గురువారం 04 మార్చి 2021
Andhrapradesh-news - Jan 19, 2021 , 16:36:52

ప్రియుడు చేతిలో యువతి దారుణ హత్య

ప్రియుడు చేతిలో యువతి దారుణ హత్య

అమరావతి : ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్యకు గురైంది. తనను దూరం పెడుతుందన్న కోపంతో ఓ ప్రేమోన్మాది యువతి గొంతు కోశాడు. తీవ్ర గాయాలతో యువతి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి హాస్పిటల్‌లో మృతి చెందింది. ఈ విషాదకరఘటన చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం ఎంపరాళ్ల కొత్తూరు వద్ద మంగళవారం చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. తూర్పుపల్లికి చెందిన గాయత్రి అనే యువతిని పూతలపట్టు మండలం చింతమాకులపల్లికి చెందిన ఢిల్లీ బాబు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గత రెండు నెలలుగా ఇద్దరు ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించారు. యువతి తండ్రి పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాయత్రికి మైనర్‌ కావడంతో పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్‌ ఇచ్చి ఎవరి ఇండ్లకు వారిని పంపించారు.

పోలీసుల మందలింపుతో గత కొద్ది రోజులుగా ఢిల్లీబాబును గాయత్రి దూరం పెడుతూ వస్తోంది. ఫోన్‌ చేయడంతో పాటు నేరుగా కలిసి యువతితో వాగ్వాదానికి దిగుతున్నాడు. తనతో తిరిగి రావాలని, వివాహం చేసుకోవాలని పట్టుబడుతున్నాడు. దీనికి అంగీకరించకపోవడంతో కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఎంపరాళ్ల కొత్తూరు వద్ద నుంచి ద్విచక్ర వాహనం వెళ్తున్న గాయత్రిని అటకాయించి.. వెంట తెచ్చుకున్న కత్తితో గాయత్రిపై దాడి చేశాడు. పొత్తి కడుపులో బలమైన గాయాలు కావడంతో రక్తపు మడుగులో కొట్టమిట్టాడింది. వెంటనే పెనుమూరు హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి ఏలూరులోని సీఎంసీ హాస్పిటల్‌కు తరలించారు.

అక్కడ చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించి మృతి చెందింది. గాయత్రి మరణంతో కోపోద్రిక్తులైన బాధిత కుటుంబీకులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతలమాకులపల్లిలోని నిందితుడి ఇంటిపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఢిల్లీబాబు కోసం గాలింపు చేపట్టారు. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు.

VIDEOS

logo