మంగళవారం 24 నవంబర్ 2020
Badradri-kothagudem - Jan 14, 2020 , 00:36:45

‘పల్స్‌పోలియో’ను విజయవంతం చేయాలి

‘పల్స్‌పోలియో’ను విజయవంతం చేయాలి


కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్‌పోలియో చుక్కలు అందించే విధంగా పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్‌ రజత్‌కుమార్‌షైనీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఈ నెల 19వ తేదీ ఆదివారం నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమంపై సమీక్షించారు. పోలియో దేశంలో లేనప్పటికీ పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ వంటి దేశాల ప్రజల వలసలతో మనదేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. ఇతరులకు సోకకుండా ముందస్తు చర్యల కోసం పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ వివరించారు. రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో వలస ప్రజలపై గంగిరెద్దుల కుటుంబంలోని 10 నెలల చిన్నారికి పోలియో సోకినట్లు, రాష్ట్రంలో చివరి సారిగా 2011లో పోలియో కేసు నమోదైందన్నారు. 2011 నుంచి పోలియో ఫ్రీ కార్యక్రమం చేపట్టారని, ఈ నెల 19వ తేదీన నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమంతో పాటు 20, 21 తేదీల్లో ఆరోగ్య, అంగన్‌వాడీ కార్యకర్తలతో ఇంటింటి సర్వే చేపట్టి చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. పోలియో విస్తరింపజేస్తున్న సంచార జాతులపై ప్రధానంగా దృష్టి పెడుతూ, ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిన వలస ప్రజలు, మురికి వాడలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలను సందర్శించి ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందే విధంగా కృషి చేయాలన్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలు, సంతలు, ప్రధాన కూడళ్లు, మారుమూల ప్రాంతాల్లో తప్పనిసరిగా పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సంబంధిత అధికారులు అంకితభావంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ కర్నాటి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రత్యేక అధికారిణి ఇలా త్రిపాఠి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ భాస్కర్‌ నాయక్‌, వైద్యులు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.