ఆదివారం 09 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 16, 2020 , 19:50:03

శ్రీవారి ఆలయంలో భక్తుల దర్శనం కొనసాగిస్తాం : టీటీడీ చైర్మన్‌

శ్రీవారి ఆలయంలో భక్తుల దర్శనం కొనసాగిస్తాం : టీటీడీ చైర్మన్‌

తిరుమల : శ్రీవారి ఆలయంలో భక్తుల దర్శనాలు కొనసాగుతాయని టీటీడీ పాలకమండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న విధానంలో ఎలాంటి మార్పులు లేవని చెప్పారు. ఆలయంలో నిత్య కైంకర్యాలను, ఇతర కార్యక్రమాలు ఆగమశాస్త్రబద్దంగా నిర్వహిస్తున్నామని చైర్మన్‌ గురువారం తెలిపారు. దేశ, రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో భక్తుల భద్రత కోసం మెరుగైన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. టీటీడీలో ఇప్పటి వరకు 140 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, వీరిలో ఏపీఎస్పీలో పని చేసే దాదాపు 60 మంది భద్రతా సిబ్బందికి, 16 మంది పోటు కార్మికులు, 14 మంది అర్చకులు, ఇతర ఉద్యోగులు ఉన్నారని తెలిపారు.

70 మంది ఇప్పటికే కోలుకున్నారని, కొందరు హోం క్వారంటైన్‌లో ఉండగా, మిగతా వారంతా విధులకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. మరో 70 మంది కోలుకుంటున్నారని, ఒకరు మాత్రమే స్విమ్స్‌ ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, త్వరలోనే కోలుకుంటాడని డాక్టర్లు చెప్పారు తెలిపారు. శ్రీవారి ఆలయంలో విధుల్లో మొత్తం 40 మంది అర్చకులు ఉండగా, 14 మందికి పాజిటివ్‌ రావడంతో స్వామి వారికి కైంకర్యాలు నిర్వహించేందుకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చూసేందుకు అర్చకుల ఆరోగ్యంపై సమీక్షించినట్లు సుబ్బారెడ్డి తెలిపారు.

వేర్వేరు గదులు కేటాయించి భోజన వసతి కల్పించాలని, వయసు పైబడిన అర్చకులను ఇళ్లలోనే ఉండేందుకు, తిరుపతిలో విధులు కేటాయించాలని అర్చకులు కోరారని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చైర్మన్‌ చెప్పారు. తిరుమలలో భక్తులెవరికీ కరోనా పాజిటివ్‌ రాలేదని, వారి నుంచి ఉద్యోగులకు వైరస్‌ సోకలేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంతాల ద్వారా మాత్రమే కేసులు నమోదయ్యాయని చెప్పారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo