సోమవారం 28 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 04, 2020 , 07:50:40

కూలిన జానపద శిఖరం.. వంగపండు ఇక లేరు..

కూలిన జానపద శిఖరం.. వంగపండు ఇక లేరు..

అమరావతి : తన పాటతో ప్రజలను చైతన్యం చేసిన ఉత్తరాంధ్ర జానపద శిఖరం కూలిపోయింది. ప్రముఖ వాగ్గేయకారుడు, ప్రజాకవి వంగపండు ప్రసాదరావు (77) విజయనగరం జిల్లా పార్వతీపురం వైకేఎంనగర్‌లో మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. 1943 జూన్‌లో పార్వతీపురం పెదబొండపల్లిలో జన్మించిన ఆయన ఉత్తరాంధ్ర గద్దర్‌గా పేరుగాంచారు. ప్రజల కోసం బ్రతికిన నాజర్‌లాంటి కళాకారుడని వంగపండును పోలుస్తారు. ఆయన గద్దర్‌తో కలిసి 1972లో పీపుల్స్ వార్ సాంస్కృతిక విభాగమైన జన నాట్యమండలిని స్థాపించి, అధ్యక్షుడిగా పని చేశారు.


2017లో ఏపీ ప్రభుత్వం నుంచి కళారత్న పురస్కారం, 2008లో బొల్లిముంత శివరామకృష్ణ సాహితీ అవార్డును అందుకున్నారు. వంగపండు మూడు దశాబ్దాలలో 300 నుంచి 400కుపైగా పాటలు రాశారు. అందులో 12 పాటలు అన్ని గిరిజన మాండలికాలతో పాటు తమిళం, బెంగాళీ, కన్నడ, హిందీ వంటి పది భారతీయ భాషల్లోకి కూడా అనువదించబడ్డాయి. ‘యంత్రమెట్టా నడుస్తు ఉందంటే...’ అనే పాట ఒక ఆచార్యుడితో ఆంగ్లంలోకి అనువదించబడి అమెరికా, ఇంగ్లాండ్‌లోనూ అభిమానం చూరగొన్నది.

అలాగే ఆయన 30కిపైగా సినిమా పాటలు రాశారు. ముఖ్యంగా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ.. వారిని పోరాటానికి సిద్ధం చేసిన ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’ అంటూ పాడిన పాట ఎందరినీ ఆలోచింప జేసింది. క‌రోనా స‌మ‌యంలో.. క‌వులు, క‌ళాకారులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని.. వారిని ఆదుకోవాలంటూ తాజాగా డిమాండ్ చేసిన వంగ‌పండు.. ఇవాళ తుదిశ్వాస విడ‌వ‌డంతో.. క‌వులు, క‌ళాకారులు సంతాపం ప్రకటించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo