శుక్రవారం 29 మే 2020
Badradri-kothagudem - Jan 08, 2020 , 14:19:51

ట్రాక్టర్లు విధిగా కొనుగోలు చేయాలి

ట్రాక్టర్లు విధిగా కొనుగోలు చేయాలి

-పూర్తి చేసిన పనులను వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి
-వీసీలో అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్
ఖమ్మం, నమస్తే తెలంగాణ, జనవరి 6: ప్రతి గ్రామ పంచాయతీకి విధిగా నూతన ట్రాక్టర్ కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఎంపీడీవోలతో సోమవారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో రెండో విడత పల్లె ప్రగతి పనులు, నూతన ట్రాక్టర్ల కొనుగోలు, డంపింగ్ యార్డు, వైకుంఠధామాల నిర్మాణాల పనుల పురోగతిపై మండలాల వారీగా, పంచాయతీల వారీగా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన ట్రాక్టర్లు కొనుగోలు చేయడానికి గ్రామ పంచాయతీలో సరిపడా నిధులు కలిగిన అన్ని గ్రామ పంచాయతీలు, పంచాయతీ తీర్మానం పొంది సత్వరమే ట్రాక్టర్లను కొనుగోలు చేయాలని సూచించారు. లోన్ ప్రాతిపదికన కొనుగోలు చేసే పంచాయతీలు కూడా ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డంపింగ్ యార్డు, వైకుంఠధామాలకు సంబంధించి ఇప్పటికే గుర్తించిన స్థలాలలో పనులు ప్రారంభించి పంచాయతీరాజ్ శాఖ ద్వారాపూర్తి చేసిన పనులను ఈజీఎస్ వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, ఎంపీడీవోలు సమన్వయంతో పనులను చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీని సక్రమంగా నిర్వహించాలని అన్ని గ్రామ పంచాయతీలకు సరఫరా చేసిన బ్యాగ్స్ నింపడంతో పాటు నర్సరీలో గల మొక్కలను సంబంధిత రిజిస్టరు ప్రకారం సక్రమంగా నిర్వహించాలని ఈ నెల 8 నుంచి ప్లయింగ్ స్కాడ్ బృందాలు నర్సరీల తనిఖీ చేపడతాయని అన్నారు. నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. అటవీ ఫారెస్ట్ రేంజ్ అధికారులు మంగళవారం నుంచి ప్రతి నర్సరీని సందర్శించి నిర్వహణపై తగు సలహాలు, సూచనలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో దాతలను గుర్తించి విరాళాలు సేకరించే ప్రక్రియను అన్ని గ్రామ పంచాకయతీలలో తప్పనిసరిగా చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. పల్లె ప్రగతిలో చేపట్టిన ప్రతి పనినీ తప్పనిసరిగా వెబ్‌సైట్‌లో ప్రతి రోజు అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా అటవీశాఖ అధికారి ప్రవీణ, డీఆర్‌డీవో ఇందుమతి, డివిజనల్ పంచాయతీ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీవోలు తదితరులు వీడియో కాన్పరెన్సులో పాల్గొన్నారు.


logo