బుధవారం 03 మార్చి 2021
Andhrapradesh-news - Jan 22, 2021 , 13:26:50

ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏంచేస్తోంది : పవన్‌ కల్యాణ్‌

ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏంచేస్తోంది : పవన్‌ కల్యాణ్‌

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో 142 ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని జనసేత అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇతర మతాలపై దాడులు జరిగితే ప్రపంచమంతా గగ్గోలు పెడుతుందని, హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే ఎందుకు పట్టించుకోరు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల పట్ల ఒకలా.. ఇతర మతాల పట్ల మరోలా స్పందించడం తప్పన్నారు. అన్ని మతాల పట్ల సమభావమే సెక్యులరిజమని, సెక్యులరిజం అంటే హిందూ ఆలయాలపై దాడులు జరిగితే మౌనంగా ఉండటమా? అని ప్రశ్నించారు.

ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఓ రథం పోతే ఇంకో రథం చేయిస్తాం.. విగ్రహం ధ్వంసం చేసే మరో విగ్రహం పెడుతామంటూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతారా? ఆగ్రహించారు. రాష్ట్రంలో సెక్షన్‌ 144తో పాటు 30 పోలీస్‌యాక్ట్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారని విమర్శించారు. సోషల్‌ మీడియాలో చిన్న పోస్టులు పెడితే నాన్‌బెయిలబుల్‌ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. గిద్దలూరులో జనసేన కార్యకర్త స్థానిక ఎమ్మెల్యేను రోడ్లు సరిగా లేవని నిలదీస్తే .. అతన్ని భయబ్రాంతులకు గురి చేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో జనసేన నాయకులపై జరుగుతున్న దాడులను ఖండించారు.

రాష్ట్రంలో వైపీసీ ఎమ్మెల్యేలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని.. వారికి ఎదురు ఒక్క మాట మాట్లాడనీయడం లేదన్నారు. ఫ్యూడలిజాన్ని తలపిస్తుందని, ప్రజాస్వామ్యంలా లేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని, దళితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన నేతలు.. పేకాట క్లబ్బులను ప్రోత్సహిస్తున్నారన్నారు. అలాగే మీడియాపై జరుగుతున్న దాడులను పవన్‌ కల్యాణ్‌ ఖండించారు.

VIDEOS

logo