బుధవారం 28 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Sep 12, 2020 , 20:32:31

వైద్య కళాశాలల నిర్మాణాలకు నిధులు విడుదల చేసిన ఏపీ సర్కారు

వైద్య కళాశాలల నిర్మాణాలకు నిధులు విడుదల చేసిన ఏపీ సర్కారు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.2050 కోట్లు పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు గతం లో నిర్ణయించింది. విశాఖ జిల్లా పాడేరులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రూ.500 కోట్లు ఇవ్వనున్నారు. అలాగే, కడప జిల్లా పులివెందులలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు రూ.500 కోట్లు, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల లో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు రూ.500 కోట్లు, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రూ.550 కోట్లకు పరిపాలనా అనుమతులు జారీ చేసింది ప్రభుత్వం. పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల మెడికల్ కాలేజీల్లో చెరో 100 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు అయ్యాయి.

మచిలీపట్నం మెడికల్ కాలేజీ లో 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటాయి. అమలాపురం, ఏలూరు, పిడుగురాళ్ల, మదనపల్లి, ఆదోని, పులివెందులలో కాలేజీలకు రూ.104.17 కోట్లతో స్థలాల కొనుగోలుకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటకు గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ రోజు విశాఖపట్నం జిల్లా పాడేరు, కడప జిల్లా పులివెందుల లోను, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, కృష్ణ జిల్లా మచిలీపట్నం లోను మెడికల్ కాలేజీల ఏర్పాటు నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసినందుకు ఏపీఎన్జీవోస్‌ అసోసియేషన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీల ఏర్పాట చేయడం వలన ఆ ప్రాంతంలో ఆసుపత్రి సౌకర్యాలు మెరుగుపడి ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. దాదాపు 450 మెడికల్ విద్యార్దులు చదువుల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్ళకుండా మన రాష్ట్రంలోనే చదువుకొనే విధంగా అవకాశం కలిగిందన్నారు. 


logo