e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home ఖమ్మం పచ్చదనం.. ఆహ్లాదం..

పచ్చదనం.. ఆహ్లాదం..

పచ్చదనం.. ఆహ్లాదం..

ప్రతి మండలంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు
23 మండలాల్లో 221.03 ఎకరాల స్థలం గుర్తింపు
త్వరలో పనులు ప్రారంభం

కొత్తగూడెం/ ఇల్లెందు రూరల్‌, జూలై 15 : కాలుష్యం పెరిగితే మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. అందుకే, కాలుష్యాన్ని తగ్గించి, ఆక్సిజన్‌ను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం మెగా పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. చిట్టడవిని తలపించేలా బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి మండలంలోనూ ఒకే చోట పదెకరాల విస్తీర్ణంలో యాదాద్రి అటవీ నమూనాను అనుసరించి మెగా పార్కును (బృహత్‌ పల్లె ప్రకృతి వనం) తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఒక్కో మెగా పార్కుకు రూ.44 లక్షలు కేటాయిస్తోంది. భద్రాద్రి జిల్లాలో 23 మండలాల్లో 221.03 ఎకరాల స్థలం గుర్తించారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.

పట్టణాల్లో పార్కుల మాదిరిగా పల్లెల్లోనూ ఆహ్లాదాన్ని పంచేలా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామంలోనూ ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. పల్లె వాసులకూ ఆహ్లాదాన్ని పంచుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి మండలంలోనూ ఒకే చోట పదెకరాల విస్తీర్ణంలో యాదాద్రి అటవీ నమూనాను అనుసరించి మెగా పార్కు (బృహత్‌ పల్లె ప్రకృతి వనం)ను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మండల కేంద్రాల్లో ఇప్పటికే స్థలాలను గుర్తించిన అధికారులు పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

221.03 ఎకరాల స్థలం సేకరణ
ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు మండలాల్లో భూములను ఎంపిక చేశారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 23 మండల కేంద్రాల్లో 221.03 ఎకరాల స్థలాన్ని సేకరించి సంబంధిత గ్రామ పంచాయతీలకు అప్పగించారు. కొన్ని చోట్ల పదెకరాల స్థలాన్ని, మరికొన్ని చోట్ల అంతకంటే ఎక్కువ స్థలాన్ని, ఇంకొన్ని చోట్ల అంతకంటే తక్కువగా స్థలాన్ని ఎంపిక చేశారు. ఇలా 18 మండలాల్లో పదెకరాల విస్తీర్ణంలో స్థలాన్ని సేకరించారు. అన్నపురెడ్డిపల్లిలో 12.06 ఎకరాలు, ఇల్లెందులో 8 ఎకరాలు, భద్రాచలంలో 6.01 ఎకరాలు, దమ్మపేటలో 7 ఎకరాలు, జూలూరుపాడులో 8.36 ఎకరాలు, లక్ష్మీదేవిపల్లిలో 9 ఎకరాల చొప్పున బృహత్‌ పల్లె ప్రకృతి వనం కోసం స్థలాలను ఎంపిక చేశారు.

బృహత్‌ పార్కు ఏర్పాటు ఇలా..
పది ఎకరాల బృహత్‌ పల్లె ప్రకృతి వనం కోసం ప్రణాళిక ప్రకారం స్థలాన్ని ఎంపిక చేశారు. పిల్లల ఆట స్థలం కోసం 0.75 ఎకరాలు, నాలుగు భాగాల్లో ప్రతి భాగానికీ 1.715 ఎకరం చొప్పున మొత్తం 6.86 ఎకరాలు, బాహ్య భాగంలో మూడు వరుసల కోసం 1.56 ఎకరాలు, కంచె ఏర్పాటు కోసం 0.14 ఎకరం, దారుల కోసం 0.69 ఎకరం కేటాయించాలి.

