శుక్రవారం 05 మార్చి 2021
Andhrapradesh-news - Jan 23, 2021 , 12:06:06

విజయ్‌సాయిరెడ్డిపై దాడి కేసు.. ఏ1‌గా చంద్రబాబు!

విజయ్‌సాయిరెడ్డిపై దాడి కేసు.. ఏ1‌గా చంద్రబాబు!

అమరావతి : వైఎస్‌పీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై జరిగిన దాడి కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు కేసు నమోదైంది. కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరును ఏ-1గా నమోదు చేశారు. అలాగే ఏ-2గా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఏ-3గా టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావులతో పలువురిపై కేసు నమోదు చేశారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెల 2వ తేదీన చంద్రబాబు నాయుడు రామతీర్థంకు వచ్చారు. అదే రోజు విజయసాయిరెడ్డి సైతం కొండపైనున్న రాముడి విగ్రహాన్ని పరిశీలించారు. కొండపై ఆలయాన్ని పరిశీలించి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డిని అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న టీడీపీ, బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు విజయసాయిరెడ్డి కారుపై దాడి చేశారు. ఈ ఘటనలో విజయసాయిరెడ్డి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.

ఈ ఘటనకు సంబంధించి అదే రోజు విజయసాయిరెడ్డి నెల్లిమర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఏడుగురు టీడీపీ నేతలను అరెస్ట్ చేసి, గురువారం విజయనగరంలో కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. అయితే రిమాండ్‌ రిపోర్టులో ఏ-1, ఏ-2, ఏ-3 పేర్ల వద్ద ఖాళీలు ఉంచి ఏ-4 నుంచి రిమాండ్‌ విధించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, కళావెంకటరావు పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదై ఉన్నందున రిమాండ్‌ వర్తించే అవకాశం ఉంది. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం వీరిని కూడా నిందితులుగానే గుర్తించే పరిస్థితి ఉంటుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి కళా వెంకట్రావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలోని దేవాలయాలపై, దేవతామూర్తుల విగ్రహాలపై దాడులు జరిగినా ప్రభుత్వం ఇప్పటి వరకు నిందితుల్ని పట్టుకోలేదని విమర్శించాయి.

VIDEOS

logo