ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Jan 15, 2020 , 03:13:43

పవిత్రం.. ఉత్తరాయణ ప్రవేశం..

పవిత్రం.. ఉత్తరాయణ ప్రవేశం..

ఖమ్మం కల్చరల్‌/కొత్తగూడెం టౌన్‌: సూర్యుడు మకర సంక్రమణం చేసి లోకానికి సకల సౌభాగ్యాలు ప్రసాదించే మహిమాన్వితమైన రోజే సంక్రాంతి పండుగ. పవిత్ర ఉత్తరాయణంలో సూర్య భగవానుడు ప్రవేశించి తన నూతన దివ్య కాంతిని సమస్త కోటికి ప్రసారం చేయనున్నాడు. లోక బాంధవుడైన సూర్య భగవానుడు పవిత్ర ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్న మహత్తర కాలమే మకర సంక్రమణం.. అదే సంక్రాంతి.. సూర్య భగవానుడిని మకర రాశిలోకి ఆహ్వానిస్తూ వీధుల్లో బారులు తీరిన రథం ముగ్గులు.. తెనుగింట ముంగిళ్లలో సప్తవర్ణాల రంగవల్లులు.. వాటి మధ్యలో గొబ్బెమ్మలు.. హరిదాసు కీర్తనలు.. బసవన్నల నాట్యాలు.. ఆకాశంలో ఎగురుతున్న గాలి పతంగులు.. పల్లెల్లో  ఉట్టి పడుతున్న పాడిపంటల భోగ్యాలు.. వెరసి జిల్లా అంతటా సంక్రాంతి శోభ సంతరించుకుంది. స్వచ్ఛమైన సూర్యుని కాంతే సంక్రాంతి.. సూర్యుని నవ్య కాంతి.. దివ్య క్రాంతి లోకానికి ప్రసారమయ్యే మహత్తర వేళ.. పవిత్ర ఉత్తరాయణ ప్రవేశ శుభ ఘడియలు.. జిల్లావ్యాప్తంగా ప్రజలు బుధవారం సంక్రాంతి పండుగను అత్యంత ఆనందోత్సాహాల నడుమ జరుపుకోనున్నారు. బుధవారం సూర్యుడు మకర రాశిలోకి ఉదయం గ.7.29లకు ప్రవేశించనున్నాడు. దేవతల పగటికాలంగా చెప్పుకునే ఈ ఉత్తరాయణ కాలాన్ని  శుభకార్యాలు, మంచి పనులు, దానధర్మాలు చేపట్టేందుకు ఉత్తమ కాలంగా భావిస్తారు. సంక్రాంతి పండుగ రోజున సూర్య భగవానుడ్ని ఆరాధిస్తే సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. ప్రతి ఇంటిలో సిరులు నింపి సరి కొత్త కాంతులు పంచే ఈపర్వదినాన్ని కుటుంబ సభ్యులు తమ తమ బంధుమిత్రులతో అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. 


చెడును దహించే భోగి.. చిన్నారులకు భోగి పళ్లు.. 

ఇండ్ల ముంగిళ్లల్లో, కూడళ్లలో పాత వస్తువులను కాల్చుతూ వేసిన భోగి మంటలు సూర్యుడు మకర సంక్రమణానికి స్వాగతం పలికాయి.. నులి వెచ్చని భోగి మంటలు చెడును దహిస్తూ, మంచిని స్వీకరించేందుకు శ్రీకారం చుట్టాయి. వాకిళ్లలో గొబ్బెమ్మలతో కూడిన రంగవల్లులు,  సూర్య రథం ముగ్గుతో సంక్రాంతికి సాదరంగా స్వాగతించారు. భోగి మంటలు, చిన్నారులకు భోగిపళ్లు పోయడం, పేరంటాల వాయనాలు, బొమ్మల కొలువులు.. గాలి పటాల సందడితో భోగి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. పవిత్ర ధనుర్మాస మహోత్సవంలో ఆండాళ్‌ తల్లి తిరుప్పావై వ్రతాన్ని ముగించుకోవడంతో మంగళవారం భోగి పండుగ రోజున అన్ని వైష్ణవాలయాల్లో గోదా రంగనాథుల కల్యాణం కమనీయంగా జరిగింది. పలు ఇండ్లల్లో చిన్నారులకు సాయంత్రం భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. శాస్త్రీయంగా, ఆధ్యాత్మికతకు ప్రతీకగా ఉండే రేగిపళ్లను నాణేలు, చెరుకు ముక్కలతో కలిపి చిన్నారులకు శాస్త్రోక్తంగా తలపై నుంచి పోసి, ఆశీర్వదించారు. బొమ్మల కొలువులు, పేరంటాలు నిర్వహించి మహిళలు వాయనాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు.


ఆహా ఏమి రుచి..? ఘుమఘమలు.. 

చకినాలు, కారప్పూస, అరిసెలు, నువ్వుల ఉండలు, బొబ్బట్లు, అప్పాలు, పాయసం,  పరమాన్నం, చక్కెర పొంగలి, బూరెలు తదితర పిండి వంటలు ఘుమఘుమలాడుతున్నాయి.  వీటిని భోగి పర్వదినం నుంచే తయారు చేసుకుని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆరగిస్తారు. ఇండ్లల్లో రాశులుగా కొత్త ధాన్యం.. బంధుమిత్రుల సందడి.. వీటికి తోడు నోరూరించే  రుచికరమైన పిండి వంటలు సంక్రాంతి పండుగ ప్రత్యేకతను చాటుతున్నాయి.. సంక్రాంతి నాడు మహిళలు సాయంత్రం పేరంటాలు నిర్వహించి శనగల వాయనాలను పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటారు. నువ్వులు, బెల్లంతో కూడిన పిండివంటల పదార్థాలను తయారు చేస్తారు. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా ఈ వంటకం శ్రేయస్కరం అని నమ్మకం.


 కమనీయం.. గోదా కల్యాణం..

మూడు రోజుల సంక్రాంతి పండుగలో మూడవది కనుమ. ఇది రైతు ప్రాధాన్యతగా భావిస్తారు. ఈరోజున రైతులు పశుపక్ష్యాదులను పూజిస్తారు. పాడిపంటలను తెచ్చిపెట్టే పశువులకు ఈరోజు ఎటువంటి పని చెప్పకుండా, భక్తి ప్రపత్తులతో పూజిస్తారు. వ్యవసాయ పనిముట్లను శుభ్ర పర్చుకుని పూజలు చేస్తారు. పశువులను అలంకరించి, పసుపు కుంకుమలతో పూజిస్తారు.  ఇళ్లన్నీ మామిడి తోరణాలతో, వాకిళ్లు రంగురంగుల రంగవల్లులతో శోభాయమానమవుతాయి. ముత్తైదువులు కనుమ పండుగ నోమును ఆచరించనున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులతో ఆనందోత్సాహాల నడుమ బుధ, గురువారాలలో సంక్రాంతి, కనుమ పండుగలను నిర్వహించుకోనున్నారు. పవిత్ర ధనుర్మాసోత్సవంలో భాగంగా మంగళవారం భోగి పర్వం నాడు పలు వైష్ణవాలయాల్లో కనుల పండువగా గోదా కల్యాణోత్సవం నిర్వహించారు.