తిరుమలలో పవిత్ర ఉద్యానవనాలు...

తిరుమల : భూలోక నందన వనంగా భాసిల్లుతున్న తిరుమలలో పురాణాలలో పేర్కొన్న విధంగా శ్రీవారి సేవకు వినియోగించే మొక్కలతో పవిత్ర ఉద్యానవనాలు త్వరలో ఏర్పాటు చేయునున్నట్లు ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. తిరుమలలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ఉద్యానవనాలను ఈవో, అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డితో కలిసి శుక్రవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వరాహపురాణంలోని 38వ అధ్యాయంలో పేర్కొన్న విధంగా సప్తగిరులలోని శ్రీ వెంకటాచలంపై వెలసి ఉన్న స్వామివారు భక్తులకు కోరిన వరాలు ప్రసాదించే కల్పవృక్షంగా, కామధేనువుగా, చింతామణిగా భాసిలుతున్నట్లు పేర్కొనడం జరిగిందన్నారు.
వరాహపురాణంలో పేర్కొన్న విధంగా దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో పూల మొక్కలను పెంచనున్నట్లు తెలిపారు. ఇందులో ఏడు ఆకులు కలిగిన అరటి చెట్లు, తులసి, ఉసిరి, మోదుగ, జువ్వి, జమ్మి, దర్భ, సంపంగి, మామిడి, పారిజాతం, కదంబం, రావి, శ్రీగంథం, అడవి మల్లి, మొగలి, పున్నాగ, అశోక, పొగడ, యర్ర గన్నెరు, తెల్ల గన్నెరు ఉన్నాయి. వీటితో పాటు నాబి, మాదిఫల, బొట్టుగు, భాందిరా వంటి వృక్షాలను కూడా అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తిరుమలలోని జిఎన్సి టోల్ గేట్ వద్ద గల గీతా ఉద్యానవనం, శ్రీ పద్మావతి వసతి సముదాయాల వద్ద ఐదు ఎకరాలను జిఎంఆర్ సహకారంతో టిటిడి ఉద్యానవన విభాగం, అటవీ విభాగం ఆధ్వర్యంలో అభివృద్ది చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. నారాయణగిరి ఉద్యానవనాలు, శిలాతోరణంను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా తిరుమల విద్యుత్ అవసరాలకు ధర్మగిరి అటవీ ప్రాంతంలో 20 ఎకరాలలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.