శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Jan 18, 2020 , 04:41:50

ఖమ్మం మార్కెట్‌ యార్డు కిటకిట..

ఖమ్మం మార్కెట్‌ యార్డు కిటకిట..వరుస సెలవుల తర్వాత
యార్డుకు పోటెత్తిన మిర్చి
ఒకే రోజు 25 వేల బస్తాల రాక
జెండా పాటలో
ఒక క్వింటా ధర రూ.20,650

ఖమ్మం వ్యవసాయం, జనవరి 17 : నగర వ్యవసాయ మార్కెట్‌ మిర్చియార్డు ఒక్కసారిగా ఎర్రబారింది. మూడు రోజుల వరుస సెలవుల తరువాత తెరుచుకున్న మార్కెట్‌ యార్డు మిర్చిబస్తాలతో కిటకిటలాడింది. దీంతో మార్కెట్‌ కమిటీ అధికారులు అప్రమత్తం అయ్యారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఈ నెల 14,15,16 తేదీల్లో మార్కెట్‌ కమిటీ వ్యాపారులు, కార్మికుల విజ్ఞప్తి మేరకు క్రయవిక్రయాలకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం ఉదయం అరుగంటల వరకే మార్కెట్‌యార్డు మిర్చి బస్తాలతో కిక్కిరిసింది. అదే విధంగా పత్తియార్డుకు సైతం బస్తాలు భారీగానే వచ్చాయి. గురువారం రాత్రి నుంచే రైతులు పంటను తీసుకురావడం మొదలుపెట్టారు. అప్రమత్తమైన సిబ్బంది రైతులు మార్కెట్‌ వెలుపల దిగుమతి చేసుకోకుండా కేవలం యార్డులోనే దిగుమతి చేసుకునే విధంగా చూశారు. ఒకే రోజు వివిధ జిల్లాల నుంచి దాదాపు 25వేల పైబడి బస్తాలను రైతులు తీసుకొచ్చారు. అదే విధంగా పత్తియార్డుకు సైతం మరో 10వేల బస్తాలు వచ్చాయి. ఉదయం జరిగిన జెండాపాటలో మిర్చి క్వింటా గరిష్ఠ ధర రూ.20,650 ధర పలికింది. మధ్య ధర రూ.18,800 కాగా, కనిష్ఠ ధర రూ.9వేల చొప్పున ధర నిర్ణయించి పంటను ఖరీదు చేశారు. అదే విధంగా తాలు రకం పంట గరిష్ఠ ధర రూ.9వేలు కాగా మధ్యధర రూ.5,800, కనిష్ఠ ధర రూ.4వేల చొప్పున పలికింది. పత్తి పంటకు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో గరిష్ఠ ధర క్వింటాకు రూ.5,060 పలికింది. మూడు రోజుల సెలవుల అనంతరం పంట భారీగా వస్తుందని ముందే గమనించిన మార్కెట్‌ కమిటీ సెక్రటరీ ఆర్‌ సంతోష్‌కుమార్‌ మందస్తు చర్యలు చేపట్టారు. రాత్రి నుంచే సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో సకాలంలో క్రయవిక్రయాలు పూర్తి కావడానికి మార్గం సుగమమైంది. అదే విధంగా సాయంత్రంలోగా తోలకాల ప్రక్రియ సైతం ముగియడంతో కార్మికులు, వ్యాపారులు సైతం ఉపశమనం పొందారు. రోజురోజుకూ పెరుగుతున్న మిర్చి పంట ఉత్పత్తుల కారణంగా ఘాటు ప్రభావం సైతం పెరుగుతుంది. దీంతో రైతులకు, సమీప కాలనీవాసులకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు గానూ మార్కెట్‌ సమీపంలో ఎప్పటికప్పుడు ట్రాక్టర్లతో వీధుల్లో నీరు చల్లిస్తున్నారు. పంట రద్దీని దృష్టిలో ఉంచుకొని నేడు(శనివారం) సైతం క్రయవిక్రయాలు జరగనున్నాయని మార్కెట్‌ కమిటీ కార్యదర్శి తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.