మంగళవారం 20 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Sep 04, 2020 , 22:50:47

టీటీడీ జ్యుట్ బ్యాగ్ లకు పెరిగిన ఆదరణ

  టీటీడీ జ్యుట్ బ్యాగ్ లకు పెరిగిన ఆదరణ

తిరుపతి : తిరుమలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా లడ్డూ ప్రసాదాల పంపిణీ కోసం టీటీడీ ఏడాది క్రితం ప్రారంభించిన జ్యుట్ బ్యాగ్( నార సంచి) లకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. lలడ్డూ ప్రసాదాల పంపిణీ కోసం టీటీడీ ప్లాస్టిక్ కవర్లు విక్రయించేది. దీనివల్ల పర్యావరణానికి నష్టం జరుగుతోందనే ఆలోచనతో ప్లాస్టిక్ కవర్ల స్థానంలో ప్రత్యామ్నాయ ఆలోచన చేసింది. తొలుత పేపర్ కవర్లు ప్రవేశ పెట్టింది. వీటితో పాటు జ్యుట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రసాదాల పంపిణీ కోసం ప్రత్యేకంగా బ్యాగులు తయారుచేసి సరఫరా చేయడానికి ముందుకు వచ్చింది.

ప్రసాదాలను తీసుకుని వెళ్ళడానికి ఇవి అనువుగా ఉండటంతో భక్తుల నుంచి ఆదరణ లభిస్తున్నది. ఏడాది క్రితం ప్రవేశపెట్టిన ఈ బ్యాగుల విక్రయాలు అంతకంతకు పెరుగుతున్నాయి. 5 లడ్డూలు పట్టే బ్యాగు రూ 25, 10 లడ్డూల బ్యాగు రూ 30, 15 లడ్డూలు తీసుకుని వెళ్లగలిగే బ్యాగు రూ 35, 25 లడ్డూలు తీసుకుని వెళ్లగలిగే బ్యాగు ధర రూ 55 చొప్పున విక్రయిస్తున్నారు. ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి పీల్చక పోవడం ఈ బ్యాగు ప్రత్యేకత.

సేలంకు చెందిన మోహన్ కౌన్డర్ మాట్లాడుతూ తిరుమల లడ్డూలు తీసుకుని వెళ్ళడానికి జ్యుట్ బ్యాగు చాలా ఉపయోగంగా ఉందన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇవి చాలా ఉపయోగంగా ఉన్నాయని చెప్పారు. ముంబై కి చెందిన భూషణ్ కడెకర్ మాట్లాడుతూ  వారి లడ్డూ ప్రసాదాన్ని దూర ప్రాంతానికి క్యారీ చేయడానికి జ్యుట్ బ్యాగ్ చాలా ఈజీ గా ఉందన్నారు. ప్లాస్టిక్ కవర్ల కంటే ఇవి ఎంతో మేలనీ, పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఉపయోగ పడతాయని ఆయన చెప్పారు.


logo