపోవడంతో వారికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. అన్ని వార్డుల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయడం ఖాయమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.  టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఉత్సాహంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని కోరుతున్నారు. నేటితో  ప్రచారం ముగియనుండటం తో  ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు.  అభ్యర్థులలు ఓటర్లను కలుస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

పోలింగ్‌ ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు

ఈ నెల 22వ తేదీన నిర్వహించే పోలింగ్‌కు అవసరమైన సిబ్బందిని ఇప్పటికే నియమించారు. వారు పోలింగ్‌ నిర్వహణలో చేయాల్సిన విధులపై అవగాహన కల్పించారు. కొత్తగూడెంలో  59,556 ఓటర్లకు 36వార్డుల్లో  85పోలిం గ్‌ బూత్‌లు, ఇల్లెందు మున్సిపాలిటీలో 31,759మంది ఓటర్లకు 24వార్డులకు 48పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. అవసరమైన సామగ్రిని ఇప్పటికే అధికారులకు ఇచ్చేందుకు సిద్ధం చేశారు. ఈ నెల 21న సాయంత్రం పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి సామగ్రి అప్పగించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు తెలిపారు. ఎన్నికల విధులు అప్పగించిన సిబ్బంది ఖచ్చితంగా హాజరుకావాలని, ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండదని ఇప్పటికే కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.