బృహత్‌ వనంలో 31 వేల మొక్కలు..
బృహత్‌ ప్రకృతి వనం ఏర్పాటుకు కేటాయించిన పదెకరాల స్థలంలో బాహ్య వలయంలో మూడు వరుసలలో పొడవైన మొక్కలు కనీసం 1.5 నుంచి 2 మీటర్ల పొడవు తగ్గకుండా మొక్కకు మొక్కకు మధ్య మూడు మీటర్ల దూరంలో నీడనిచ్చే, పండ్లనిచ్చే మొక్కలు నాటాలి. స్థలాన్ని నాలుగు సమాన భాగాలుగా విభజించి మధ్యలో 0.75 ఎకరా విస్తీర్ణంలో పిల్లల ఆట స్థలం కోసం కేటాయించాలి. ఆ స్థలంలో కూర్చునేందుకు బల్లలు ఏర్పాటు చేయాలి. 10 అడుగుల పాదచారుల దారిని, నీటి సదుపాయం కోసం అంతర్భగంలో 8 అడుగుల దారిని కేటాయించాలి. సహజ సిద్ధమైన దట్టమైన అడవిని ఏర్పాటు చేయడం కోసం నాలుగు భాగాల్లో సంవత్సరం పొడవునా పచ్చగా ఉండే అటవీ జాతి మొక్కలను దగ్గర దగ్గరగా మొక్క మొక్కకు మధ్య ఒక్క మీటరు దూరం ఉండేలా నాటాలి. ప్రతి 1.71 ఎకరాల భాగంలో 6,925 దట్టమైన మొక్కల చొప్పున నాలుగు భాగాల్లో 6.86 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 27,700 మొక్కలు, బాహ్య మూడు వరుసల కోసం కేటాయించిన 1.56 ఎకరాల విస్తీర్ణంలో 3,300 మొక్కలను మొక్కకు మొక్కకు మధ్య మూడు మీటర్ల దూరంలో మొత్తం 31 వేల మొక్కలను పది ఎకరాల విస్తీర్ణంలో నాటాలి.
తక్కువ విస్తీర్ణం కేటాయించిన మండలాల్లో నాటాల్సిన మొక్కల సంఖ్య కొంత మేర తగ్గే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటి బృహత్‌ ప్రకృతి వనం చిట్టడవిని తలపించేలా చేయాలి.

నాటాల్సిన మొక్కలివే..
బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో నిర్దేశించిన నాలుగు భాగాల్లోని ప్రతి భాగంలో ఇరవై జాతుల మొక్కలకు తక్కువ కాకుండా నాటాలి. ఉసిరి, నేరేడు, టేకు, వెలగ, వేప, ఇప్ప, చందనం, రేగు, కుంకుడు, పనస, చీమచింత, అందుగ, నెమలి, నార, చింత మొదలగు జాతి మొక్కలను నాటాల్సి ఉంటుంది. ఈత, హెన్నా, సీతాఫలం, జామ, దానిమ్మ, కరివేపాకు, నిమ్మ, తాటి వెదురు, జిమ్మి, వావిలి లాంటి పొదల జాతి మొక్కలను నాటేందుకు ప్రాధాన్యమివ్వాలి. తంగేడు, అడ్డసారం, పారిజాతం, తిప్పతీగ, పొడ పత్రి తదితర ఔషధ మొక్కలను కూడా నాటాల్సి ఉంటుంది. బాహ్య వలయంలో జీవకంచ (బయో ఫెన్సింగ్‌) కోసం వెదురు, గచ్చకాయ, గోరింట వంటి మొక్కలను నాటాలి. అలంకారప్రాయమైన మొక్కలు సంవత్సరం పొడవునా లేదా సంవత్సరానికి రెండుసార్లు పుష్పించే మొక్కలను బృహత్‌ ప్రకృతి వనంలో నాటకూడదు. భూమిని తొలగించి పచ్చిక మైదానాలు ఏర్పాటు చేయడం బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో చేయరాదు.ఒక్కో వనానికి రూ.44 లక్షలు ఒక్కో బృహత్‌ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు ప్రభుత్వం రూ.44 లక్షలు కేటాయిస్తోంది. ఇందులో సామగ్రి, మొక్కల కోసం రూ.28 లక్షలు, కూలీలకు రూ.16 లక్షలు వినియోగించనున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పచ్చదనం.. ఆహ్లాదం..
పచ్చదనం.. ఆహ్లాదం..
పచ్చదనం.. ఆహ్లాదం..

ట్రెండింగ్‌

Advertisement