గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Jan 15, 2020 , 03:11:48

లెక్క తేలింది..

లెక్క తేలింది..

మున్సిపల్‌ ఎన్నికల్లో తొలిఘట్టం ముగిసింది.. బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలడంతో ఇక    నేటి నుంచి ప్రచార పర్వం ప్రారంభం కానుంది. జిల్లాలో రెండు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనుండగా, కొత్తగూడెం మున్సిపాలిటీలో అన్ని పార్టీల అభ్యర్థులు 36 వార్డులకు గాను 149 మంది, ఇల్లెందు మున్సిపాలిటీలో అన్ని పార్టీల అభ్యర్థులు 24 వార్డులకు గాను 156 మంది బరిలో నిలిచి తమ అదృష్టాన్ని  పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 8 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై 10వ తేదీ వరకు ముగిసింది.   అప్పటి నుంచి 14 వరకు పరిశీలన, ఉప సంహరణలు తదితర ప్రక్రియలన్నీ పూర్తై  మంగళవారం బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను జిల్లా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇటు సంక్రాంతి పండుగ, అటు ఎన్నికల ప్రచార హడావుడితో కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలు నూతన శోభను  సంతరించుకున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల్లో తొలిఘట్టం ముగిసింది. ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల లెక్క తేలడంతో ఇక నేటి నుంచి ప్రచార పర్వం ఉధృతం కానుంది. జిల్లాలో రెండు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనుండగా కొత్తగూడెం మున్సిపాలిటీలో మొత్తం అన్ని పార్టీల అభ్యర్థులు 36 వార్డులకు గాను 149 మంది, ఇల్లెందు మున్సిపాలిటీలో మొత్తం అన్ని పార్టీల అభ్యర్థులు 24 వార్డులకు గాను 156 మంది బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నెల 8 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై పదవ తేదీ వరకు ముగిసింది. అప్పటి నుంచి 14వ తేదీ వరకు పరిశీలన, స్క్న్రూటీ, ఉపసంహరణలు తదితర ప్రక్రియలన్నీ పూర్తై 14వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను జిల్లా ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో జిల్లాలో సంక్రాంతి సంబురాలతో పాటు ఎన్నికల ప్రచారం కూడా ఊపందుకుంది. ఇటు సంక్రాంతి పండుగ, అటు ఎన్నికల ప్రచార హడావుడితో కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలు నూతన శోభను సంతరించుకున్నాయి. 


ముగిసిన ఉపసంహరణలు..

జిల్లాలో ఉన్న రెండు మున్సిపాలిటీలు కొత్తగూడెం, ఇల్లెందులలో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం 14వ తేదీ మంగళవారంతో ముగిసింది. నామినేషన్లు వేసిన వివిధ పార్టీల అభ్యర్థులు నేడు తమ పార్టీ అధిష్టానం అందించే బీ ఫామ్‌లను అందించారు. వీరికి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియా నాయక్‌లు పార్టీ బీ ఫాంలను అందించారు. సాయంత్రం మూడు గంటల వరకు సమయం ఉండటంతో వివిధ పార్టీల అభ్యర్థులు హడావుడిగా మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకొని వార్డుల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో తమ బీఫామ్‌లను అందించారు. అదే విధంగా ఉపసంహరణ చేసుకునే అభ్యర్థులు కూడా మున్సిపాలిటీకి చేరుకొని తమతమ అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకొని తిరుగుముఖం పట్టారు. మంగళవారం ఉపసంహరణల ఘట్టం ఉండటంతో మున్సిపాలిటీ పరిధిలో భారీగా పోలీసులు మోహరించారు. ఉపసంహరణ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూశారు.  


కొత్తగూడెంలో 149, ఇల్లెందులో 152 మంది

ఉపసంహరణ ఘట్టం పూర్తయ్యే సరికి కొత్తగూడెం మున్సిపాలిటీలో 149 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదే విధంగా ఇల్లెందు మున్సిపాలిటీలో 156 మంది అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి బరిలో ఉండి 25న ఎన్నికల ఫలితాల్లో వీరి అదృష్టం పరీక్షించుకోనున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో 246 మంది నామినేషన్లు వేయగా ఒక నామినేషన్‌ స్క్రూట్నీలో తిరస్కరణకు గురైంది. 18 నామినేషన్లను అభ్యర్థులు రెండుసార్లు దాఖలు చేయడంతో వాటిని ఎన్నికల అధికారులు తిరస్కరించారు. మిగిలిన 227లో మంగళవారం 78 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా, 149 మంది బరిలో నిలిచారు. ఇల్లెందు మున్సిపాలిటీలో 425 నామినేషన్లు దాఖలు కాగా, 270 నామినేషన్లు అర్హత సాధించాయి. వీరిలో 118 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో 156 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 


నేటి నుంచి ఉధృతం కానున్న ప్రచారం..

నేటి నుంచి ఎన్నికల ప్రచారం ఉధృతం కానుంది. మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ పూర్తై బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా ఖరారైంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచార పర్వాన్ని ముమ్మరం చేయనున్నాయి. వార్డుల వారీగా ఏయే పార్టీల అభ్యర్థులు ఎవరెవరు బరిలో ఉన్నట్లు తేలడంతో ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఎన్నికల ప్రచారానికి ఆరు రోజులు మాత్రమే గడువు ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు నేటి నుంచి ప్రచారాన్ని ఉధృతం చేయనున్నాయి. రెండు మున్సిపాలిటీల్లో సంబంధిత ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, బానోత్‌ హరిప్రియా నాయక్‌ ఇప్పటికే వార్డులను చుట్టివస్తూ తమ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. రానున్న రెండు మూడ్రోజుల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.